రూ. 7,457 కోట్లతో ‘పేదరిక నిర్మూలన’!


బడ్జెట్‌ ప్రతిపాదనలు సిద్ధం చేసిన సెర్ప్‌

సాక్షి, హైదరాబాద్‌: గ్రామీణ పేదరిక నిర్మూలన కార్యక్రమాలకు వచ్చే ఆర్థిక సంవత్సరం లో రూ.7,457 కోట్లు అవసరమవుతాయని సర్కారు అంచనా వేసింది. 2017–18 బడ్జెట్‌ ప్రతిపాదనల రూపకల్పనకు కసరత్తు చేసిన గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) తాజాగా బడ్జెట్‌ అంచనాలను ప్రభుత్వానికి అందజేసింది.ఇందులో సింహభాగం ఆసరా పింఛన్లకే పోతుండటంతో ఇతర కార్యక్రమా ల అమలుపై ప్రభావం పడుతుందని కొంద రు అధికారులు భావిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తం గా 36లక్షల మంది ఆసరా లబ్ధిదారుల పింఛన్ల కోసం ఏటా రూ.4,787 కోట్లు అవసరమని సెర్ప్‌ పేర్కొంది.


తాజాగా ప్రభుత్వం ఒంటరి మహిళలకు ఆర్థిక భృతి అందించాలని నిర్ణయించడంతో, సుమారు 2లక్షల మందికి రూ.247కోట్లు అవసరమని అంచ నా వేసింది.మొత్తం రూ.5,034 కోట్లు ఆసరా పింఛన్ల కింద ప్రభుత్వం ఖర్చు చేయాలని భావిస్తోంది. సామాజిక భద్రతా పింఛన్లకు కేంద్రం నుంచి రూ.209.58కోట్లు వస్తాయని అధికారులు అంచానా వేశారు. గత రెండున్నరేళ్లుగా వడ్డీలేని రుణాలు తీసుకొని తిరిగి చెల్లించిన స్వయంసహాయక సంఘాల మహిళలకు వడ్డీల బకాయిలతో కలిపి మొత్తం రూ.663.51 కోట్లు అవసరమవుతాయని అంచనా.   



పట్టాలెక్కనున్న ‘పల్లె ప్రగతి’!

రాష్ట్రంలోని 150 వెనుకబడ్డ మండలాల్లో పేదల జీవన ప్రమాణాలు పెంచేందుకు రూ.642 కోట్లతో ప్రారంభించిన తెలంగాణకు పల్లె ప్రగతి పథకానికి గతేడాది రూ.40 కోట్లు బడ్జెట్‌లో ప్రతిపాదించినా.. సర్కారు నిధులివ్వలేదు. దీంతో ప్రపంచ బ్యాంకూ నిధులివ్వలేదు. స్త్రీనిధి బ్యాంకు ద్వారా పేద మహిళలకు రుణాలందించేందుకు గతేడాది కన్నా ఈ సారి ఎక్కువ మొత్తంలో నిధులివ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది.


తాజా ప్రతిపాదనలలోరూ.274 కోట్లు ఇవ్వాలని పేర్కొనడం స్త్రీ బ్యాంకు సిబ్బందికి ఊరటనిచ్చే అంశం. జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ కు సంబంధించి ఎటువంటి ప్రతిపాదనలు చేయకపోవడం గమనార్హం. అభయహస్తం పథకం కోసం తాజా బడ్జెట్‌ ప్రతిపాదనల్లో రూ.399.33 కోట్లు ఇవ్వాలని భావిస్తోంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top