‘తోడు’ పెళ్లికొడుకు..!

‘తోడు’ పెళ్లికొడుకు..! - Sakshi


ఆయనో ఎమ్మెల్సీ ... టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరారు. పదవీ కాలం ముగియగానే, తిరిగి రెండో సారి టీఆర్‌ఎస్ నుంచి అవకాశం అందివచ్చింది. అయితే, ఆయన పార్టీ అధికార ప్రతినిధి కాదు. ప్రభుత్వ విప్ అంతకన్నా కాదు. కానీ, అన్ని అంశాలపై స్పందిస్తూ విపక్షాల విమర్శలను ఖండ ఖండాలుగా ఖండిస్తూ..  పార్టీ రుణం తీర్చుకునే పనిలో యమబిజీగా ఉన్నారు. పొద్దస్తమానం టీఆర్‌ఎస్ ఎల్పీ కార్యాలయం చుట్టూ ఉప గ్రహంలా పరిభ్రమిస్తున్నారు. మంత్రి.. ఎమ్మెల్యే.. ఎమ్మెల్సీ... ఇలా ఎవరైనా కానీ..   ఏ జిల్లా వారైనా కానీ.. ప్రెస్‌మీట్ పెట్టుడే ఆలస్యం ఠక్కున వాలిపోతున్నారు.. ‘తోడు’ పెళ్లికొడుకులా తయారైపోతున్నారు.



వేదికను పంచుకుంటున్నారు. కాంగ్రెస్, టీడీపీ.. అన్న భేదమేమీ లేకుండా ఒంటికాలిపై లేస్తున్నారు. ‘ఆవకాయ పచ్చడి నుంచి.. అమెరికా రాజకీయాల ’ దాకా.. ఏ అంశంపైనైనా సరే ..,  అలవోకగా.. అన్నింటిపైనా ఆయన   గొంతు విప్పాల్సిందే. ఆయా నేతల సొంత జిల్లాల సమస్యలపైనా ఈ ఎమ్మెల్సీ  స్పందిస్తున్నారు.. విపక్షాలపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఇదెక్కడి గోల అంటూ మీడియా ప్రతినిధులు ఒక వైపు... ఎలా చెప్పాలో అర్థం కాక గులాబీ నేతలు తలలు బద్దలు కొంటుకుంటున్నారు.  ఇంతా చేస్తే... ఆయన తన సొంత జిల్లా సమస్యలపై ఏనాడూ పెదవి విప్పకపోవడం కొసమెరుపు...!!

 

 

 

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top