మీ హామీలు నీటిమూటలేనా

మీ హామీలు నీటిమూటలేనా - Sakshi


► మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌




కరీంనగర్: ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాటలు కోటలు దాటుతున్నా.. చేతలు గడప దాటడం లేదని.. ప్రజాస్వామ్యం అపహాస్యం పాలయ్యేలా పరిపాలన సాగిస్తూ ప్రజలను మభ్యపెడుతున్న ఆయనకు ప్రజాక్షేత్రంలో భంగపాటు తప్పదని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ హెచ్చరించారు. కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కరీంనగర్‌ ఎంపీగా ఎన్నికైన సందర్భం నుంచి ఈ రోజు వరకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకుండా కరీంనగర్‌ ప్రజలను దగా చేస్తున్నారని ఆరోపించారు. తొలిసారిగా కరీంనగర్‌లో సీఎంగా పర్యటించిన సమయంలో 2014 ఆగస్టు 5న జిల్లా కేంద్రంలో 4 గంటలు సమీక్ష జరిపి 40 వరాలు ఇచ్చి మూడేళ్లు గడుస్తున్నా ఏ ఒక్క హామీకి అతీగతీ లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు.



కరీంనగర్‌ను లండన్, న్యూయార్క్, మోడల్‌ నగరంగా తీర్చిదిద్దుతానని, అద్దం తునకలాగా మెరిపిస్తానని, రింగ్‌రోడ్డులు, ఫోర్‌లేన్‌ రహదారులు నిర్మిస్తానని చెప్పిన మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు. లోయర్‌ మానేరు డ్యాం ప్రాంతాన్ని మైసూరులోని బృందావన్‌ గార్డెన్‌లా తీర్చిదిద్దుతానని, డ్యాంలో బోటింగ్, రెస్టారెంట్లు ఏర్పాటు చేసి పర్యాటకులు విడిది చేసేందుకు వీలుగా విల్లాస్‌ నిర్మిస్తానని ఇచ్చిన వాగ్ధానాలు ఎక్కడ పోయాయని ప్రశ్నించారు.మెడికల్‌ కళాశాల మంజూరు ఏమైందని, నిమ్స్‌ తరహా ఆసుపత్రి హామీ ఆటకెక్కిందని, లెదర్‌పార్క్, సైనిక్‌స్కూల్, అగ్రికల్చర్‌ యూనివర్సిటీ, టెక్స్‌టైల్స్‌ మెగా పార్కులు ఇతర జిల్లాలకు తరలిపోయాయని దుయ్యబట్టారు.


తాజాగా మరోమారు హైదరాబాద్‌లో 9 గంటలు సమీక్ష జరిపి మానేరు రివర్‌ ఫ్రంట్‌ను నిర్మించి కరీంనగర్‌ పట్టణాన్ని దేశంలోనే అతిపెద్ద పర్యాటక కేంద్రంగా మారుస్తానని మరోసారి డ్రామాలకు తెరలేపుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీరు మార్చుకోవాలని సూచించారు. పూటకో అబద్దం అడుతూ రోజుకో జీవో తెస్తూ ప్రజలను మభ్యపెడుతూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న తీరును ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు. మూడేళ్లల్లో కేసీఆర్‌ ఇచ్చిన వాగ్దానాలను పరిశీలిస్తే మాటల పోశెట్టి కేసీఆర్‌గా అనాల్సి వస్తోందని వాఖ్యానించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top