అమరులను అవమానించినట్లు కాదా?

అమరులను అవమానించినట్లు కాదా? - Sakshi


 ప్రభుత్వాన్ని నిలదీసిన టీపీసీసీ చీఫ్ పొన్నాల

 

 సాక్షి, హైదరాబాద్: ‘కేవలం 462 మందినే తెలంగాణ అమరవీరులుగా గుర్తించినట్లు ప్రకటించడం వారిని అవమానించినట్లు కాదా? వారి కుటుంబాలను మోసం చేసినట్లు కాదా?’ అని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బుధవారమిక్కడ గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ప్రభుత్వ తొలి కేబినెట్ భేటీలో 1969 నుంచి ఇప్పటివరకు ప్రాణత్యాగం చేసిన అమరుల కుటుంబాలను గుర్తిస్తామని, వారికి ఇళ్లస్థలాలు, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలతో పాటు రూ. 10 లక్షల పరిహారాన్ని చెల్లిస్తామని పేర్కొంది’ అని గుర్తుచేశారు. తెలంగాణను సాధించుకున్నా అవగాహన లేమి, అనుభవరాహిత్య ప్రభుత్వంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అమరుల గుర్తింపులో సర్కారు గందరగోళానికి తెరతీసిందన్నారు. ఉద్యమం 60 ఏళ్లదని చెప్పే సీఎం, పరిహారం మాత్రం 462 కుటుంబాలకే ఇస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం వద్ద వారి వివరాలు లేకుంటే.. వాటిని ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందన్నారు. ‘మేమేం విషయాన్ని ప్రశ్నించినా.. రాజకీయం చేస్తున్నారంటూ అధికార పక్షం మాట్లాడుతోంది. విపక్షాలు, ఉద్యమకారులు ప్రశ్నిస్తే.. ఉద్యమిస్తే.. కోర్టులు మందలిస్తే.. కేంద్రం స్పందిస్తే తప్ప ఒక్క అడుగు కూడా ముందుకు పడడం లేదు. రైతుల రుణమాఫీ, వాహనాల నంబర్ ప్లేట్లు, ఎంసెట్ కౌన్సెలింగ్, ఫాస్ట్ పథకం, మెట్రోరైలు వంటివాటిలో అస్పష్టతే.. గందరగోళమే’ అని విమర్శించారు. ఎవరు అడగకుండానే బతుకమ్మ పండుగకు రూ. పది కోట్లు మంజూరు చేశారని ఇతర విషయాల్లో ఆసక్తి ఎందుకు లేదని పొన్నాల ప్రశ్నించారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top