ముఖ్యులు దూరం

ముఖ్యులు దూరం


కాంగ్రెస్ సభ్యత్వ నమోదుకు ప్రధాన నేతలు గైర్హాజరు

తెలంగాణ పీసీసీ చీఫ్ వైఖరే కారణమని పార్టీ శ్రేణుల్లో చర్చ

వచ్చిన నాయకులు కూడా అలకపాన్పు

దూషణలు.. కొట్లాటలతో సాగిన ప్రారంభ సమావేశం

టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన పొన్నాల


 

వరంగల్ : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ముఖ్య అతిథిగా హన్మకొండలోని డీసీసీ భవన్‌లో మంగళవారం జరిగిన సభ్యత్వ నమోదు కార్యక్రమం ఆ పార్టీలోని గ్రూపు తగాదాలను మరోసారి బహిర్గతం చేసింది. ప్రారంభ సమావేశానికి పలువురు ముఖ్య నేతలు దూరంగా ఉండగా, అలకపాన్పులు.. తోపులాటల మధ్యనే కార్యక్రమాన్ని కొనసాగించారు. కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్, రాష్ట్ర మాజీ మంత్రి సారయ్య, మాజీ ఎంపీ సిరిసిల్ల, జిల్లాకు చెందిన ఒకే ఒక ఎమ్మెల్యే రెడ్యా నాయక్, మాజీ ఎమ్మెల్యే కవిత, మాజీ చీఫ్ విప్ గండ్ర, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు ఇనుగాల వెంకట్రాంరెడ్డి,  వెంకటస్వామిగౌడ్, కాంగ్రెస్ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు పొన్నాల వైశాలి తదితరులు సభ్యత్వ నమోదు కార్యక్రమానికి గైర్హాజరయ్యారు.



జిల్లాపరిషత్ ఎన్నికల పరిణామాల నేపథ్యంలో పొన్నాల హాజరైన ఈ సమావేశానికి కావాలనే దూరంగా ఉన్నట్లు ఆ పార్టీ శ్రేణుల్లో చర్చ సాగుతోంది. మరోవైపు కాంగ్రెస్ సభ్యత్వ నమోదు వేదికపైకి నేతలను ఆహ్వానించే సమయంలో ప్రొటోకాల్ పాటించలేదంటూ పీసీసీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ హరిరమాదేవి అలకబూనారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి, ఆ పార్టీ నాయకుడు వరదరాజేశ్వర్‌రావు ఆమెకు నచ్చజెప్పి వేదికపైకి తీసుకెళ్లారు. ఈ క్రమంలో వేదికపైకి తూర్పు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుడు బస్వరాజు కుమారస్వామిని ఆహ్వానించాలని కొందరు నినాదాలు చేశారు. దీంతో ఆయనను వేదికపైకి ఆహ్వానించారు. ఇక..  పీసీసీ అధ్యక్షుడు పొన్నాల మాట్లాడుతుండగా నర్సంపేటకు చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు ఒక్కసారిగా లేచి తమకు మాట్లాడే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.



వారిని పలువురు నాయకులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. పరస్పర దూషణలు చేసుకుంటూ కొట్లాటకు దిగడంతో వారిని హాలు నుంచి బయటికి వెళ్లగొట్టారు. వీరందరూ మాధవరెడ్డి అనుచరులుగా భావిస్తున్నారు. గందరగోళం మధ్యనే డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి అధ్యక్షతన ప్రారంభమైన కార్యక్రమంలో పీసీసీ చీఫ్ పొన్నాల ముందుగా రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనందభాస్కర్‌కు సభ్యత్వ నమోదు రశీదును అందజేశారు. ఆ తర్వాత వరుసగా నాయిని రాజేందర్‌రెడ్డి, కాంగ్రెస్ నగర అధ్యక్షుడు తాడిశెట్టి విద్యాసాగర్, మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, పీసీసీ కార్యదర్శి డాక్టర్ హరిరమాదేవికి సభ్యత్వం కల్పిస్తూ రశీదులు ఇచ్చారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.



టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సమావేశంలో నాయకులు  విజయరామారావు, కొండేటి శ్రీధర్, పొదెం వీరయ్య, బండా ప్రకాష్, బొచ్చు సమ్మయ్య,  పుల్లా పద్మావతి, పుల్లా భాస్కర్, మంద వినోద్‌కుమార్, సాంబారి సమ్మారావు, బొద్దిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, వరద రాజేశ్వర్‌రావు, జంగా రాఘవరెడ్డి, ఘంటా నరేందర్‌రెడ్డి, ఈవీ శ్రీనివాస్, జమాల్ షరీఫ్, బట్టి శ్రీనివాస్, పోశాల పద్మ, నమిండ్ల శ్రీనివాస్, డాక్టర్ శ్రీధర్, కొత్తపల్లి శ్రీనివాస్, మెడకట్ల సారంగపాణి, ఆశం కళ్యాణ్, చందుపట్ల ధన్‌రాజ్, మండల సమ్మయ్య, కూర కుమార్, బిన్ని లక్ష్మణ్, తాడిశెట్టి మధు, నలుబోల రాజ, తోట వెంకన్న, నెక్కొండ కిషన్, పసుల యాకస్వామి, కానుగంటి శేఖర్, నరొత్తమరెడ్డి పాల్గొన్నారు. కాగా, పొన్నాలను జిల్లా నాయకులు గజమాలతో ఘనంగా సన్మానించారు.

 

దొరల పాలనగా మారితే సహించరు : పొన్నాల


కొత్త రాష్ట్రంలోని కొత్త ప్రభుత్వం పరిపాలన దొరల పాలనగా మారితే ఈ గడ్డ ప్రజలు సహించరని... చరమగీతం పాడుతారని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య హెచ్చరించారు. ప్రజాస్వామ్య ముసుగులో సీఎం కేసీఆర్ నియంతృత్వంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజలకు ఇచ్చిన హామీలపై ప్రశ్నిస్తే అధికార పార్టీ నేతలు అవహేళన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ సొంత నియోజకవర్గంలోనే ప్రజలపై దాడులు చేశారని ధ్వజమెత్తారు.



రుణమాఫీ అమలు చేయకపోవడం వల్ల 240 మంది ైరె తులు ఆత్మహత్యలు చేసుకున్నారని, వీరిని పరామర్శించే తీరిక ఈ నాయకులకు లేదా.. అని ప్రశ్నించారు. తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన అమరవీరులను ఆదుకోవడంతో జాప్యం చేసిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం... చివరకు 460 మందిని ఆదుకుంటున్నట్లు ప్రకటించి చేతులు దులుపుకుంటోందని విమర్శించారు. 1200 మందికి అండగా నిలిస్తే పోయేదేముందని పొన్నాల అన్నారు. చెరువుల పునరుద్ధరణ, వాటర్‌గ్రిడ్, మూడెకరాల భూమి, మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు, 120 గజాల్లో ఇళ్ల నిర్మాణంలో ఏ ఒక్కటీ అమలుకు నోచుకోలేదన్నారు.



జిల్లాకు గోదావరి నీళ్లు, గూగుల్‌తో ఒప్పం దం చేసుకుని 3జీ సేవలు, ఐటీఐఆర్ తెచ్చిన ఘనత కాంగ్రెస్‌దేనన్నారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని ఉండాలంటూ కాళోజీ సభలో ఉప ముఖ్యమంత్రి రాజయ్యను హెచ్చరించారని, అదే పది రోజుల్లో హెల్త్ యూనివర్సిటీ ఎలా వచ్చిందన్నారు. కేసీఆర్ పాలన రికార్డేనని, ఖరీఫ్‌లో రుణమివ్వకుండానే కాలం గడిచిందని... ఎంసెట్ కౌన్సిలింగ్, నంబర్ ప్లేట్లు, ఫాస్ట్ పథకంపై కోర్టు మొట్టికాయలు వేసిందంటూ ఎద్దేవా చేశారు. సభ్యత్వ రశీదు అపురూపమైందంటూ 1948లో ‘మా అయ్య జీతగాడిగా కాంగ్రెస్ సభ్యత్వ రశీదు తీసుకుని 1990 వరకు దాచుకున్నాడని’ వివరించారు. విద్రోహుశక్తుల దాడుల్లో ఇల్లు ధ్వంసం కావడంతో అది కాలిపోయిందన్నారు.



ఇచ్చిన మాటకు కట్టుబడి సోనియూ గాంధీ తెలంగాణ ఇస్తే ప్రజలు ఆదరించలేదన్నారు. తెలంగాణ ఒక్క కేసీఆర్‌తో రాలేదని అన్ని వర్గాలు కలిసి ఒత్తిడి తెచ్చారన్నారు.  సకల జనుల సమ్మె, మిలియన్ మార్చ్ సమయంలో కేసీఆర్ ఎక్కడున్నారంటూ ప్రశ్నించారు. వివాదాలు లేకుండా కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీ పటిష్టానికి కృషిచేయాలని,  రానున్న నగర పాలక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. త్వరలో జిల్లా నూతన కార్యాలయం ఏర్పాటు చేయాలని సూచిం చారు. రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనందభాస్కర్ మాట్లాడుతూ కాంగ్రెస్ జలధార వంటిదని, ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా తిరిగి నిలబడుతుందన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top