సర్కారు కాదు.. సెన్సార్ బోర్డు..

సర్కారు కాదు.. సెన్సార్ బోర్డు.. - Sakshi


ఖమ్మం: ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నది సర్కారు కాదని, సెన్సార్ బోర్డు అని ఎమ్మెల్యే పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ఆయన ఆదివారం ఖమ్మం ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైతే తమ కష్టాలు తొలగుతాయని ఆశించిన ప్రజలకు మరిన్ని కష్టాలు వచ్చిపడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ అధికారంలోకి రాగానే సర్వేల పేరుతో ప్రజలను భయబ్రాంతులను చేస్తున్నారని అన్నారు. రేషన్ కార్డులు, పెన్షన్లు, విద్యార్థుల పీజు రీయింబర్స్ మెంట్.. ఇలా ఒకొక్క పథకానికి కోత పెడుతున్నారని, తద్వారా తనది ‘సర్కారు కాదు.. సెన్సార్ బోర్డు’ అని నిరూపిస్తున్నారని ధ్వజమెత్తారు. విద్యుత్ కోత కారణంగా పరిశ్రమలు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాయని అన్నారు.



ప్రతి నెల చెల్లించే రాయల్టీలు తగ్గించాలని డిమాండ్ చేశారు. గ్రానైట్ పరిశ్రమ కష్టకాలంలో ఉన్నప్పుడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి రాయల్టీలను తగ్గించి ఆదుకున్నారని అన్నారు. గిరిజనుల సమస్యలు తదితరాంశాలను చర్చించేందుకు రాష్ట్ర ప్రభుత్వం శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన గిరిజన సలహా మండలి సమావేశంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, ముంపు ప్రాంత గిరిజనుల పరిస్థితిపై మాట్లాడకపోవడం బాధాకరమని అన్నారు. ఈ సమావేశంలో యువజన కాంగ్రెస్ నాయకుడు మనోహర్ నాయుడు, మైనార్టీ విభాగం నాయకుడు ఫజల్, కాంగ్రెస్ నాయకుడు కట్ల రంగారావు తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top