ఖమ్మంను స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయాలి

ఖమ్మంను స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయాలి - Sakshi


కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడికి ఎంపీ పొంగులేటి వినతి



సాక్షి, న్యూఢిల్లీ: ఐదు లక్షలకుపైగా జనాభా ఉన్న ఖమ్మంను స్మార్ట్ సిటీగా ప్రకటించి అభివృద్ధి చేయాలని వైఎస్సార్ సీపీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడుకు వినతి పత్రాన్ని అందజేశారు. అర్బన్ మండలంలోని 9 గ్రామాలను విలీనంచేస్తూ ఖమ్మం కార్పొరేషన్‌గా ప్రకటించారని, అయితే కనీస వసతులు కల్పించడంలో మాత్రం అధికారులు విఫలమయ్యారని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఖమ్మం నగరానికి పూర్తిస్థాయి కమిషనర్ లేకపోవడంతో సమస్యలు తీవ్రమయ్యాయని, పారిశుధ్య నిర్వహణ లోపించిందని, తక్షణమే ఐఏఎస్ అధికారిని కమిషనర్‌గా నియమించాలని కోరారు.



ఖమ్మంలో లక్షకు పైగా ఇళ్లుండగా 25వేల లోపే నల్లా కనెక్షన్లు ఉన్నాయని, దీంతో తాగునీటి సమస్య ఎక్కువైందని నివేదించారు. అస్తవ్యస్తమైన డ్రైనేజీ వ్యవస్థతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వీలైనంత త్వరగా అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరారు. గాలి దుమారాలకు చెట్లు విరిగి విద్యుత్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని, అండర్ గ్రౌండ్ విద్యుత్ లైను ఏర్పాటు చేయాలని విన్నవించారు. ఖమ్మం కార్పొరేషన్‌లో వీధిదీపాల స్థానంలో ఎల్‌ఈడీ లైట్లను ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే, కొత్తగూడెంను కూడా స్మార్ట్ సిటీగా ప్రకటించాలని కోరారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top