ఖమ్మం స్మార్ట్ సిటీకి పొంగులేటి కృషి


సాక్షి, ఖమ్మం: స్మార్ట్ సిటీ జాబితాలో ఖమ్మం కార్పొరేషన్‌కు చోటు కోసం ఎంపీ, వైఎస్‌ఆర్ సీపీ రాష్ర్ట వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కృషి చేస్తున్నట్టు ఆ పార్టీ జిల్లా అధికార ప్రతినిధులు ఆకుల మూర్తి, ముదిరెడ్డి నిరంజన్‌రెడ్డి చెప్పారు. ఇందులో భాగంగానే, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిని పొంగులేటి కలిశారని అన్నారు. వారు బుధవారం నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. స్మార్ట్ సిటీకి కావాల్సిన అర్హతలన్నీ ఖమ్మం నగరానికి ఉన్నాయన్నారు.



ఈ విషయూన్ని ఎంపీ ఇప్పటికే పలుమార్లు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారని అన్నారు. నగరంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు అస్తవ్యస్తంగా ఉన్నాయన్నారు. దోమల స్వైర విహారం, చెత్తచెదారంతో నగరం కంపు కొడుతోందన్నారు. కార్పొరేషన్‌గా హోదా పెరిగినప్పటికీ ఆ స్థాయిలో ప్రజలకు కనీస వసతులు అందడం లేదని అన్నారు. నగరం త్వరగా అభివృద్ధి కావాలన్నా, కిందిస్థాయి సిబ్బంది విధి నిర్వహణలో బాధ్యతగా ఉండాలన్నా కార్పొరేషన్‌కు ఐఏఎస్ అధికారిని కమిషనర్‌గా నియమించాల్సిన అవసరముందని అన్నారు.



కార్పొరేషన్‌కు ఏటా 300 కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నప్పటికీ.. వసతుల కల్పనలో మాత్రం అధికారులు విఫలమవుతున్నారని విమర్శించారు. నగర ప్రజల దాహార్తి తీర్చేందుకు సమ్మర్ స్టోరేజీకి ట్యాంక్ నిర్మాణం కోసం వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలో రామన్నపేట వద్ద భూసేకరణ జరిగిందన్నారు. ఆ తరువాత ప్రతి వేసవిలో నగర ప్రజలు తాగునీటి కోసం తహతహలాడుతున్నా సమ్మర్ స్టోరేజి ట్యాంకు ప్రతిపాదనను మాత్రం అధికారులు మూలన పడేశారని విమర్శించారు.



రానున్న వేసవిలో దాహార్తి ఏర్పడకుండా ఇప్పటి నుంచే అధికారులు ప్రణాళికలు సిద్దం చేసుకోవాల్సిన అవసరముందన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించకపోతే వైఎస్‌ఆర్ సీపీ ఉద్యమిస్తుందన్నారు. సమావేశంలో పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఎండి.ముస్తఫా, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు కీసర పద్మజారెడ్డి, నగర విభాగం అధ్యక్షురాలు కొత్తకొండ్ల శ్రీలక్ష్మి, జిల్లా నాయకురాలు షర్మిలా సంపత్ పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top