చెదురుతున్న చార్మినర్‌!

చెదురుతున్న చార్మినర్‌! - Sakshi


► రాలిపోతున్న నగిషీలు.. తగ్గిపోతున్న దృఢత్వం

తాజాగా గుర్తించిన పురావస్తు నిపుణులు

కాలుష్య భూతమే కారణం.. దెబ్బతిన్న ప్రాంతంలో సంప్రదాయ పద్ధతిలో మళ్లీ నిర్మాణం

రసాయన శుద్ధి చర్యలకు నిధులివ్వని కేంద్రం

వాహనాలను దూరంగా మళ్లించేలా   ‘పాదచారుల ప్రాజెక్టు’.. స్థానిక నేతల ఒత్తిళ్లతో పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం




హైదరాబాద్‌: చార్మినార్‌... భాగ్యనగర సంతకం! నాలుగు శతాబ్దాల ఘన కీర్తిని చాటే రాచఠీవి! సుందరమైన నగిషీలతో ఏళ్లుగా అలరారుతున్న నిర్మాణం. కానీ ఆ అద్భుతాన్ని కాలుష్య భూతం చుట్టుముడుతోంది. ఆ కారణంగా కట్టడం నగిషీల్లోని కొన్ని భాగాలు రాలిపోతున్నాయి. సందర్శకుల తాకిడి లేని చోట్ల కూడా పెచ్చులూడి పడుతున్నాయి. డంగుసున్నం, రాతిపొడి, కరక్కాయ, నల్లబెల్లం, కోడిగుడ్డు తెల్లసొన మిశ్రమంతో రూపొందిన ఈ కట్టడం కనీసం వెయ్యేళ్లు వర్ధిల్లాల్సి ఉంది. కానీ వాహనాల పొగ కాలుష్యం దాని ఆయుష్షును తగ్గిస్తోంది.


ఇటీవలే ఈ మార్పులు గుర్తించిన పురావస్తు విభాగం అధికారులు ఇప్పుడు కట్టడం మొత్తాన్ని రసాయన విశ్లేషణ చేయాలని నిర్ణయించారు. కాలుష్యంతో చార్మినార్‌ రంగుమారి కళావిహీనంగా తయారువుతోందని ఇంతకాలం భావించారు. చారిత్రక స్పృహ లేని కొందరు పర్యాటకులు కట్టడంపై తమ పేర్లను చెక్కారు. దీంతో నిర్మాణం దెబ్బతింటుందని నిర్ధారించి ఆ పిచ్చి రాతలు, గీతలను పూడ్చే చర్యలు ప్రారంభించారు. తాజాగా కట్టడం మినార్ల శుద్ధి మొదలుపెట్టారు.


ఈ సందర్భంగా చాలాచోట్ల నగిషీల భాగాలు దెబ్బతిన్నట్టు గుర్తించారు. సందర్శకులు తాకలేని చోట్ల కూడా ఇలా నిర్మాణం దెబ్బతినటంపై నిశితంగా పరిశీలన జరిపారు. నిర్మాణ దృఢత్వం తగ్గడం, వాహనాల కాలుష్యమే ఇందుకు ప్రధాన కారణమని తేల్చారు. ఇలా నగిషీలు ఊడిపడ్డ చోట సంప్రదాయ నిర్మాణ మిశ్రమాలతో మళ్లీ వాటిని నిర్మిస్తున్నారు.


విపరీతమైన కాలుష్యం

చార్మినార్‌ చుట్టూ నిత్యం వేల సంఖ్యలో వాహనాలు తిరుగుతున్నాయి. అవి విడుదల చేసే పొగలో నైట్రోజన్‌ డయాక్సైడ్, రెస్పిరబుల్‌ సస్పెండెడ్‌ పార్టిక్యులేట్‌ మ్యాటర్స్, నాన్‌ రెస్పిరబుల్‌ çసస్పెండెడ్‌ పార్టిక్యులేట్‌ మ్యాటర్స్‌ కట్టడంపై ప్రభావం చూపుతున్నాయి. కాలుష్య ప్రభావంతో చార్మినార్‌ గోడలపై ఓ పొరలా ఏర్పడుతోంది. ఇది వానాకాలంలో తడి తగిలి రసాయన చర్యకు గురవుతోంది. ఫలితంగా నాచు(మైక్రో విజిటేషన్‌) ఏర్పడి గోడల పటుత్వం దెబ్బతింటోందని నిపుణులు పేర్కొంటున్నారు. పైన ఏర్పడే ఈ నాచు రసాయన శుద్ధితో పోతుంది. వాస్తవానికి వాతావరణం ప్రభావంతో కట్టడం దెబ్బతినే అవకాశం ఉండకూడదు. ఎందుకంటే.. సంప్రదాయ నిర్మాణ మిశ్రమంలో ఇలాంటి వాటి ప్రభావాన్ని తట్టుకునే సహజ గుణం ఉంటుంది. కోడిగుడ్డు తెల్లసొన కొన్ని రకాల రసాయన ప్రభావాన్ని తట్టుకుంటుంది. కానీ నిరంతరాయంగా చుట్టుముడుతున్న వాహనాల పొగ ధాటికి కట్టడం పైపొర దెబ్బతిని నిర్మాణం పటుత్వం కోల్పోయి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే నగిషీలు ముక్కలుముక్కలుగా ఊడిపోతున్నాయని పేర్కొన్నారు.


కాలుష్యం స్థాయి ఇలా..

♦ వాతావరణంలో రెస్పిరబుల్‌ సస్పెండెడ్‌ పార్టిక్యులేట్‌ మ్యాటర్‌ సాధారణ స్థాయి 80. చార్మినార్‌ వద్ద అది 115–145గా ఉన్నట్టు అధికారులు గుర్తించారు.

♦  నాన్‌ రెస్పిరబుల్‌ సస్పెండెడ్‌ పార్టిక్యులేట్‌ మ్యాటర్‌ సాధారణ సాధారణ స్థాయి 60. కానీ చార్మినార్‌ వద్ద 95 వరకు ఉంటోంది.

♦  నైట్రోజన్‌ డయాక్సైడ్‌ స్థాయి 20 ఉండాల్సి ఉండగా 30 దాకా ఉంది


నిధులివ్వని కేంద్రం..

చార్మినార్‌కు అడపాదడపా రసాయనాలతో శుద్ధి చేయటం చాలాకాలంగా వస్తోంది. మూడేళ్ల క్రితమే ప్రత్యేక చర్యలు మొదలుపెట్టారు. కేవలం ఏడాదిలో కట్టడం మొత్తానికి పూర్వవైభవం రావాల్సి ఉంది. ఇందుకు దాదాపు రూ.2 కోట్ల వరకు ఖర్చవుతుంది. కానీ కేంద్రం ఏడాదికి రూ.20 లక్షలకు మించి ఇవ్వకపోవటంతో పనులు ముందుకు సాగటం లేదు. రెండేళ్లలో కేవలం ఒకే మినార్‌ పనులు పూర్తి చేయగలిగారు. గత ఆర్థిక సంవత్సరం నిధుల్లో చివరి వాటా విడుదల చేయకపోవటంతో దాదాపు ఆరు నెలలుగా పనులు నిలిచిపోయాయి. మళ్లీ కొద్ది రోజుల క్రితమే మొదలుపెట్టారు.


రాష్ట్ర ప్రభుత్వం మరోలా..

చార్మినార్‌ వాహనాల కాలుష్యం బారిన పడకుండా ఉండేందుకు ఓ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. దీని ప్రకారం వాహనాలను దూరం నుంచే ప్రత్యామ్నాయ మార్గాల్లో మళ్లించాలి. పర్యాటకులు బ్యాటరీ వాహనాల ద్వారా, నడుచుకుంటూ మాత్రమే కట్టడం వద్దకు చేరాలి. అయితే ఇది తోపుడు బండ్లవారి ఉపాధిని దెబ్బతీస్తుందని, అది తమ ఓట్లపై ప్రభావం చూపుతాయన్న ఆందోళనతో రాజకీయ నేతలు అడుగడుగునా ఈ ప్రాజెక్టు పనులకు అడ్డుపడుతున్నారు. వారి ఒత్తిడితో రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవడం లేదు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top