పోలీసుల దొంగ షి‘కార్లు’!

పోలీసుల దొంగ షి‘కార్లు’! - Sakshi

  • చోరీ సొత్తును పంచుకున్న కొందరు పోలీసు అధికారులు

  • ఇళ్లలో దాచుకుని.. దొంగ రిజిస్ట్రేషన్‌తో తిరుగుతున్న వైనం

  • రికార్డుపరంగా కార్లు కోర్టు అధీనంలో ఉన్నట్లు ర.ాతలు

  • ఏసీపీ, సీఐ, ఎస్‌ఐ, ఏఎస్‌ఐ ఇలా అందరూ దొంగలే..

  • ‘సాక్షి’ పరిశోధనలో వెల్లడైన దిమ్మతిరిగే నిజాలు

  •  

    బిరుదరాజు వాసుదేవరాజు, సాక్షి, సిటీబ్యూరో: దొంగలు.. దొంగలు ఊళ్లు పంచుకున్నారనే చందంగా.. పోలీసులు.. పోలీసులే చోరీ సొత్తును వాటాలు వేసుకున్నారు. ఆయా కేసుల్లో నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న దొంగ కార్లను ఎంచక్కా పంచేసుకున్నారు. దొంగ కార్లలో తిరుగుతూ కరో.. కరో.. జర జల్సా అంటూ దర్జా ఒలకబోస్తున్నారు. దొం గల పాలిట సింహస్వప్నంలా నిలవాల్సిన పోలీసు అధికారులు చోరీ అయిన సొత్తును ఇళ్లలో పెట్టుకోవడమేకాక.. వాటిలోనే రాకపోకలు సాగిస్తూ తరిస్తున్నారు. చోరీ అయిన వాహనాలు నిబంధనల ప్రకారం కోర్టు కస్టడీలో ఉన్నట్లుగా చూపెట్టి.. వాటిని మాత్రం ఖాకీలు తమ సొంత అవసరాలకుఫుల్లుగా వాడేసుకుంటున్నారు. ఏసీపీ స్థాయి నుంచి సీఐ, ఎస్‌ఐ, ఏఎస్‌ఐ స్థాయి అధికారులు కొందరు ఇలాంటి వాహనాల్లో దర్జాగా తిరగడమే కాక ఎవ్వరికీ అనుమానం రాకుండా.. సదరు వాహనాలకు దొంగ నంబర్‌ప్లేట్లు అతికించడం గమనార్హం. దొంగ కార్లతో జల్సా చేస్తున్న సీసీఎస్ అధికారులపై ‘సాక్షి’ పరిశోధనలో దిమ్మతిరిగే నిజాలు బయటపడ్డాయి.

     

    ఏఎస్‌ఐ ఇంట్లోనూ అంతే..

    ఏసీపీ, సీఐ, ఎస్‌ఐల బాటలోనే ఏఎస్‌ఐ కూడా నడుస్తూ.. సీజ్ చేసిన ఓ ఇన్నోవా వాహనాన్ని ఇంట్లో దాచుకున్నాడు. సురేష్ అనే వ్యక్తికి చెందిన ఇన్నోవా కారు (ఏపీ 09 బీటీ 9189) చోరీకి గురైంది. సీసీఎస్ పోలీసులు క్రైమ్ నంబర్ 101/2014 కింద కేసు నమోదు చేసుకున్నారు. కారు దొరక్కపోవడంతో ఆరు నెలల్లోనే సురేష్‌కు ఇన్సూరెన్స్ కంపెనీ వారు రూ.6.50 లక్షలు చెల్లించారు. ఆ తర్వాత సురేష్ కారు సీసీఎస్ ఏఎస్‌ఐకు దొరికింది. నిజానికి దీనిని కోర్టుకు అప్పగించాలి.. ఆ తర్వాత సదరు ఇన్సూరెన్స్ కంపెనీ వారికి అది చెందుతోంది. అయితే ప్రస్తుతం ఈ కారు ఏఎస్‌ఐ ఇంట్లో కొలువైఉంది. దీనిని ఆయన తన సొంత పనుల కోసం వాడుకుంటున్నాడు. ఈ వాహనంపై అదే నంబర్ ప్లేట్ పెట్టుకుని తిరిగితే దొరికిపోతామని దానికి (ఏపీ27ఏఆర్2349) అనే నంబర్ ప్లేట్ తగిలించుకుని దర్జా ఒలకబోస్తున్నారు.

     

    ‘ముత్తూట్’ బంగారం గోల్‌మాల్..

    హైకోర్టు ఉద్యోగాల కేసులో నిందితులు తమ బంగారు నగలను పశ్చిమగోదావరి జిల్లా కత్తిపూడిలోని ముత్తూట్ ఫైనాన్స్ కంపెనీలో తనఖా పెట్టారు. ఈ రసీదులను తీసుకుని దర్యాప్తు అధికారులు ముత్తూట్ ఫైనాన్స్‌కు వెళ్లి అక్కడి నుంచి పెద్ద మొత్తంలో బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఎంత బంగారం సీజ్ చేశారు.. కోర్టుకు ఎంత అప్పచెప్పారో మాత్రం చార్జిషీట్‌లో ఎక్కడా ప్రస్తావించలేదు. వీటి గురించి రాస్తే పట్టుబడడం ఖాయమని తెలిసే సదరు అధికారులు చాకచక్యంగా చార్జిషీట్ తయారు చేశారు. ఈ చార్జిషీట్ చూస్తే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే.

     

    ఇన్‌స్పెక్టర్ వద్ద రెండు కార్లు, బైక్‌లు..

    వాహనాలపై డబుల్ ఫైనాన్స్ చీటింగ్ కేసులో క్రైమ్ 12/2013 కేసులో నిందితుల నుంచి నా లుగు కార్లను సీసీఎస్ ఆటోమొబైల్ టీం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో రెండు కార్లు అదే ఏడాది కోర్టు ఆదేశాల మేరకు బాధితులకు అప్పగించారు. మరో రెండు కార్లు మాత్రం రికార్డుల పరంగా కోర్టు అధీనం లో ఉన్నట్లు చూపారు. నిజానికి ఈ రెండు కార్లు ఓ ఇన్‌స్పెక్టర్ దగ్గర ‘సాక్షి’ కెమెరాకు చిక్కడం తో ఆయన వాటిని తన సొంత ఊరికి పంపించాడు. మరో కేసులో.. హైకోర్టులో ఉద్యోగాలు ఇప్పిస్తామని కోట్లాది రూపాయలు నిరుద్యోగుల నుంచి వసూలు చేసి టోపీ పెట్టిన క్రైమ్ నంబర్ 227/2014 కేసులో నిందితుల నుంచి హోండా యాక్టివా ద్విచక్రవాహనం(ఏపీ 37 సీఏ 2328), పల్సర్ (ఏపీ 37 బీవై 696), అపాచి బైక్ (ఏపీ 27 ఏఆర్ 3056) వాహనాలను సీజ్ చేశారు. ఇందులో ఇన్‌స్పెక్టర్ ఇంట్లో రెండు బైక్‌లు.. ఏఎస్‌ఐ ఇంట్లో ఓ వాహనం దాచి పెట్టారు.  

     

    ఎస్‌ఐ ఇంట్లో నిందితుడి కారు

    అద్దె పేరుతో కార్లను తీసుకుని వీటికి నకిలీ ఎన్‌వోసీలు సృష్టించి విక్రయించడంతో పాటు ఒకే వాహనంపై పలు ఫైనాన్స్ కంపెనీల నుంచి పెద్ద మొత్తంలో రుణాలను పొంది కోట్ల రూపాయలు ఎగనామం పెట్టిన పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మండలం ముచ్చర్లవారి తోటకు చెందిన షేక్ ఉమర్ అలీషా (30)ను సీసీఎస్ పోలీసులు గత ఏడాది డిసెంబర్‌లో అరెస్ట్ చేశారు. అతని నుంచి రూ.3 కోట్ల విలువైన 34 కార్లను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో నిందితుడికి చెందిన ఎర్టిగా కారు ఇంకా రిజిస్ట్రేషన్ కాలేదు. టీఆర్ ఏపీ 09 బీఆర్ 7459ను ఎస్‌ఐ తన ఇంట్లో దాచుకుని వినియోగిస్తున్నాడు. ఈ వాహనానికి ఏపీ 31 బీఎక్స్ 6688 అనే దొంగ నంబర్ ప్లేట్ తగిలించి వాడుకుంటున్నాడు.

     

    ఏసీపీ ఇంట్లో.. ‘చిట్టీలరాణి’ కారు..

    చిట్టీలు, అధిక వడ్డీల పేరుతో కొట్లాది రూపాయలు మోసగించిన కేసులో నిందితురాలైన టీవీ ఆర్టిస్టు విజయరాణిని గత ఏడాది ఎప్రిల్ 3న సీసీఎస్ ఏసీపీ అరెస్టు చేశారు. ఆ సమయంలో ఆమె వద్ద ఉన్న రూ.8 లక్షల విలువైన స్విఫ్ట్ డిజైర్ కారు (ఏపీ09సీఎస్4931)తోపాటు ఆమె కుమారుడికి చెందిన హీరోహోండా ప్యాషన్‌బైక్‌ను సీజ్ చేశారు. రికార్డుల పరంగా ఈ వాహనాలు కోర్టు కస్టడీలో ఉన్నట్లు చూపించారు. నిజానికి అవి ఇటు కోర్టు, అటు పోలీసు కస్టడీలో లేనే లేవు. ప్రస్తుతం ఈ కారు, బైక్‌లు ఎల్బీనగర్‌లోని ఏసీపీ సొంతిట్లో ‘సాక్షి’కి దర్శనమిచ్చాయి. కారును అతని కుటుంబ సభ్యులు ఉపయోగిస్తుండగా బైక్‌ను మాత్రం కుమారుడు కళాశాలకు వెళ్లేందుకు వాడుతున్నాడు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top