ఖద్దరు చుట్టూ ‘ఖాకీ’ చక్కర్లు..!

ఖద్దరు చుట్టూ ‘ఖాకీ’ చక్కర్లు..!


కామారెడ్డి : శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుశాఖ పాత్ర కీలకమైనది. అందరి దృష్టి ఖాకీలపైనే ఉంటుంది. ప్రభుత్వంలో పోలీసు శాఖ ఎంత ముఖ్యమైనదైనప్పటికీ నేతల కనుసన్నల్లోనే మెలగాల్సిందే. దీంతో ఖద్దరుకు ఖాకీ సెల్యూట్ చేయాల్సిందే. ముఖ్యంగా అధికారంలో ఉన్న పార్టీ నేతలతో పోలీసులకు మరింత అనుకూలంగా ఉండాల్సిన పరిస్థితులు ఉంటాయి. అధికార పార్టీ నేతలు తమకు అనుకూలురైన అధికారులకు పోస్టింగులు ఇప్పించుకోవాలని చూడడం మామూలే. అందుకు తగ్గట్టుగానే అధికారులు కూడా తమకు అనుకూలమైన పోస్టింగుల కోసం అధికార పార్టీ నేతలను ఆశ్రయిస్తుంటారు.

 

ప్రభుత్వం మారడంతో...

తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంతో పాటు రాష్ట్రంలో టీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి రావడంతో అన్ని విభాగాల్లో అధికారుల బదిలీలు మొదలయ్యాయి. ఐపీఎస్, ఐఎఎస్ అధికారుల బదిలీలు పూర్తయిన వెంటనే, కిందిస్థాయి అధికారుల బదిలీలు జరుగుతాయన్న ఉద్దేశంతో బదిలీలు, పోస్టింగుల కోసం అధికారులు అధికార పార్టీ నేతల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ముఖ్యంగా పోలీసు శాఖలో బదిలీల పైరవీలు జోరుగా సాగుతున్నట్టు తెలిసింది.

 

జిల్లాలో డీఎస్పీలు, సీఐల పోస్టింగుల విషయంలో చాలామంది అధికారులు అధికార పార్టీ నేతల వద్ద పైరవీలు చేస్తున్నారు. గత ప్రభుత్వంలో అధికారులు అప్పటి పాలకులకు అనుకూలురన్న ముద్రను మూటగట్టుకున్న అధికారులను బదిలీ చేస్తారన్న ప్రచారం జరగడంతో, కొందరు అధికారులు ప్రస్తుత అధికార పార్టీ నేతలను ఆశ్రయించి తమను కొంతకాలం కదపవద్దని వేడుకుంటున్నారు. మరికొందరు తమకు బదిలీ తప్పదన్న బావనతో తమకు అనుకూలంగా ఉన్న ప్రాంతాలకు చెందిన నేతల వద్దకు వెళ్లి తమకు పోస్టింగు ఇప్పించమని కోరుతున్నట్టు తెలిసింది.

 

ఇతర జిల్లాల నుంచి...

కాగా  జిల్లాతో పాటు ఇతర జిల్లాల్లో పనిచేస్తున్న పలువురు సీఐలు ఇక్కడ పోస్టింగుల కోసం అధికార పార్టీ నేతలను ఆశ్రయించినట్టు తెలుస్తోంది. గతంలో జిల్లాలో పనిచేసిన వెళ్లి ఓ డీఎస్పీ పదోన్నతిపై ఇదే జిల్లాకు అదనపు ఎస్పీగా రావచ్చని భావిస్తున్నారు. జిల్లాలో అధికార పార్టీకి చెందిన ముఖ్య నేతలతో సన్నిహిత సంబంధాలు ఉండడంతో, సదరు అధికారికి పోస్టింగు దక్కవచ్చంటున్నారు. అలాగే జిల్లాలోని మిగత సబ్ డివిజన్లు, సర్కిళ్లలో పనిచేస్తున్న అధికారుల బదిలీలు జరిగే అవకాశాలున్నట్టు తెలిసింది. త్వరలోనే డీఎస్పీల బదిలీలు ఉంటాయని, తరువాత సీఐల బదిలీలు జరుగవచ్చని పోలీసు వర్గాల సమాచారం. అయితే ఇప్పటికే డీఎస్పీ పోస్టింగుల కోసం పైరవీలు చేసి అధికార పార్టీ నేతల ఆశీస్సులు పొందిన వారు, ఆదేశాలు వెలుబడగానే వచ్చి జాయిన్ అవుతారని తెలిసింది.

 

అలాగే సీఐలు కూడా బదిలీల జాతర ఎప్పుడు మొదలవుతుందోనని ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పలువురు సీఐలు పోస్టింగుల కోసం అధికార పార్టీ నేతల నుంచి ఆశీర్వాదం పొందారని సమాచారం. అధికారుల బదిలీలతో తమ సత్తా చాటుకోవాలని అధికార పార్టీ నేతలు భావిస్తున్నారు. గతంలో తాము ప్రజాప్రతినిధులుగా ఉన్నా అధికార పార్టీ నేతలకే ప్రాధాన్యతనిచ్చారని పలువురు ప్రజాప్రతినిధులు సదరు అధికారులపై గుర్రుగా ఉన్నారు. తమ ప్రభుత్వం రావడంతో వారిని బదిలీ చేయించి, తమకు అనుకూలమైన వారిని తెచ్చుకోవడం ద్వారా తమ పంతం నెగ్గించుకోవాలని వారు ప్రయత్నిస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top