ఉగ్ర జాడల గుర్తింపుతో అప్రమత్తం


- సాయుధ బలగాలతో ముమ్మర గాలింపు

- జాతీయ రహదారిపై వాహనాల తనిఖీ

- సంగారెడ్డి, జహీరాబాద్‌ను

- జల్లెడ పట్టిన

- ‘తిరుపతన్న దళం’


 మెతుకు సీమలో ‘సిమి’ జాడలు వెలుగు చూడడంతో జిల్లా వాసులు ఉలిక్కిపడ్డారు. ఎప్పుడేం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. జిల్లా కేంద్రానికి సమీపంలోనే ఉగ్రవాదులు గది అద్దెకు తీసుకున్నట్టు తాజాగా బయటపడడంతో పోలీసులు సైతం కంగుతిన్నారు.

ఆ వెంటనే అప్రమత్తమై అణువణువూ గాలించే పనిలో పడ్డారు.

సాయుధులైన పోలీసు బలగాలను రంగంలోకి దింపి వేట మొదలు పెట్టారు. అనుమానం ఉన్న ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు.



సాక్షి ప్రతినిధి సంగారెడ్డి: ఇటీవల నల్లగొండ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించిన ఎజాజ్ బీరంగూడ ముత్తూట్ ఫైనాన్స్ లూటీలో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. దీనికితోడు మరో ఇద్దరు మెదక్-రంగారెడ్డి జిల్లాల సరిహద్దు పల్లెలో గది అద్దెకు తీసుకున్నట్టు నిఘా వర్గాల దర్యాఫ్తులో బయటపడడంతో జిల్లా పోలీసు యంత్రాంగం తేరుకుంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర, కర్ణాటకలను కలిపే 65వ నంబర్ జాతీయ రహదారిపై పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు.



గత మూడు రోజులుగా సంగారెడ్డి, జహీరాబాద్ పట్టణాల్లోన్ని అనుమానిత కాలనీల్లో కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. అనుమానితులను అదుపులోని తీసుకొని ప్రశ్నించి వదిలేస్తున్నారు. సరైన పత్రాలు లేని వాహనాలను సీజ్ చేస్తున్నారు. సంగారెడ్డి డీఎస్పీ తిరుపతన్న ఆధ్వర్యంలో ఇద్దరు సీఐలు, ఐదుగురు ఎస్‌ఐలతో ఆదివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు 65వ నంబర్ జాతీయ రహదారిపై విస్తృత తనిఖీలు చేపట్టారు.ఉగ్రవాదులకు గదిని అద్దెకిచ్చిన ఇంటి యజమానిని ఇప్పటికే ఉగ్రవాద దర్యాఫ్తు సంస్థల అధికారులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నట్టు తెలిసింది.



ముందుగా ఇద్దరు వ్యక్తులు గదిని అద్దెకు తీసుకున్నారని, త్వరలోనే మరో ఇద్దరు వచ్చి చేరుతారని తనకు చెప్పినట్టు ఆ యజమాని పోలీసులకు వెల్లడించినట్టు సమాచారం. సూర్యాపేట ఘటన జరిగిన ఈ నెల 2న ఉగ్రవాదులు ఇద్దరు సంగారెడ్డి నుంచే హైదరాబాద్‌కు చేరుకొని, చాదర్‌ఘాట్ వద్ద విజయవాడ బస్సు ఎక్కినట్లు దర్యాఫ్తులో తేలినట్టు తెలిసింది. నిజానికి ముత్తూట్ ఫైనాన్స్ లూటీలో ఐదుగురు పాల్గొన్నారు. వారిలో ఎజాజ్‌ను మాత్రమే పోలీసులు గుర్తించారు. మిగిలిన నలుగురు ఎవరు?.. ఎక్కడ ఉన్నారు?.. సంగారెడ్డి మండలంలో గదికి అద్దెకు తీసుకున్న వారే ఎన్‌కౌంటర్‌లో మరణించారా? లేక నల్లగొండలో మరణించిన మరో ఉగ్రవాది అస్లాం ముత్తూట్ ఫైనాన్స్ లూటీలో ఉన్న ఎజాజ్‌ను ఎక్కడ కలిశారు? అనే అనేక సందేహాలపై దర్యాఫ్తు సంస్థ పరిశోధన సాగిస్తోంది.



ఉగ్రవాద కదలికలను గుర్తించడంలో ఎస్పీకి పట్టు...

ఉగ్రవాద కార్యకలాపాలను పసిగట్టే విషయంలో జిల్లా పోలీసులకు సహజంగా అవగాహన తక్కువే ఉంటుంది. వీరి కదలికలను పసిగట్టడం, వారిని గుర్తించే వ్యవహారాలను ఎన్‌ఐఏ, ఏటీఎస్, ఎస్‌ఐబీ విభాగాలు చూసుకుంటాయి. ఎస్పీ సుమతి కౌంటర్ ఇంటెలిజెన్సీలో పనిచేసినందున ఉగ్రవాద కదలికలు, కార్యకలాపాల తీరుపై ఆమెకు పట్టుందని చెప్పవచ్చు. ఇప్పటికే ఆమె దేశవ్యాప్తంగా జరిగిన ఉగ్రవాద ఘటనల తీరు ను విశ్లేషించారు. ఎక్కువ శాతం ఉగ్రవాదులు శని, ఆది వారాల్లోనే పంజా విసరడం తో ముందు జాగ్రత్త చర్యగా ఆమె వీకెండ్స్‌లో జిల్లాలో హైఅలర్ట్ ప్రకటించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top