పోలీస్ స్టేషన్ లో .. ఎడ్లు, బండ్లు

పోలీస్ స్టేషన్ లో .. ఎడ్లు, బండ్లు - Sakshi


 


  •  గిరిజన రైతుల అరెస్టు

  •  ఇసుక తరలిస్తున్నారంటూ కేసులు

  •  ఆందోళనలో బాధితులు

  • పొట్టకూటి కోసమేనని రైతుల వివరణ




మెదక్: లారీలు, ట్రాక్టర్లలో భారీగా ఇసుక దోపిడీ చేస్తూ కోట్లాది రూపాయలు సంపాదిస్తున్న దళారులను పట్టించుకోని అధికార యంత్రాంగం కరువుకాలంలో బతుకు దెరువులేక ఎడ్లబండ్లపై కాస్తో..కూస్తో ఇసుకను తరలించి ఆకలి తీర్చుకునే గిరిజన రైతులపై పోలీసులు ప్రతాపం చూపారు. రైతులతోపాటు ఎడ్లను, బండ్లను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఈ ఘటన మెదక్ మండలం తిమ్మక్కపల్లి, బాలానగర్ తండాల్లో మంగళవారం చోటుచేసుకుంది. బాధిత రైతుల కథనం ప్రకారం...

 

 రెండేళ్లుగా వర్షాలు లేక కరువు ఏర్పడింది. బోర్లన్నీ ఎండిపోయి చుక్కనీరులేక వ్యవసాయం చతికిల బడింది. గిరిజన రైతులకు వ్యవసాయం తప్ప మరో పని తెలియదు. ఈ సమయంలో మెతుకు కరువైంది. తిండి తిప్పలకోసం అడ్డా కూలీగా మారినా పనులు దొరక్క పస్తులుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఉపాధి పనులు సైతం లేకపోవడంతో మెదక్ మండలం తిమ్మక్కపల్లి, బాలానగర్ గిరిజన రైతులు పొట్టకూటి కోసం కొన్ని రోజులుగా ఎడ్లబండ్లపై ఇసుకను తరలిస్తూ వచ్చే డబ్బులతో జీవనం సాగిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు మంగళవారం తండాల్లోని తొమ్మి ఎడ్లబండ్లు, సంబంధిత గిరిజన రైతులను మెదక్ పట్టణ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. బాధిత గిరిజన రైతులు మాట్లాడుతూ...  బోర్లు ఫెయిలై పంటల పండటం లేదని, మిషన్ కాకతీయ పథకం పనులన్నీ యంత్రాలతోనే చేయిస్తున్నారని తెలిపారు. పనులు లేక పస్తులుంటున్నామని వాపోయారు. పిల్లలు ఆకలితో అలమటిస్తున్నారని, వారికి తిండి పెట్టడానికి ఎడ్లబండ్లలో ఇసుక తరలిస్తూ రూ.200 నుంచి రూ.300 వరకు సంపాదిస్తున్నామని తెలిపారు. పోలీసులు కేసులు పెడితే తామెలా బతకాలంటూ గిరిజన రైతులు ఆందోళన వ్యక్తం చే స్తున్నారు.



 తిండికోసం...

 తిండికోసం ఎడ్లబండ్లపై ఇసుక తరలిస్తున్నాం. కరువుతో బోర్లన్నీ ఎండిపోయాయి. చేసేందుకు పనుల్లేవు. పిల్లలు ఆకలితో అలమటిస్తున్నారు. బతుకేదెట్లా సారూ.

 - వస్య, గిరిజనరైతు, బాలానగర్‌తండా

 

 అడ్డా మీద కూర్చున్నా పనిలేదు...

 వ్యవసాయం మూలన పడింది. పొట్టతిప్పల కోసం కూలీ చేద్దామని అడ్డామీదికి పోయినా పని దొరకుతలేదు. పస్తులుంటున్నాం. కడుపు నింపుకోవడం కోసం ఎడ్ల బండ్లపై ఇసుక తరలిస్తే పోలీసులు కే సులు పెట్టారు.

 - మాలి, గిరిజన మహిళారైతు, తిమ్మక్కపల్లితండా

 

 పనులన్నీ యంత్రాలతోనే....

 వ్యవసాయం లేదు. ఉపాధి పనులు చెప్తలేరు. మిషన్ కాకతీయలో పనులు చేద్దామంటే మెషిన్లతోనే చేయిస్తున్నరు. అడ్డామీద కూలీ దొరకుతలేదు. మరి మేమెట్లా బతికేది.

 -చత్రియా, గిరిజనరైతు, బొల్లారంతండా

 

 ముందే చెప్పాం..

ఇసుక తరలించొద్దని గిరిజనులకు ముందే చెప్పాం. వారు పట్టించుకోవడం లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో వారిని స్టేషన్‌కు తరలించాల్సి వచ్చింది.

 - సాయీశ్వర్‌గౌడ్, సీఐ, మెదక్

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top