‘పొన్నం’ ఆమరణ దీక్ష భగ్నం..








- అరెస్టు చేసిన పోలీసులు.. వెల్లువెత్తిన నిరసనలు


ఆసుపత్రిలో దీక్ష కొనసాగిస్తానంటున్న ‘పొన్నం’


 


సాక్షి, కరీంనగర్‌: కరీంనగర్‌లో ప్రభుత్వ మెడికల్‌ కళాశాలను ఏర్పాటు చేస్తానన్న హామీని కేసీఆర్‌ సర్కారు నిలబెట్టుకోవాలని డిమాండ్‌ చేస్తూ మాజీ ఎంపీ, టీపీసీసీ ఉపాధ్యక్షుడు పొన్నం ప్రభాకర్‌ ఈనెల 5 నుంచి చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను మంగళవారం తెల్లవారుజామున 4.50 గంటలకు పోలీసులు భగ్నం చేశారు. మూడు రోజులుగా దీక్ష కొనసాగిస్తున్న పొన్నం ఆరోగ్య పరిస్థితి ప్రమాదకరంగా మారిందనే సాకుతో పోలీసులు దీక్ష భగ్నానికి ఒడిగట్టారు. పొన్నంను అదుపులోకి తీసుకున్న పోలీసులు హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వెంటనే సెలైన్, ఫ్లూయిడ్స్‌ ఎక్కించేందుకు ప్రభాకర్‌ నిరాకరించగా, బలవంతంగా సెలైన్‌ బాటిల్‌ ఎక్కించి వైద్య సేవలందించారు. అయినా.. మెడికల్‌ కాలేజీపై ప్రకటన చేసే వరకు దీక్ష కొనసాగిస్తానని పొన్నం స్పష్టం చేశారు. 

 


నాటకీయ పరిణామాల మధ్యన..


పొన్నం ప్రభాకర్‌ దీక్షను సోమవారం రాత్రే భగ్నం చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. రాత్రి 11 గంటల నుంచే దీక్షా శిబిరం ప్రాంతంలో మాటువేసి అదును కోసం వేచి చూశారు. పెద్దఎత్తున కాంగ్రెస్‌ కార్యకర్తలు దీక్ష శిబిరం చుట్టూ ఉండడంతో చాలాసేపు వేచి చూడాల్సి వచ్చింది. అర్ధరాత్రి 2 గంటలకు ఓసారి ప్రయత్నం చేసినా వీలుకాలేదని తెలిసింది. అయితే.. తెల్లవారితే పొన్నం దీక్షను విరమింపజేయడం సాధ్యం కాదని భావించిన పోలీసులు పెద్ద ఎత్తున స్పెషల్‌ పార్టీ పోలీసులను రంగంలోకి దింపి 4.50 గంటలకు అదుపులోకి తీసుకుని ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో కార్యకర్తలు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. 

 


నిరసనలు.. విద్యాసంస్థల బంద్‌..


పొన్నం ప్రభాకర్‌ దీక్షను భగ్నం చేయడంతో జిల్లా వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. అన్ని మండల కేంద్రాలలో కాంగ్రెస్‌ శ్రేణులు ధర్నా చేపట్టాయి. రాజీవ్‌ రహదారిని దాదాపుగా దిగ్బంధం చేసినట్లయింది. సీఎం దిష్టిబొమ్మలు దహనం చేశారు. కరీంనగర్‌లోని తెలంగాణచౌక్‌లో పెద్దఎత్తున చేరిన కాంగ్రెస్‌ శ్రేణులు «రాస్తారోకో, ధర్నా నిర్వహించాయి. మహిళా కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో సీఎం దిష్టిబొమ్మ దహనం చేశారు. దీక్షకు మద్దతుగా యువజన కాంగ్రెస్‌ ఇచ్చిన పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థలు బంద్‌ పాటించాయి. ఒక రోజు ముందే బంద్‌కు పిలుపునివ్వడంతో ముందస్తుగానే పేరెంట్స్‌కు మెస్సేజ్‌లు పంపించి పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు బంద్‌కు సహకరించారు. పొన్నంను టీజేఏసీ చైర్మన్‌ కోదండరాం పరామర్శించి న్యాయమైన డిమాండ్‌ను ప్రభుత్వం నెరవేర్చాలని కోరారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీమంత్రి జైపాల్‌రెడ్డి, కుంతియా, విజయశాంతి తదితరులు ఫోన్‌లో పరామర్శించారు. 


 


దీక్ష కొనసాగిస్తా..


తనను ఆసుపత్రికి తరలించినా దీక్షను కొనసాగిస్తున్నానని పొన్నం వెల్లడించారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు దీక్ష విరమించబోనని అన్నారు. ఆసుపత్రిలో సెలైన్లు ఎక్కిస్తున్నా ఎలాంటి ఆహా రంగానీ, జ్యూస్‌లు గానీ తీసుకోవడం లేదన్నారు. మెడికల్‌ కళాశాల ఏర్పాటుపై ప్ర భుత్వం ప్రకటించే వరకు ఆమరణ దీక్ష చేస్తానన్నారు. 




 






Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top