పంట పోయె.. ప్రాణం పాయె

పంట పోయె.. ప్రాణం పాయె


పంటను కంటికి రెప్పలా కాపాడుకున్నారు. నీళ్లందకపోతే తల్లడిల్లిపోయారు. తెగుళ్లు సోకితే దిగులు చెందారు.. ఇంతలో కాలం మొహం చాటేసింది. చినుకు కోసం ఆకాశం వైపు చూసి చూసిన వారి ఆశ ఆవిరైపోయింది. ఆరుగాలం కష్టించిన అన్నదాత ఆశలసౌధం కూలిపోయింది. లక్షలు వెచ్చించి సాగుచేసిన పంటలు చేతికి అందుతాయనే భరోసా లేకుండాపోయింది. అప్పుబారి నుంచి బయటపడే మార్గం లేక చావే శరణ్యమని రైతన్నలు ఆత్మహత్యకు ఒడిగట్టాడు. తమను నమ్ముకున్నవారిని ఒంటరిచేశారు.

 

  కొందుర్గు/మిడ్జిల్ :

 కాలం కనికరించక.. పంటలు చేతికిరాక.. అప్పులు తీర్చే దారిలేక ఆదివారం జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఒకేరోజు ముగ్గురు రైతులు మృత్యువాతపడడంతో ఆయా గ్రామాల్లో తీవ్రవిషాదఛాయలు అలుముకున్నాయి. వివరాల్లోకెళ్తే..మండలంలోని చిన్నఎల్కిచర్ల గ్రామపంచాయతీ పుల్లప్పగూడ గ్రామానికి చెందిన గొల్ల(చక్కని) నర్సింహులు(30)కు ఎకరా పొలం ఉంది. దీంతోపాటు ఈ ఏడాది మరో పదెకరాలను కౌలుకు తీసుకుని మొక్కజొన్నవేశాడు. పంటపెట్టుబడి కోసం రూ.రెండులక్షలు అప్పుచేశాడు.



 వర్షాలు సరిగా కురియకపోవడంతో పంట ఎండిపోవడంతో మనస్తాపానికి గురై శనివారం అర్ధరాత్రి ఇంట్లోనే ఉరేసుకుని ప్రాణాలు విడిచాడు. కాగా, మూడు రోజులక్రితమే భార్య విమల పుట్టినిల్లు జడ్చర్ల మండలం కిష్టాపూర్‌కు వెళ్లింది. భర్త చావువార్త విని భార్య తల్లడిల్లిపోయింది. మృతుడు నర్సింహులు తల్లి లక్ష్మమ్మ ఏడేళ్ల క్రితమే గుండెపోటుతో మృతిచెందింది. ఇక తండ్రి చెన్నయ్య గ్రామంలోని ఇతరుల ఇంట్లో ఉంటున్నాడు. ఆదివారం మధ్యాహ్నం తండ్రి వచ్చి చూసి కన్నీరుమున్నీరయ్యాడు.



 పంటను చూసి కలతచెంది

 ఇదే మండలం శ్రీరంగాపూర్ గ్రామానికి చెందిన చిటికెల(పిచ్చకుంట్ల) నర్సింహులు(30)కు సమీపంలో ఎకరాపొలం ఉంది. ఈ ఏడాది మరో మూడెకరాలను కౌలుకు తీసుకుని మొక్కజొన్న, పత్తి పంటలు సాగుచేశాడు. ఇందుకోసం కొందుర్గు సహకార బ్యాంకులో రూ.పదివేలు, ప్రైవేట్ వ్యక్తుల నుంచి రూ.1.90లక్షలు అప్పులుచేశాడు. ఇదిలాఉండగా, అతని భార్య యాదమ్మ అనారోగ్యంతో ఈనెల 7న మృతిచెందింది. ఓవైపు భార్యచనిపోవడం, మరోవైపు పంటలు ఎండిపోవడం చూసి నర్సింహులు తీవ్రంగా కలతచెందాడు. ఈ క్రమంలో ఈనెల 9న పురుగుమందు తాగాడు. స్థానికులు గమనించి చికిత్సకోసం వెంటనే హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. చికిత్సపొందుతూ ఆరోగ్యపరిస్థితి విషమించడంతో అక్కడే ప్రాణాలు విడిచాడు.



 అనాథలుగా చిన్నారులు

 అమ్మానాన్నలు చనిపోవడంతో శ్రీశైలం, శ్రీకాంత్ అనాథలుగా మిగిలారు. వారిలో ఒకరు ఒకటో తరగతి చదువుతుండగా, మరో చిన్నారి అంగన్‌వాడీకేంద్రానికి వెళ్తున్నాడు. తల్లిదండ్రులు ఏమయ్యారో.. ఇంటివద్ద ఏం జరుగుతుందో తెలియక వెర్రిమొహలు వేసుకుని చూస్తున్న వారిని చూసి పలువురు అయ్యో.. పాపం! అని కన్నీటిపర్యంతమయ్యారు. బాధిత కుటుంబసభ్యులను కొందుర్గు ఎంపీపీ పరామర్శించి ఆర్థికసహాయం అందజేశారు.



 కరెంట్ తీగలు పట్టుకుని మరోరైతు

 మిడ్జిల్: వర్షాభావం, కరెంట్‌కోతల కారణంగా పంటలు ఎండిపోవడంతో మనస్తాపం చెందిన ఓ రైతు కరెంట్‌తీగలను పట్టుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాదకర సంఘటన గురువారం మండలంలోని బైరంపల్లిలో చోటుచేసుకుంది. బాధితులు, స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన రైతు కటికె గోపాల్‌జీ(60)వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తనకున్న ఆరెకరాల పొలంలో బోరుకింద రెండెకరాలు వరిపంటను సాగుచేశాడు.



ఇటీవల కరెంట్‌కోతలు ఎక్కువకావడంతో నీళ్లందక పంటంతా ఎండిపోయింది. మరో నాలుగెకరాల్లో పత్తిపంటను సాగుచేయగా వర్షాభావ పరిస్థితుల కారణంగా అదికూడా చేతికిరాకుండా పోయింది. పంటల సాగుకోసం సుమారు రూ.రెండులక్షలు అప్పుచేశాడు. ఇదిలాఉండగా, అనారోగ్యానికి గురైన తన భార్య వైద్యఖర్చుల కోసం మరో రూ.లక్ష అప్పుచేశాడు. బాకీలను ఎలా తీర్చాలని నాలుగురోజులుగా కుటుంబసభ్యుల వద్ద ప్రస్తావిస్తూ మదనపడేవాడు.



అప్పులు పెరిగిపోవడం, పంటలు చేతికొస్తాయనే ఆశలేదని దిగులుచెందేవాడు. పొలం వద్దకు వెళ్లివస్తానని చెప్పి ఆదివారం సాయంత్రం ఆరున్నర గంటలకు ఇంటినుండి వెళ్లాడు. అక్కడే ట్రాన్స్‌ఫార్మర్ వద్ద కరెంట్‌తీగలను పట్టుకుని సృహతప్పి పడిపోయాడు. అటుగా వెళ్తున్న రైతులు ఇది గమనించి కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు. వారు అక్కడికి చేరుకునేలోగా ప్రాణాలు విడిచాడు. మృతునికి భార్య, ఇద్దరు కొడుకులు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. బాధిత కుటుంబసభ్యులను సర్పంచ్ మణెమ్మ, ఎంపీటీసీ సభ్యుడు శివ పరామర్శించి..ఓదార్చారు. ఈ ఘటనతో బైరంపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top