‘విషింగ్’తో వల..

‘విషింగ్’తో వల.. - Sakshi

  •  సైబర్ స్పేస్‌లో వ్యక్తిగత వివరాలు

  •   ఖరీదు కట్టి విక్రయిస్తున్న ఏజెన్సీలెన్నో

  •   సైబర్ క్రిమినల్స్‌తో జాగ్రత్త అంటున్న పోలీసులు

  • నగరానికి చెందిన చందనకు ఓ కొత్త నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది. ‘చందన గారు మీ క్రెడిట్ కార్డును వినియోగించి రూ.30 వేలు షాపింగ్ చేసినందుకు ధన్యవాదాలు’ అంటూ అవతలి వ్యక్తి చెప్పడంతో షాక్‌కు గురైంది. తాను ఎలాంటి షాపింగ్ చేయలేదని ఆమె అనడంతో... చెక్ చేస్తానంటూ అవతలి వ్యక్తి.. చందనకు చెందిన క్రెడిట్ కార్డ్, సీవీవీ కోడ్, పిన్ నెంబర్లు అడిగాడు.



    అసలే కంగారులో ఉండటం, ఫోన్ చేసిన అపరిచితుడు పేరు పెట్టి సంబోధించడంతో ఆమె వివరాలు చెప్పేసింది. ‘సారీ.. ఆ షాపింగ్ మీ క్రెడిట్ కార్డు నుంచి జరగలేదు’ అంటూ అవతలి వ్యక్తి ఫోన్ పెట్టేశారు. సీన్ కట్ చేస్తే.. ఆ వివరాలు వినియోగించి ‘ఫోన్ కాలర్’ ఆన్‌లైన్ ద్వారా రూ.50 వేలు షాపింగ్ చేసినట్లు నెల తరవాత వచ్చిన ఆమె క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్ చెప్పింది.                       

     

    పర్సనల్ ఐడెంటిటీస్ (వ్యక్తిగత వివరాలు)గా పరిగణించే పేరు, సెల్ నెంబర్, ఈ-మెయిల్ ఐడీ సైబర్ నేరగాళ్ల చేతికి చేరితే ఎలాంటి దుష్పరిణామాలు ఎదురవుతాయో చెప్పడానికి ఇదో ఉదాహ రణ మాత్రమే. దీన్నే సాంకేతిక పరిభాషలో ‘విషింగ్’ అని అంటారు. ఇటీవల కాలంలో ఐడెంటిటీ థెఫ్ట్, విషింగ్‌లకు సంబంధించిన ఉదంతాలు పెరుగుతున్నాయని సైబర్ క్రైమ్ నిపుణులు చెప్తున్నారు. వీటిని సంగ్రహిస్తున్న నేరగాళ్లు వ్యవస్థీకృతంగా వ్యవహారాలు నడుపుతూ ఎంతో మందిని బాధితులుగా మారుస్తున్నారు. నెటిజనుల పర్సనల్ డిటైల్స్ సేకరించడానికి, వాటికి ఖరీదు కట్టి సైబర్ నేరగాళ్లకు అందించడానికి కొన్ని డేటా సెల్లింగ్ ఏజెన్సీలు ఇంటర్‌నెట్ కేంద్రంగా వ్యవహారాలు నడుపుతున్నాయని సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు.

     

    సేకరించే వారెందరో..

     

    ఒక వ్యక్తికి చెందిన పర్సనల్ ఐడెంటిటీస్‌గా పరిగణించే వివరాలను సేకరించడం ఎన్నో ఏజెన్సీలకు తేలికైన పని. ఈ డేటా కలెక్షన్ ఏజెన్సీలు ఎక్కువగా రికవరీ ఏజెంట్లు, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్, కొరియర్ సంస్థలకు చెందిన ఉద్యోగులకు ఎరవేసి ఆకర్షిస్తున్నాయి. వీరి వద్ద తమ కస్టమర్లకు చెందిన పేరు, సెల్‌నెంబర్, ఈ-మెయిల్ ఐడీ కచ్చితంగా ఉంటాయి. వీటితో పాటు ఇటీవల కాలంలో ప్రతి చిన్న దరఖాస్తులోనూ వినియోగదారులు క్రెడిట్ కార్డ్‌ల వివరాలు, ఇల్లు/ఆఫీసు చిరునామా, సాధ్యమైనన్ని కాంటాక్టు నెంబర్లు, పుట్టిన తేదీ తదితరాలు కచ్చితంగా పొందుపరచాల్సి వస్తోంది. ఇలాంటి డేటాను సేకరించడానికి ప్రత్యేకంగా అనేక ఏజెన్సీలు పని చేస్తున్నాయి.

     

    డ్రాప్ బాక్సులు, గిఫ్ట్ ఓచర్ల పేరుతోనూ..

     

    షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్‌లు, పెట్రోల్ బంకుల వద్ద డ్రాప్ బాక్సులు, ఫ్రీ గిఫ్ట్ ఓచెర్స్‌తో సిబ్బంది ప్రత్యక్షమవుతున్నారు. వీరి వద్ద ఉండే కూపన్లు, దరఖాస్తుల్ని పూర్తి చేయమంటూ కస్టమర్లను కోరుతుంటారు. గిఫ్ట్‌లకు ఆశపడి అప్లికేషన్ పూర్తి చేస్తే ఏమవుతుందిలే అనే ఉద్దేశంతో చాలా మంది తమ వ్యక్తిగత వివరాలను వాటిలో నింపి ఇచ్చేస్తుంటారు. మరోపక్క సోషల్ నెట్‌వర్కింగ్ సైట్స్‌లో ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకుంటున్న వారు సైతం ఈ వివరాలన్నింటినీ వాటిలో పొందుపరుస్తున్నారు. మరికొందరైతే ఇంకో అడుగు ముందుకు వేసి పెట్‌నేమ్స్‌తో సహా అందిస్తున్నారు. వీటినీ సేకరించడానికి కొందరు పని చేస్తుంటారు. ఇలా ఒకచోటుకు చేరుతున్న వివరాలన్నీ డేటా సెల్లింగ్ ఏజెన్సీలకు వెళ్లిపోతున్నాయి.

     

    అవాంఛిత కాల్స్‌కూ అదే కారణం..

     

    ఈ ఐడెంటిటీస్‌ని వినియోగించి ఆన్‌లైన్ ఫ్రాడ్స్ చేయడానికి మాత్రమే కాదు, వ్యక్తిగత జీవితానికి భంగం కలిగించడానికీ ముష్కరులకు అవకాశం ఏర్పడుతోంది. ఒక్కమాటలో చెప్పాలంటే.. అనేక  కాల్ సెంటర్లు వీటి మీద ఆధారపడి పని చేస్తున్నాయి. తరచూ మన ఫోన్లకు వాణిజ్య కాల్స్ వస్తుంటాయి. కాల్ చేసిన వ్యక్తి మన పేరు చెప్పి మరీ ప్లాట్/ఫ్లాట్ కావాలా, ట్రేడింగ్‌లో ఇన్వెస్టిమెంట్‌కు అవకాశం ఉందంటూ నిత్యం కాల్స్‌తో వేధిస్తుంటారు. వీరు కస్టమర్ పేరు చెప్పి మరీ విసిగిస్తుంటారు. ఇలాంటి వారికీ వ్యక్తిగత వివరాలు డేటా సెల్లింగ్ సెంటర్స్ ద్వారానే చేరుతున్నాయన్నది సైబర్ నిపుణుల మాట.

     

    ఎన్‌ఆర్‌ఐల డేటాకే ప్రాధాన్యం..

     

    స్థానికుల డేటా కంటే విదేశాల్లో ఉంటున్న ఎన్‌ఆర్‌ఐల డేటాకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. వీరి వివరాలను దుర్వినియోగం చేసినా.. ఫిర్యాదులు రావడం అరుదు కావడంతో సైబర్ నేరగాళ్లు ఎన్‌ఆర్‌ఐల డేటా పైనే మొగ్గు చూపుతున్నట్లు వివరిస్తున్నారు.  

     

    ఆ నెంబరున్నా నో యూజ్..

     

    ఇలాంటి కేసుల్లో పోలీసులకు ఫిర్యాదు చేసినా పూర్తిస్థాయి ఫలితాలు ఉండవు. సైబర్ నేరగాళ్లు దాదాపుగా విద్యాధికులై ఉంటారు. అన్ని జాగ్రత్తలు తీసుకునే నేరాలకు తెగబడుతుంటారు. వారి మెయిల్ ఐడీల నుంచి బ్యాంక్ ఖాతాల వరకు అన్నీ బోగస్ వివరాలతోనే నమోదు చేసుకుంటాయి. అందుకే ఈ తరహా కేసులు కొలిక్కిరావడం ఇబ్బందికరంగా మారుతోంది.

     

    జాగ్రత్తలు తీసుకోవడమే మార్గం..



    ఇలాంటి మోసగాళ్ల బారినపడకుండా ఉండటానికి ప్రతి ఒక్కరూ కనీస జాగ్రత్తలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు. ఒకరి అనుమతి లేకుండా వారి వ్యక్తిగత వివరాలను వినియోగించడం, విక్రయించడం నేరమేనని స్పష్టం చేస్తున్నారు. అవసరమైన చోట తప్ప ఎక్కడపడితే అక్కడ పర్సనల్ డిటైల్స్ ఇవ్వకూడదంటున్నారు. ఆన్‌లైన్‌లో వీటిని పొందుపరిచే విషయంలో వివిధ కోణాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెప్తున్నారు. డ్రాప్ బాక్సులు, గిఫ్ట్ ఓచర్ల విషయంలో ఆచితూచి స్పందించాలని  సూచిస్తున్నారు.

     

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top