స్నేహంముసుగులో దగ్గరై..!

స్నేహం ముసుగులో దగ్గరై..! - Sakshi


► వీడిన మహిళ హత్య కేసు మిస్టరీ

► సఖ్యతగా మెలగడం లేదనే ఘాతుకం

► నిందితుడి అరెస్ట్‌..






చండూరు : స్నేహం ముసుగులో ఆ కుటుంబానికి దగ్గరయ్యాడు.. స్నేహితుడి భార్యకే వలవేసి వివాహేతర సంబంధానికి తెరలేపాడు..ఏడాది పాటు సాఫీగానే సాగిన వారి వ్యవహారానికి ఆ వివాహిత ఇక వద్దంటూ పుల్‌స్టాప్‌ పెట్టింది. అది.. జీర్ణించుకోలేకపోయిన ఆ ప్రియుడు దారికాచి ఆమెను దారుణంగా అంతమొందించాడు.. ఇదీ.. చండూరు మండలంలో ఇటీవల వెలుగుచూసిన మహిళ దారుణ హత్యకు వెనుక ఉన్న ప్రధాన కారణం.



మహిళ హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. తనతో సఖ్యతగా మెలగడం లేదన్న కారణంతోనే ప్రియుడే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్టు ఖాకీల విచారణలో తేలింది.  సీఐ రమేశ్‌కుమార్‌ కథనం మేరకు వివరాలు... చండూరు మండలం ఇడికూడ గ్రామానికి చెందిన నల్ల నర్సింహ, వెంకటమ్మ(26) దంపతులు. నర్సింహ ఇదే గ్రామానికి చెందిన జక్కలి రవీందర్‌ బోరుబండిపై పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరిద్దరు మంచి స్నేహితులు.



స్నేహం పేరుతో దగ్గరై..

నర్సింహ, రవీందర్‌ ఒకే బోరు బండిపై పనిచేస్తుండడంతో స్నేహితులుగా మారారు. ఈ నేపథ్యంలోనే రవీందర్‌ తరచు నర్సింహ ఇంటికి వచ్చి వెళుతుండేవాడు. ఈ క్రమంలో వెంకటమ్మతో పరిచయం పెంచుకున్నాడు. అది కాస్తా వారి మధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది.



దూరం పెడుతోందని..

నెల రోజులుగా రవీందర్‌ ఫోన్‌ చేసినా వెంకటమ్మ స్పందించడం లేదు. ఒక వేళ కలిసినా దూరంగా ఉందామని చెబుతోంది. దీంతో రవీందర్‌ ఆమెపై కక్ష పెంచుకున్నాడు. అదును కోసం వేచి చూస్తున్నాడు.



వ్యవసాయ భూమి వద్దకు వెళుతుండగా..

వెంకటమ్మ ప్రవర్తకు విసిగి వేసారిన రవీందర్‌ ఎలాగైనా ఆమెను అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. అదును కోసం వేచి చూస్తున్నాడు. ఈ క్రమంలోనే గత నెల 30వ తేదీన వెంకటమ్మ తన సోదరుడు శేఖర్‌కు భోజనం తీసుకుని వ్యవసాయ భూమి వద్దకు వెళ్లడాన్ని రవీందర్‌ గమనించాడు. అదే దారిలో ఉన్న తన వ్యవసాయ భూమి వద్ద వెంకటమ్మను అటకాయించి ఘర్షణకు దిగాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో ఆవేశానికి లోనై పక్కనే గుడిసెలో ఉన్న గొడ్డలితో ఆమె మెడపై దారుణంగా నరికాడు. అనంతరం ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత మృతదేహాన్ని పక్కనే ఉన్న గుంటలో పడవేసి తాటికమ్మలు కప్పి అక్కడి నుంచి పరారయ్యాడు.



అనుమానంతో..

మరుసటి రోజు వెంకటమ్మ మృతదేహాన్ని స్థానికులు గమనించడంతో హత్యోదంతం వెలుగుచూసింది. తన సోదరితో సఖ్యతగా మెలిగే రవీందర్‌ హత్య చేసి ఉంటాడనే అనుమానంతో మృతురాలి సోదరుడు శేఖర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ మేరకు నిందితుడు కూడా పరారీలో ఉండడంతో పోలీసుల అనుమానం బలపడింది. శుక్రవారం బంగారిగడ్డలో నిందితుడు తచ్చాడుతున్నాడనే సమాచారం మేరకు పోలీసులు వెళ్లి అతడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితుడు నేరం అంగీకరించాడని సీఐ వివరించారు. కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చనున్నట్టు సీఐ తెలిపారు. సమావేశంలో చండూరు, కనగల్‌ ఎస్‌ఐలు భాస్కర్‌రెడ్డి, నర్సింహులు , సిబ్బంది రవూఫ్‌ ,తదితరులు ఉన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top