వణికిస్తోంది..


సాక్షి, ఖమ్మం : ‘ఉదయం మంచు, చలి గాలి. పగలంతా ఎండ. సాయంత్రం 6 దాటితే చల్లని శీతల గాలులు. జిల్లాలో గత నాలుగు రోజులుగా ఇదీ వాతావరణ పరిస్థితి.’ ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోయి కనిష్టంగా నమోదు అవుతుండడంతో ప్రజలు వణికిపోతున్నారు. వృద్ధులు బయటకు రావాలంటేనే బెంబేలెత్తుతున్నారు. వేలేరుపాడు మండలం రేపాకగొమ్ములో గోగ్కొండ సీతమ్మ(80) అనే వృద్ధురాలు చలితీవ్రతను తట్టుకోలేక ఆదివారం మృతిచెందింది.  



ఖమ్మంతో పాటు కొత్తగూడెం, పాల్వంచ, మణుగూరు, ఇల్లెందు ప్రాంతాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. గోదావరి పరీవాహక ప్రాంతాల ప్రజలు గజగజ వణికిపోతున్నారు. రాత్రి, తెల్లవారుజామున బయటకు రావాలంటేనే జనం జంకుతున్నారు. భద్రాచలం ఏజెన్సీలో దట్టమైన అడవితో పొగమంచు, చలి ఎక్కువగా ఉండడంతో ఆదివాసీలు, గిరిజనులు ఉదయం 10 దాటిన తర్వాత గడప దాటడం లేదు. ఈనెల 16 నుంచి చలి తీవ్రత ఒక్కసారిగా పెరిగింది.



గడిచినవారంలో శనివారం అత్యంత కనిష్ట ఉష్ణోగ్రత 10.1గా నమోదైంది. నాలుగు రోజులుగా ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. డిసెంబర్‌లోనే ఇలా ఉంటే జనవరి, ఫిబ్రవరిలో చలి తీవ్రతగా ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. ఉదయం పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, విధులకు హాజరయ్యే ఉద్యోగులు చలికి వణకుతున్నారు. ఇక గ్రామాల్లో ప్రజలు చలికి తట్టుకోలేక మంటలు వేసుకుంటున్నారు. చలి పెరుగుదలతో ఉన్ని వస్త్రాలకు డిమాండ్ పెరిగింది.



చలిని తట్టుకోలేక స్వెట్టర్లు, మప్లర్లు, రగ్గులు, మంకీ క్యాప్‌లు ధరిస్తున్నారు. వాతావరణంలో మార్పుతో జలుబు, దగ్గుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ సారి చలి తీవ్రత తక్కువగానే ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసినా అత్యల్పంగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటం ఆశ్చర్య కలిగించే అంశం.



అయితే గరిష్ట ఉష్ణోగ్రతలు పెరగకున్నా కనిష్ట ఉష్ణోగ్రతలు రోజుకు రెండు డిగ్రీల పైన పడిపోతుండడంతో చలి తీవ్రంగా ఉంటోంది. దట్టమైన పొగమంచుతో ఉదయం 8 గంటలకు కొన్ని ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతుంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top