‘రీషెడ్యూల్’ నిబంధనలతో శాపం


రుణమాఫీ జాబితా గందరగోళం

లబోదిబోమంటున్న రైతాంగం




సత్తుపల్లి : రుణమాఫీ నిబంధనలు రైతుల పాలిట శాపంగా మారాయి. అర్హులైన ప్రతి ఒక్కరికీ రూ.లక్ష రుణమాఫీ ఇస్తామని చెప్పిన ప్రభుత్వం మాట నీటిమూటైంది. రుణమాఫీ జాబితాల్లో అర్హులైన లబ్ధిదారుల పేర్లు లేకపోవటంతో ఆందోళన నెలకొంది. జిల్లావ్యాప్తంగా రుణమాఫీ లబ్ధిదారుల జాబితాలను సంబంధిత పంచాయతీ కార్యాలయంలోని నోటీస్‌బోర్డులో ప్రదర్శించారు. పలుచోట్ల అర్హులైన లబ్ధిదారుల పేర్లు లేకపోవటం రైతులను విస్మయానికి గురిచేసింది.

 

పాస్‌పుస్తకం పెట్టి రుణం తీసుకున్నవారి పేర్లు కూడా జాబితాలో లేకపోవటంతో రైతులు బ్యాంకులకు పరుగులు తీశారు. అక్కడ బ్యాంకు అధికారులు చెప్పిన సమాధానంతో కంగుతినాల్సి వచ్చింది. ఇటీవల జరిగిన బ్యాంకర్లు, ఉన్నతాధికారుల సమావేశంలో రీషెడ్యూల్ రుణాలను రుణమాఫీ జాబితాలో చేర్చవద్దంటూ స్పష్టమైన ఆదేశాలు వచ్చాయని ఓ బ్యాంకు అధికారి తెలిపారు.  01-02-2014 నుంచి 31-03-2014 వరకు జరిగిన రీషెడ్యూల్స్ మాత్రమే రుణమాఫీ జాబితాలో చేర్చాలని, జల్, నీలం, పైలిన్ తుపానులకు నష్టపోయిన వారిని రీషెడ్యూల్ జాబితాలో ఎట్టి పరిస్థితుల్లో చేర్చవద్దంటూ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది. జిల్లావ్యాప్తంగా కనీసం 20 నుంచి 30 శాతం మంది రైతులు ఈ నిబంధనలతో రుణమాఫీకి నోచుకోలేకపోతున్నారు.

 

అగ్రికల్చరల్ టర్మ్‌లోన్లు..


వ్యవసాయ రుణాలను దీర్ఘకాలిక, స్వల్పకాలిక ప్రాతిపదికన ఇస్తారు. వీటినే అగ్రికల్చరల్ టర్మ్‌లోన్లు (సీసీఏటీఎల్)గా పిలుస్తారు. బోర్లు, డ్రిప్ ఇరిగేషన్, ట్రాక్టర్లు, వ్యవసాయ యంత్ర పరికరాలకు దీర్ఘకాలిక ప్రాతిపదికన బ్యాంకులు రుణాలు ఇస్తాయి. కనీసం ఐదు సంవత్సరాల కాల వ్యవధి ఉంటుంది. ప్రతి ఏడాది కొంతమొత్తం చెల్లించేలా ఒప్పందం చేసుకుంటారు.

 

2010లో జల్ తుపానుతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. అప్పటి ప్రభుత్వం బుక్ అడ్జస్టుమెంట్ పేరుతో రుణాలను రీషెడ్యూల్ చేసింది. దీంట్లో వ్యవసాయ పనిముట్లతో పాటు పంటరుణాలు కూడా ఉన్నాయి. లక్ష నుంచి ఐదు లక్షల రూపాయల వరకు పంటరుణాలు రీషెడ్యూల్ చేశారు. ఇప్పుడు ప్రభుత్వం రీషెడ్యూల్ రుణాలను రుణమాఫీ జాబితాలో చేర్చవద్దంటూ బ్యాంకర్లను ఆదేశించడంతో అర్హులైన లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు.

 

ఆందోళనపథంలో..

రీషెడ్యూల్ రుణాలను రుణమాఫీ జాబితాలో చేర్చకపోవటంపై రైతాంగం ఆందోళన బాటపట్టింది. సోమవారం బ్యాంకులు, తహశీల్దార్ కార్యాలయాల చుట్టూ రైతులు పరుగులు తీశారు. ప్రభుత్వం అర్హులను రుణమాఫీ జాబితాలో చేర్చకపోతే ప్రత్యక్ష ఆందోళనకు దిగాల్సి వస్తుందని రైతు సంఘాలు హెచ్చరిస్తున్నాయి.

 

రుణమాఫీలో చోటులేదు

ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకులో 16-07-2010న రెండు ఎకరాల పాతిక సెంట్ల పొలం పాసుపుస్తకాన్ని తనఖా పెట్టి రూ.40వేలు రుణం తీసుకున్నాను. జల్, లై లా తుపానులతో ఆ ఏడాది పంట దెబ్బతింది. 2010లో రుణాన్ని బ్యాంకర్లు రీషెడ్యూల్ చేశారు. 2011లో వర్షాభావ పరిస్థితులతో పంట వేయలేదు. 2012లో నీలం తుపానుతో నష్టపోయాను. అప్పటి నుంచి బయట అప్పులు తీసుకొచ్చి పంట వేశాను. రూ.40వేల అప్పు, వడ్డీతో కలిపి రూ.65వేలు అయింది. పంటరుణాలు మాఫీ అవుతాయని కొండంత ఆశతో ఉంటే తీరా ఇప్పుడు రీషెడ్యూల్ జాబితాలో నాపేరు లేదు. ఏమి చేయాలో అర్థంకావట్లేదు.

 

- సూరనేని పురుషోత్తం, రైతు, బుగ్గపాడు, సత్తుపల్లి

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top