పింఛన్ల బెంగ

పింఛన్ల బెంగ - Sakshi


నిద్రహారాలు మానేసి...



కంగ్టి : ఆసరా పథకం కింద పింఛన్ అందలేదని ఓ వృద్ధుడు నిద్రాహారాలు మానేసి దిగులు చెందుతున్నాడు. వివరాలిలా ఉన్నాయి.. మెదక్ జిల్లా కంగ్టికి చెందిన 78 ఏళ్ల గుండప్ప, రామవ్వ దంపతులకు ఇద్దరు కుమారులు. అయితే  వీరి తల్లిదండ్రుల బాగోగులు పట్టించుకోవడం లేదు. కాగా ఆరు నెలల క్రితం గుండప్ప మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నాడు. అయితే ప్రతి నెలా వచ్చే పింఛన్‌తోనే మందులు తెచ్చుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం కొత్త పింఛన్లు మంజూరు చేసే క్రమంలో పింఛన్ నిలిపేసిన  విషయం తెలిసిందే. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన జాబితాలో తన పేరు లేకపోవడంతో మదనపడుతున్నాడు.



ఈ క్రమంలో తనకు పింఛన్ ఇప్పించాలని సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి కాళ్ల మీద పడి ప్రాధేయపడ్డాడు. ఆధార్‌కార్డులో 63 సంవత్సరాల వయస్సు తప్పుగా పేర్కొనడంతోనే పింఛన్ రాలేదని, ఈ విషయాన్ని ఎంపీడీఓ దృష్టికి తీసుకెళ్లి పింఛన్ వచ్చేలా చర్యలు తీసుకుంటానని కార్యదర్శి వృద్ధుడికి తెలియజేశాడు. అయినా వినని గుండప్ప నిద్రాహారాలు మానేశాడు. తన  భర్త ప్రాణాలు పోతే మీదే బాధ్యత అంటూ గుండప్ప భార్య రామవ్వ శుక్రవారం ఎంపీడీఓ సాయిబాబాను కలిసి విలపిస్తూ తెలిపింది.

 

గుండెలు ఆగి...

కొండపాక/పెద్దశంకరంపేట : ఆసరా పథకంలో పింఛ న్లు మంజూరు కాలేదన్న దిగులుతో గుండెపోటుకు గురై ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఈ ఘటనలు మెదక్ జిల్లాలో శుక్రవారం చోటు చేసుకున్నాయి. వివరాలిలా ఉన్నాయి.. కొండపాకకు చెందిన నల్ల బాల్‌రాజు (55)కు మూడేళ్ల కిందట పక్షవాతం వచ్చి ఒక కాలు, ఒక చేయి చచ్చుబడ్డాయి. అప్పటి నుంచి బాల్‌రాజ్ మంచాన పడ్డాడు. రెండేళ్ల కిందట బాల్‌రాజుకు వికలాంగ పింఛన్ మంజూరు కాగా వాటితోఆసరా పొందుతున్నాడు. అయితే కొత్త ప్రభుత్వం విడుదల చేసిన పింఛన్ జాబితాలో బాల్‌రాజు పేరు రాలేదు. దీంతో మనస్తాపానికి గురైన బాధితుడు గ్రామ నేతలు, అధికారుల చుట్టు తిరిగినా ఫలితం లేకుండాపోయింది.



అప్పటి నుంచి దిగులుతో ఉన్న బాల్‌రాజు గురువారం రాత్రి భోజనం చేసి పడుకున్నాడు. ఉదయమైనా బాల్‌రాజ్ నిద్రలేకపోవడంతో భార్య సత్తవ్వ దగ్గరు వెళ్లి లేపేందుకు యత్నించింది. అప్పటికే భర్త మృతి చెందిన విషయం తెలిసి సత్తవ్వ భోరున విలపించింది. మృతుడికి వివాహమైన ముగ్గురు కుమార్తెలు కవిత, అనిత, రమ్య, కుమారుడు స్వామి ఉన్నారు.



పెద్దశంకరంపేట మండలం గొట్టుముక్కల గ్రామానికి చెందిన సంగన్నగారి సుదర్శన్ (75), అనూషమ్మ దంపతులు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన పింఛన్ జాబితాలో తన పేరు లేకపోవడంతో మూడు రోజులుగా మదనపడుతున్నాడు. గతంతో సుదర్శన్, ఆయన భార్యకు, వితంతువువైన చిన్న కుమార్తెకు పింఛన్ వచ్చేది. అయితే ప్రస్తుత జాబితాలో ముగ్గురి పేర్లూ లేకపోవడంతో సుదర్శన్ శుక్రవారం ఉదయం గుండెపోటుకు గురై కుప్పకూలిపోయాడు. డాక్టర్ వద్దకు తరలించే లోపే మృతి చెందాడు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top