కాంతారావు సతీమణికి రూ.10 వేల జీవితకాల ఆర్థిక సాయం
సాక్షి, హైదరాబాద్: అలనాటి మేటి నటుడు కాంతారావు సతీమణికి తెలంగాణ ప్రభుత్వం రూ.10 వేల ప్రత్యేక జీవితకాల ఆర్థిక సాయం ప్రకటించింది. జీవిత చరమాంకంలో పేదరికాన్ని అనుభవించి కాంతారావు మృతిచెందారు. ఆ తర్వాత ఆయన కుటుంబం ఆర్థిక ఇబ్బందులతోనే నెట్టుకొస్తోంది.
తెలంగాణ (నల్లగొండ జిల్లా) ప్రాంతానికి చెందిన మహానటుడి కుటుంబాన్ని ఆదుకోవాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ప్రత్యేక కేసుగా పరిగణించి ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. కాంతారావు సతీమణి ఎనభై ఏళ్ల హైమవతికి జీవితకాలం నెలకు రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని అందిస్తున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.