పింఛన్ రాదన్న బెంగతో ఇద్దరు వృద్ధుల మృతి

పింఛన్ రాదన్న బెంగతో ఇద్దరు వృద్ధుల మృతి - Sakshi


ఇల్లెందు/అశ్వారావుపేట రూరల్: పింఛన్ రాలేదన్న బెంగతో ఇద్దరు వృద్ధులు గుండెపోటుతో మృతిచెందారు. అధికారులు ఇటీవల వెలువరించిన ఆసరా జాబితాలో పేరు లేకపోవడంతో ఇకపై పింఛన్ రాదేమోనన్న బెంగతో ఇల్లెందు మండలం సుదిమళ్ల గ్రామ పంచాయతీలోని ఇందిరానగర్‌కు చెందిన సాయిరి రాజయ్య(89), అశ్వారావుపేట మండలం పాత మామిళ్లవారిగూడెం గ్రామానికి చెందిన కట్టం పుల్లయ్య(80) బుధవారం నిద్రలోనే గుండెపోటుతో మృతిచెందారు.

   

సుదిమళ్ల గ్రామ పంచాయతీలోని ఇందిరానగర్‌కు చెందిన సాయిరి రాజయ్య(89) మూడు రోజులుగా పింఛన్ కోసం అధికారుల చుట్టూ తిరిగాడు. జాబితాలో పేరు లేదని, రెండో జాబితాలో వస్తుందని అధికారులు చెప్పారు. ఏ దిక్కూ లేకుండా, ఒంటరిగా ఉంటున్న తనకు ఇన్నాళ్లపాటు ఆసరాగా ఉన్న పింఛన్ ఇకపై రాదేమోనని అతడు తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. అతడు మంగళవారం తన ఇంటిలో నిద్రలోనే గుండెపోటుతో మృతిచెందాడు.

 

ఇతడు అనేక సంవత్సరాలుగా స్థానిక ప్రభుత్వాస్పత్రి వద్దనున్న సత్యం హోటల్‌లో పనిచేస్తున్నాడు. తనకు పింఛన్ రాలేదని, అధికారుల వద్దకు వెళదామని హోటల్ యజమాని సత్యానికి ఫోన్ చేశాడు. సాయంత్రం వెళ్లి తెలుసుకుందామని సత్యం చెప్పాడు. ఆ తరువాత ఇంటిలో పడుకున్న రాజయ్య.. నిద్రలోనే మృతిచెందాడు. అతనికి నిద్రలోనే గుండెపోటు వచ్చి ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు.



రాజయ్య అంత్యక్రియలను సత్యం, ఆయన భార్య రేళ్ల నాగలక్ష్మి (మున్సిపల్ 11వ వార్డు కౌన్సిలర్) కలిసి నిర్వహించారు. రాజయ్యకు నాగలక్ష్మి తల కొరివి పెట్టింది. పింఛన్ రాదేమోనన్న బెంగతోనే సాయిరి రాజయ్య మృతిచెందాడని వివిధ పార్టీల నాయకులు పులి సైదులు (వైఎస్‌ఆర్ సీపీ), దాస్యం ప్రమోద్‌కుమార్, పెండ్లి శ్రీనివాస్‌రెడ్డి, ఖమ్మంపాటి నర్సింహారావు, ఈర్ల శ్రీనివాస్ (కాంగ్రెస్), సాయిరాం (టీడీపీ), ఏపూరి బ్రహ్మం (సీపీఐ) అన్నారు. మృతదేహాన్ని వారు సందర్శించారు. అనంతరం, విలేకరులతో మాట్లాడుతూ.. రాజయ్య మృతికి అధికారులు, ప్రభుత్వానిదే బాధ్యతని అన్నారు.

     

పాత మామిళ్ళవారిగూడెం (అశ్వారావుపేట రూరల్): పింఛన్ రాలేదన్న మనస్తాపంతో ఓ వృద్ధుడు  బుధవారం గుండెపోటుతో మృతిచెందాడు. అతడి కుటుంబీకులు తెలిపిన ప్రకారం.. పాత మామిళ్ళవారిగూడెం గ్రామస్తుడు కట్టం పుల్లయ్య(80)కు కొన్నేళ్లుగా పింఛన్ వస్తోంది. రెండు నెలల క్రితం కూడా పింఛన్ అందుకున్నాడు. తాజాగా అధికారులు విడుదల చేసిన జాబితాలో తన పేరు లేకపోవడంతో పుల్లయ్య ఆవేదన చెందాడు. తనకు ఇక పింఛన్ రాదేమోనన్న మనమస్తాపంతో బుధవారం ఉదయం ఇంటి వద్ద నిద్రలోనే మృతిచెందాడు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top