లెక్క తేలింది

లెక్క తేలింది - Sakshi


సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లాలో పింఛన్  లబ్ధిదారుల లెక్క దాదాపు ఓ కొలిక్కి వచ్చినట్టు కనిపిస్తోంది. అనేక తర్జనభర్జనలు...నిబంధనల మార్పుల తర్వాత జిల్లాలో మొత్తం 3,12,475 లక్షల మందికి ఆసరా పథకం కింద పింఛన్లు మంజూరు చేయాలని అధికారులు లెక్క కట్టారు. మొత్తం వచ్చిన దరఖాస్తుల్లో ఇది 56 శాతం కాగా, దాదాపు 40 వేల మందికిపైగా వివరాలు కుటుంబ సమగ్ర సర్వేలో లేకపోవడంతో వారి దరఖాస్తులను పరిశీలించలేదు. అయితే, పింఛన్ల జాబితా లెక్కతేలినా, ఈ జాబితాను కంప్యూటరీకరణ చేసే విషయంలో ఎదురవుతున్న ఇబ్బందుల కారణంగా తుది జాబితాను ప్రకటించడం లేదని అధికారవర్గాలు చెబుతున్నాయి. మరో రెండు, మూడు రోజుల్లో ఈ పింఛన్ జాబితా ఫైనల్ చేసి ఈ నెలకు నగదు,  వచ్చేనెల నుంచి  బ్యాంకు అకౌంట్‌లో  పింఛన్ జమ చేస్తారు.

 

 శాలిగౌరారంలో అత్యల్పం

 ఇక, మండలాల వారీగా పరిశీలిస్తే రామన్నపేట మండలంలో అత్యల్పంగా పింఛన్లు మంజూరయ్యాయి. ఇక్కడ మొత్తం దరఖాస్తు చేసుకున్న వారిలో కేవలం కేవలం 46 శాతం మందే లబ్ధిదారులుగా ఎంపికయ్యారు. జిల్లా మొత్తం సగటున 56 శాతం మందికి పింఛన్లు మంజూరు చేయగా, ఇక్కడ సగటు కన్నా 10 శాతం తక్కువగా లబ్ధిదారులను ఎంపిక చేయడం గమనార్హం. కాగా, జిల్లా మొత్తం మీద ఏడు మండలాల్లో 50 శాతం కన్నా తక్కువ మంది లబ్ధిదారులు ఎంపికయ్యారు. ఇందులో భువనగిరి (అర్బన్), రామన్నపేట, పీఏ.పల్లి, డిండి, నాంపల్లి, మఠంపల్లి, శాలిగౌరారం మండలాలున్నాయి. ఇక, జిల్లాలోనే అత్యధికంగా నల్లగొండ (అర్బన్)లో 65శాతం మందికి పింఛన్లు మంజూరు చేశారు. జిల్లావ్యాప్తంగా 16 మండలాల్లో 60 శాతం ఎక్కువ మందిని ఎంపిక చేశారు. ఇందులో బీబీనగర్, గుండాల, మోత్కూరు, తుర్కపల్లి, దేవరకొండ, చందంపేట, మిర్యాలగూడ (అర్బన్), పెద్దవూర, కనగల్, చిట్యాల, తిప్పర్తి, నల్లగొండ (అర్బన్)లున్నాయి. ఇక, సంఖ్యాపరంగా చూస్తే నల్లగొండ (అర్బన్)లో 7,612, మిర్యాలగూడ (అర్బన్)లో 7,122, కోదాడ (రూరల్)లో 7,166 మంది అత్యధికంగా పింఛన్ కింద ఎంపికయ్యారు.

 

 నల్లగొండలో అత్యధికం... మునుగోడులో అత్యల్పం

 నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే వచ్చిన దరఖాస్తుల్లో ఎక్కువ సంఖ్యలో లబ్ధిదారులను ఎంపిక చేసింది నల్లగొండ నియోజకవర్గం నుంచే. ఈ నియోజకవర్గంలో వచ్చిన దరఖాస్తుల నుంచి 60శాతం  మంది లబ్ధిదారులుగా ఎంపికయ్యారు. ఆ తర్వాత ఆలేరులో 59శాతం, మిర్యాలగూడ, సూర్యాపేటల్లో 58, తుంగతుర్తిలో 57, హుజూర్‌నగర్, నాగార్జునసాగర్, భువనగిరి నియోజకవర్గాల్లో 55 శాతం, దేవరకొండ, నకిరేకల్‌లో 54 శాతం లబ్ధిదారులను ఎంపిక చేయగా, అత్యల్పంగా మునుగోడులో 53 శాతం మందికి మాత్రమే పింఛను మంజూరు చేశారు. పింఛన్ల సంఖ్యను పరిశీలిస్తే అత్యధికంగా నకిరేకల్ నియోజకవర్గంలో 35,399 మంది లబ్ధిదారులను ఎంపిక చేయగా, అత్యల్పంగా నల్లగొండలో 20,772 మందిని ఎంపిక చేశారు. అంటే వచ్చిన మొత్తం దరఖాస్తుల్లో అత్యధిక దరఖాస్తులను నల్లగొండలో ఆమోదించినా, సంఖ్యాపరంగా వచ్చే సరికి జిల్లా మొత్తం మీద తక్కువ మందికే పింఛన్లు అందుతున్నాయన్నమాట. ఆలేరులో 31,229 మందికి పింఛన్లు మంజూరవుతుండగా, మిగిలిన నియోజకవర్గాల్లో 21వేల నుంచి 29 వేల వరకు లబ్ధిదారులను ఎంపిక చేశారు.

 

 వితంతువులు పెరిగారు... వృద్ధులు తగ్గారు

 పింఛన్ల జాబితాను  కేటగిరీ వారీగా  పరిశీలిస్తే ఈసారి వితంతు పింఛన్లు పెరిగాయని లెక్కలు చెబుతున్నాయి. గతంలో ఉన్న జాతీయ, ఇందిరమ్మ వృద్ధాప్య పింఛన్ లబ్ధిదారులు మొత్తం 1.86లక్షల మంది ఉండగా, ఇప్పుడు కేవలం 1.23 లక్షల మందికే పింఛన్ మంజూరైంది. అయితే, జాతీయ పథకం కింద కేంద్రం తన వాటా ఇవ్వడం లేదని, ఈ కంప్యూటకరీకరణ పూర్తయితే మళ్లీ జాతీయ పథకం కింద దరఖాస్తులను పరిశీలించే అవకాశం ఉందని అధికారులంటున్నారు. ఇక, వితంతు పింఛన్ల విషయానికి వస్తే గతంలో 1,09,265 మందికి పింఛన్ వస్తుండగా, ఇప్పుడు ఆ సంఖ్య 1, 17, 512కు చేరింది. ఇక చేనేత పింఛన్ల విషయానికి వస్తే గతం కన్నా భారీగా తగ్గాయి.

 

 గత ఏడాది మొత్తం 9,033 మందికి చేనేత పింఛన్లు వస్తే, ఈసారి 5,601 మంది మాత్రమే ఎంపికయ్యారు. వికలాంగులకు సంబంధించి స్వల్ప వ్యత్యాసమున్నా గతం కన్నా 3వేల వరకు తగ్గాయి. గీతకార్మిక పింఛన్ల విషయానికి వస్తే గతం కన్నా 700 పింఛన్లు తగ్గినట్టు లెక్కలు చెబుతున్నాయి. ఇక, అభయహస్తం కింద పింఛన్లు పొందుతున్న వారిని ఈ జాబితాలో పరిశీలించడం లేదని, ఈ పింఛన్లు పొందుతున్న వారికి యథావిధిగా నెలకు రూ.500 పింఛన్ వస్తుందని అధికారులు చెబుతున్నారు. అంటే గత ఏడాది ఇచ్చిన పింఛన్లను పోల్చాల్సి వస్తే ఈ అభయహస్తం కింద పింఛన్ పొందుతున్న వారిని కలుపుకుంటే 57వేల మందికి మాత్రమే పింఛన్ తగ్గుతోంది.

 

 మరో 10 వేలు పెరుగుతాయా?

 పింఛన్ల కోత వ్యవహారంపై జరుగుతున్న ఆందోళనల కారణంగా మార్గదర్శకాల్లో మార్పులు చేసే ఉందని జిల్లా అధికారులంటున్నారు.  ఇందుకు సంబంధించిన ఫైలు సీఎం కార్యాలయంలో ఉందని, మార్గదర్శకాల్లో కొంత సడలింపు ఇస్తే మరో 10-15 వేల వరకు పింఛన్‌దారుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అంచనా. అయితే, అందుకు సంబంధించిన కసరత్తు జరిగినా,  వారికి వచ్చే నెలలోనే పింఛన్ అందేఅవకాశముంటుంది.  మరోవైపు దరఖాస్తుదారుల్లో 40వేల మందికి పైగా కుటుంబ సమగ్ర సర్వే వివరాలు లేకపోవడంతో పింఛన్లు నిలిచిపోయాయి. మరి వీరి విషయంలో ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాల్సిందే.

 

 గత ఏడాది పింఛన్ పొందుతున్న వారి సంఖ్య    3,94717

 ఇందులో అభయహస్తం పింఛన్ లబ్ధిదారులు    26,575

 వీరిని మినహాయిస్తే పింఛన్ల సంఖ్య        3,68,142

 ఇప్పుడు మంజూరైన పింఛన్ల సంఖ్య        3,12, 475

 మొత్తం తేడా                                   56,667

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top