పీసీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ‘భట్టి’


సాక్షి ప్రతినిధి, ఖమ్మం: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా మల్లు భట్టి విక్రమార్క పేరు ఖరారైంది. ఈ మేరకు పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని సోమవారం అధికారికంగా ప్రకటించింది. భట్టికి పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఖరారు కావడంతో ఆ పార్టీ జిల్లా నేతల్లో రెండు రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. మధిర శాసనసభ్యుడు మల్లుభట్టి విక్రమార్కకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో కీలకపదవి రావడంతో జిల్లా పార్టీ శ్రేణుల్లో హర్షం వ్యక్తం అవుతోంది.



కాంగ్రెస్ పార్టీ నేపథ్యం కలిగిన రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన మల్లు భట్టి విక్రమార్క 1990లో కాంగ్రెస్ పార్టీ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్‌గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. పార్టీలో తనకంటూ ప్రత్యేక ఒరవడిని సృష్టించుకున్న భట్టి.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కీలకనేతల్లో ఒకరిగా నిలిచారు. 1994లో ఆంధ్రాబ్యాంకు డెరైక్టర్, పీసీసీ సంయుక్త కార్యదర్శిగా పనిచేశారు. 2007లో ఖమ్మం నుంచి స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. 2009లో మధిర ఎమ్మెల్యేగా ఎన్నికయ్యూరు. 2009 నుంచి 2014 వరకు ఉమ్మడి రాష్ట్ర శాసనసభకు డిప్యూటీ స్పీకర్‌గా వ్యవహరించారు. 2014లో మరోసారి మధిర ఎమ్మెల్యేగా ఎన్నికయ్యూరు.

 

పార్టీ అభివృద్ధికి కృషి చేస్తా: భట్టి

నా మీద నమ్మకం ఉంచి.. అత్యంత కీలకమైన పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్ష పదవిని కట్టబెట్టిన కాంగ్రెస్ అధిష్టానం అంచనాలకు అనుగుణంగా పనిచేస్తా. పార్టీ పురోభివృద్ధికి కృషి చేస్తా. కార్యకర్తలకు అండగా నిలవడమే నా లక్ష్యం. కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా, ఓ శాసనసభ్యుడిగా ప్రజల పక్షాన నిలవడానికి, ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తేవడానికి నాకు అవకాశం లభించింది. ఇటు పార్టీ వేదిక , అటు శాసనసభలోనూ  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడతాను. పార్టీ కోసం శ్రమిస్తాను. కార్యకర్తలకు అండగా ఉంటాను.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top