కొత్త చట్టం ప్రకారం పరిహారమివ్వండి

కొత్త చట్టం ప్రకారం పరిహారమివ్వండి - Sakshi


- భూ సేకరణాధికారికి హైకోర్టు ఆదేశం

సాక్షి, హైదరాబాద్: మెట్రో రైల్ ప్రాజెక్టు కోసం సేకరించిన ఆస్తులకు గాను వాటి యజమానులకు గతేడాది జనవరి 1 నాటికి నష్టపరిహారం చెల్లించకుండా ఉంటే కొత్త భూసేకరణ చట్టం  ప్రకారం పరిహారాన్ని నిర్ణయించాలని భూసేకరణాధికారిని హైకోర్టు ఆదేశించింది. అయితే, తాజా పరిహార నిర్ణయం ఇప్పటికే చేపట్టిన ఆస్తుల స్వాధీన ప్రక్రియకు ఎంత మాత్రం అడ్డుకాదని ఈ సందర్భంగా హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ పొనుగోటి నవీన్‌రావు గత వారం తీర్పు వెలువరించారు. ఈ తీర్పు కాపీ అందుకున్న నాలుగు వారాల్లో ఆస్తులను ఖాళీచేసి, అధికారులకు స్వాధీనం చేయాలని పిటిషనర్లను కూడా న్యాయమూర్తి ఆదేశించారు. బాధితులు ఎప్పుడు ఆశ్రయిస్తే అప్పుడు కొత్త చట్టం ప్రకారం పరిహారాన్ని చెల్లించాలని భూసేకరణాధికారికి స్పష్టం చేశారు.

 

గతేడాది  జనవరి 1న కొత్త భూ సేకరణ చట్టం అమల్లోకి వస్తే, అధికారులు పాత భూ సేకరణ చట్టం కింద పరిహారాన్ని నిర్ణయించారని, కొత్త చట్టం ప్రకారం పరిహారం చెల్లించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ కొందరు యజమానులు హైకోర్టును ఆశ్రయించారు. ఇదే సమయంలో నాంపల్లిలో మెట్రో రైల్ అలైన్‌మెంట్ మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది కాబట్టి, ఆ ప్రాంతంలో భూ సేకరణ చేపట్టకుండా ఆదేశాలివ్వాలంటూ పిటిషనర్ల విజ్ఞప్తిని న్యాయమూర్తి తోసిపుచ్చారు. మెట్రో రైల్ ప్రాజెక్టు కోసం హైదరాబాద్, నాంపల్లి ప్రాంతాల్లో 20 ప్రైవేటు ఆస్తులను సేకరించాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. ఆస్తుల సేకరణపై వాటి యజమానులు అభ్యంతరాలు వ్యక్తం చేయగా, వాటిని తోసిపుచ్చిన జిల్లా కలెక్టర్ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేసి, ఆ తరువాత పరిహారాన్ని ఖరారు చేశారు. 


నాంపల్లి వద్ద మెట్రో రైల్ అలైన్‌మెంట్‌ను మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని, అందుకు సంబంధించి ప్రెస్ నోట్ కూడా విడుదల చేసిందని పిటిషనర్ల తరఫు న్యాయవాది కోర్టుకు నివేదించారు. అయితే, ప్రెస్‌నోట్ ఆధారంగా కోర్టు ఓ నిర్ణయానికి రాలేదని న్యాయమూర్తి చెప్పారు. నాంపల్లిలో రోడ్డు విస్తరణ అవసరమా..? కాదా..? అన్న విషయాన్ని కోర్టు తేల్చదని, ఆ అంశం తమ పరిధిలోనిది కాదన్నారు. తమ ముందున్నది పరిహారం చెల్లింపు అంశమేనంటూ ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top