చేయి కలపండి

చేయి కలపండి


జిల్లా కాంగ్రెస్ నేతల సయోధ్యకు పీసీసీ పెద్దల యత్నం

కలిసి పనిచేస్తామని హామీ ఇచ్చిన నాయకులు

గుట్టలో సమావేశం పెట్టి అక్కడే ప్రమాణం చేయాలన్న కార్యకర్తలు

మీరు కన్‌ఫ్యూజ్‌లో ఉండి... మమ్మల్ని కన్‌ఫ్యూజ్ చేస్తున్నారని ఆగ్రహం

మంత్రులుగా పనిచేశామని సమావేశాలకు డుమ్మాకొడతారా అని ప్రశ్న

సభ్యత్వ నమోదు నెలాఖరుకు పూర్తి చేయాలని నిర్ణయం

త్వరలోనే జిల్లాకేంద్రంలో పెద్దఎత్తున సమావేశం


సాక్షి ప్రతినిధి, నల్లగొండ: జిల్లా కాంగ్రెస్ పార్టీలో కూసింత ఐక్యతారాగం వినిపించింది. ‘జరిగిందేదో జరిగిపోయింది... ఇక నుంచయినా అందరం కలిసి పార్టీ కోసం పనిచేద్దాం... భేషజాలను వదిలి కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ముందుకెళదాం. సీనియర్లయినా, జూనియర్లయినా, మంత్రులుగా పనిచేసినా అందరం పార్టీ కోసం పనిచేయాల్సిందే... ఇక నుంచి సీరియస్‌గా శ్రమిద్దాం’ అనే అభిప్రాయం పార్టీ నేతల్లో వ్యక్తమైంది. శుక్రవారం గాంధీభవన్‌లో ఏఐసీసీ కార్యదర్శి రామచంద్రకుంతియా, పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యల సమక్షంలో జరిగిన ముఖ్య నేతల సమావేశంలో జిల్లా పార్టీ పరిస్థితులపై నాలుగుగంటల పాటు సుదీర్ఘ చర్చ జరిగింది.



మండల, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మునిసిపల్ చైర్మన్లతో పాటు జిల్లా పార్టీలో కీలకనేతలంతా ఈ సమావేశానికి హాజరయ్యారు.  జిల్లాలో పార్టీ సభ్యత్వనమోదుపై ప్రారంభమైన చర్చ పార్టీ నేతల పనితీరు వైపు మళ్లింది. ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు కాకుండా దాదాపు 42 మంది ఈ సమావేశంలో తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చినట్టు సమాచారం. ఈ చర్చలో భాగంగా కార్యకర్తలంతా సీనియర్ నేతలను టార్గెట్ చేస్తూ మాట్లాడగా, ఇక నుంచి కలిసి ఉందామని సీనియర్లు హామీ ఇచ్చారు.

 

ఎందుకంత భేషజం?

సమావేశంలో భాగంగా మాట్లాడిన నేతలంతా జిల్లాలోని సీనియర్ నేతలను టార్గెట్ చేస్తూ మాట్లాడినట్టు తెలిసింది. ‘జిల్లా పార్టీలో సీనియర్ నేతల వ్యవహారశైలి సరిగ్గా లేదు. కార్యకర్తలపై కేసులు పెట్టి వేధిస్తున్నా పట్టించుకునే పరిస్థితి లేదు. అందరూ తప్పించుకునే ధోరణిలోనే ఉన్నారు. కీలక నాయకులు కన్‌ఫ్యూజన్‌లో ఉండి మమ్మల్ని కన్‌ఫ్యూజ్ చేస్తున్నారు. పార్టీ మారాలని మాపై తీవ్రఒత్తిడి వస్తోంది. అయినా పార్టీ కోసం ఉంటున్నాం. మీరేమో మేము మంత్రులుగా పనిచేశామని మమ్మల్ని పట్టించుకోరు. పార్టీ సమావేశాలకు కూడా రారు. పార్టీ కౌన్సిలర్లు పార్టీని వీడివెళుతున్నా పట్టించుకోరు. కనీసం వారిని అడ్డుకునే ప్రయత్నం కూడా చేయరా? జిల్లా పరిషత్ సమావేశాలకు ఎందుకు హాజరుకావడం లేదు? మీరంతా హాజరయితే పార్టీ వాయిస్ ప్రజల్లోకి బలంగా వెళుతుంది కదా? అందరూ గట్టిగా నిలబడితేనే పార్టీని ముందుకు తీసుకెళ్లగలం.



తెలంగాణ అంతా నల్లగొండ కాంగ్రెస్ వైపే చూస్తోంది. ఇక్కడే సీఎల్పీ నాయకుడు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఆరుగురు ఎమ్మెల్యేలు, జెడ్పీచైర్మన్ ఉన్నారు. తెలంగాణలో గెలిచిన ఇద్దరు ఎంపీల్లో ఒకరు మన జిల్లా నుంచే ఉన్నారు. మనమే తెలంగాణకు మార్గదర్శకం కావాలి. మీరు కనీసం ఒకరినొకరు పలకరించుకునే పరిస్థితి లేకపోతే పార్టీ ముందుకెళా వె ళుతుంది?’ అని పార్టీ కార్యకర్తలు సీనియర్లను ప్రశ్నించారు. సభ్యత్వనమోదు సమీక్ష కోసం అన్ని జిల్లా కేంద్రాల్లో సమావేశాలు పెట్టి నల్లగొండ సమావేశం గాంధీభవన్‌లో పెట్టడమేంటని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన సీనియర్ నేతలు ఇక నుంచి ఎలాంటి భేషజాలకు పోకుండా కలిసి ఉండి పనిచేస్తామని పీసీసీ పెద్దల ముందు హామీ ఇచ్చినట్టు సమాచారం. ఇందుకు స్పందించిన కార్యకర్తలు ఈ విషయమై పార్టీ నేతలంతా యాదగిరిగుట్టలో సమావేశం ఏర్పాటు చేసి అక్కడే ఐక్యంగా పనిచేస్తామని శ్రీలక్ష్మీనారసింహస్వామిపై ప్రమాణం చేయాలని కోరడం విశేషం.

 

కలలు కల్లలయ్యాయి... ఇప్పుడైనా పార్టీ కోసం పనిచేయండి


‘గతంలో అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రులు కావాలని కొందరు కలలు కన్నారు. ఇప్పుడు అవన్నీ కల్లలయ్యాయి. పార్టీ ఓడిపోయింది. ఈ తరుణంలోనైనా అందరూ పార్టీ కోసం పనిచేయాలి’ అని ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి సరదాగా వ్యాఖ్యానించడంతో సమావేశంలో నవ్వులు విరిశాయి. మీరు పనిచేయని పక్షంలో తనకు పూర్తి బాధ్యతలు అప్పగిస్తే తానే పార్టీ బలోపేతం కోసం పనిచేస్తానని కూడా ఆయన వ్యాఖ్యానించినట్టు సమాచారం.



సీఎల్పీ నేత జానారెడ్డి మాట్లాడుతూ పార్టీ సమావేశాలకు నాయకులు రాకపోయినా, కార్యకర్తలు రావాలని, పార్టీ పటిష్టం కోసం తన వంతు కృషి చేస్తానని చెప్పారు. వర్కింగ్ ప్రెసిడెంట్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ చిన్నచిన్న పొరపాట్ల వల్ల పార్టీ ఓడిపోయిందని, ఇక నుంచి పార్టీ బలోపేతం కోసం పనిచేద్దామని అన్నారు. మొత్తంమీద పార్టీ నేతలమంతా కలిసి పనిచేద్దామనే అభిప్రాయం ఈ సమావేశంలో వ్యక్తమైంది. నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ మంత్రి దామోదర్‌రెడ్డిలు వ్యక్తిగత కారణాల వల్ల ఈ సమావేశానికి హాజరుకాలేదు. మిగిలిన పార్టీ నేతలంతా హాజరయ్యారు.

 

సభ్యత్వ నమోదు వేగవంతం

జిల్లాలో పార్టీ సభ్యత్వాలను ఈనెలాఖరుకల్లా పూర్తి చేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలో మొత్తం 1.40లక్షల సభ్వత్వాలకు గాను 80వేలు పూర్తయిందని, మిగిలిన లక్ష్యాన్ని నెలాఖరుకల్లా పూర్తి చేయాలని నిర్ణయించారు. అదేవిధంగా త్వరలోనే కీలకనేతలంతా కలిసి నల్లగొండలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం కానీ, లేదంటే పెద్ద ఎత్తున కార్యకర్తలతో కలిసి సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సమావేశంలో భాగంగా జిల్లా ప్రణాళిక మండలి (డీపీసీ) ఎన్నికలపై కూడా చర్చ జరిగింది.



సమన్వయం లేకపోవడంతో డీపీసీ ఎన్నికలలో పార్టీ గెలవాల్సిన స్థానాలను బీజేపీకి అప్పగించాల్సి వచ్చిందనే అభిప్రాయం వ్యక్తమైంది.  రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో ఇలాంటి పొరపాట్లు జరగడానికి వీల్లేదని, పూర్తిస్థాయిలో బలం ఉన్నందున ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ స్థానాన్ని కైవసం చేసుకోవాలని కూడా నిర్ణయించారు. అదే విధంగా పార్టీని వీడివెళుతున్న వారిని పార్టీ పరంగా వారికి వచ్చిన పదవులను కూడా వదిలివెళ్లాలని డిమాండ్ చేయాలని, ఇందుకు ప్రత్యేక కార్యాచరణ కూడా చేపట్టాలనే అభిప్రాయం వ్యక్తమైంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top