సభ్యత్వాల కోసం పార్టీల పాట్లు


సాక్షి, ఖమ్మం: జిల్లాలో ప్రధాన రాజకీయ పార్టీలు సభ్యత్వాల నమోదు వేటలో పడ్డాయి. టీడీపీ, కాంగ్రెస్, బీజేపీలు జిల్లావ్యాప్తంగా కొంత టార్గెట్ పెట్టుకొని ముందుకు సాగుతున్నాయి. డీసీసీ అధ్యక్ష ‘పీఠ’ముడితో సభ్యత్వ నమోదులో కాంగ్రెస్ నాయకుల మధ్య సమన్వయం కొరవడింది.



నూతన రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జిల్లాలో రాజకీయ సమీకరణల్లో మార్పులు రావడం,  త్వరలో ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించనుండటంతో అన్ని పార్టీలూ బలోపేతం దిశగా కసరత్తు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ, కాంగ్రెస్, బీజేపీలు సభ్యత్వ నమోదు చేపట్టాయి. వీలైనంత ఎక్కువగా మెంబర్‌షిప్ చేర్పించాలనే తాపత్రయంతో పడరాని పాట్లు పడుతున్నాయి. అయినా ప్రజల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాకపోవడంతో దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్నాయి.



 పనిచేయని ‘బీమా’ మంత్రం

 పలువురు సీనియర్ నేతలు పార్టీని వీడడంతో జిల్లాలో తెలుగుదేశం పార్టీ గత వైభవాన్ని కోల్పోయింది. కొన్ని గ్రామాల్లో ఆ పార్టీకి కేడర్ పూర్తిగా లేకపోవడంతో ఇప్పుడు సభ్యత్వ నమోదుతో ఆ ఖాళీని భర్తీ చేయాలని పార్టీ నేతలు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రమాద బీమా మంత్రంలో సభ్యత్వ నమోదుకు ఉపక్రమించిన ఆ పార్టీ అదే పాలసీని ఇక్కడా అనుసరిస్తోంది.



కానీ ఆశించిన స్థాయిలో స్పందన లేకపోవడంతో ఏం చేయాలో తోచక తలపట్టుకుంటోంది. గతంలో జిల్లాలో బలంగా ఉన్నప్పుడు టీడీపీ సభ్యత్వం 70 వేలు. ఇప్పుడు దీన్ని 1.50 లక్షలకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పార్టీ బలహీన పడిన తరుణంలో ఇంత సభ్యత్వం ఎలా అవుతుందని ఆ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. ‘ప్రమాద బీమా’ మంత్రంతో సభ్యత్వ నమోదు టార్గెట్ పెంచినా అన్ని నియోజకవర్గాల్లో అనుకున్న స్థాయిలో నమోదు కావడం లేదు. గతంలో క్రియాశీలకంగా లేని నేతలు గ్రామాల్లోకి వెళ్లి సభ్యత్వంపై ప్రచారం చేస్తున్నా ప్రజలు, కార్యకర్తల నుంచి స్పందన రావడం లేదు.



ఓవైపు అధికార పార్టీని టార్గెట్ చేసుకుంటూ.. మరోవైపు పార్టీని వీడిన నేతలపై విమర్శల బాణం ఎక్కుపెడుతున్నారు. దీనివల్ల ‘అసలు కార్యం’ పక్కన పడుతోందని పార్టీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు. పార్టీలో ఉన్న కొందరు ద్వితీయశ్రేణి నేతలు కూడా సభ్యత్వ నమోదు పట్టనట్టే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో టార్గెట్ పూర్తి చేయడం ఆ పార్టీకి సవాల్‌గానే మారింది.



 వీడని డీసీసీ ‘పీఠ’ముడి

 కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు డీసీసీ అధ్యక్షుడి ఎంపిక, వర్గ విభేదాల చుట్టూ తిరుగుతోంది. హైదరాబాద్‌లో ఇటీవల నిర్వహించిన టీపీసీసీ సమావేశంలో జిల్లాలో సభ్యత్వ నమోదు, డీసీసీ అధ్యక్షుడి ఎంపికపై చోటుచేసుకుంటున్న నాటకీయ పరిణామాలపై ఏఐసీసీ నేత దిగ్విజయ్‌సింగ్ అసహనం వ్యక్తం చేసిన విషయం విదితమే. జిల్లా మొత్తంగా సభ్యత్వ నమోదు 3 లక్షలు లక్ష్యంగా ఆ పార్టీ పెట్టుకుంది.



ఇల్లెందు ఎమ్మెల్యే గులాబీ తీర్థం పుచ్చుకోవడం, భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటంతో లక్ష్య సాధన కష్టమేనని ఆపార్టీ నేతలు భావిస్తున్నారు. పార్టీ ఎమ్మెల్యేలున్న పాలేరు, ఖమ్మం, మధిరలో సభ్యత్వం నమోదు అధికంగా ఉంటుందనుకున్నా.. మిగతా నియోజకవర్గాలను సమన్వయం చేయడానికి డీసీసీ అధ్యక్షుడు లేకపోవడం లోటుగా కనిపిస్తోంది. ఎన్నికల ముందు టీఆర్‌ఎస్ ఇచ్చిన హామీలు, అధికారం చేపట్టాక ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాల్లో లోపాలను కాంగ్రెస్ పార్టీ దుయ్యబడుతోంది.



నేతలు సభ్యత్వ నమోదుకు సై అంటున్నా క్షేత్ర స్థాయిలో కేడర్‌ను సమన్వయం చేసే నాయకులు కూడా దీనిపై అంతగా ఆసక్తి చూపడం లేదు. సభ్యత్వ నమోదు అంటూ అట్టాహాసంగా ప్రారంభోత్సవం చేసి ఒక్కరోజుతోనే మమా అనిపిస్తున్నారు. డీసీసీ పీఠముడి వ్యవహారం తేలితేనే సభ్యత్వ నమోదు ఊపందుకుంటుం దని ఆపార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.



 మోదీ జపంతో..

 జిల్లాలో బలంగా లేని బీజేపీ మాత్రం కేవలం ఆరువేల క్రియాశీల సభ్యత్వాన్నే లక్ష్యంగా పెట్టుకుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వ సంక్షేమ పథకాలనే ప్రచార అస్త్రాలుగా సభ్యత్వ నమోదు చేపడుతోంది. ఆపార్టీ నేతలు ఖమ్మం, కొత్తగూడెం తదితర ప్రధాన పట్టణాల్లో సభ్యత్వ నమోదు కాంపెయిన్లు మొదలు పెట్టారు. రాష్ట్రానికి చెందిన జాతీయ, రాష్ట్ర నేతలను జిల్లాకు ఆహ్వానించి సభ్యత్వ నమోదుపై ప్రచారం చేస్తున్నారు.



 టార్గెట్ తక్కువ పెట్టుకున్నా కేంద్ర ప్రభుత్వం జపంతో ముందుకెళ్తున్న బీజేపీ కార్పొరేషన్ ఎన్నికల్లో పట్టుకోసం సై అంటోంది. ఒకరిద్దరూ మినహా ప్రధాన నేతలు ఎవరూ లేకపోవడంతో ఆ పార్టీలోనూ సభ్యత్వ నమోదు నత్తనడకనే సాగుతోంది. జిల్లాలో ప్రధానంగా టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు గత బలాన్ని కోల్పోయినా టార్గెట్‌ను మాత్రం లక్షల్లో పెట్టుకోవడంతోనే ‘లక్ష్యం’ దెబ్బతిన్నదని విమర్శలు వస్తున్నాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top