పార్లమెంట్‌లో అడుగుపెడతానని ఊహించలేదు

పార్లమెంట్‌లో అడుగుపెడతానని ఊహించలేదు - Sakshi


కేసీఆర్ దీవెనలతోనే ఎంపీ అయ్యాను 2001 నుంచి టీఆర్‌ఎస్‌లో.. రాజకీయంగా ఎదగాలనే  ఉద్యోగం వదులుకున్నా  ‘మాదిగ దండోరా’లో  కీలకంగా పనిచేశా తెలంగాణ తల్లి విగ్రహాల తయారీ సంతృప్తినిచ్చింది ఓపికతో ఉండడంతోనే పెద్ద పదవి దక్కింది వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్

 

పసునూరి దయాకర్.. మొన్నటి వరకు సామాన్య కార్యకర్త. ఇప్పుడు.. ఎంపీ. ఆయన గెలుపు ఒక సంచలనం. రాష్ట్రంలోనే అత్యధిక

 మెజారిటీతో విజయం సాధించారు. బొమ్మలు వేసే కళాకారుడి నుంచి మొదలైన ఆయన ప్రస్థానం పార్లమెంట్ వరకు చేరుకుంది. ఎందరో మహనీయులు అడుగు పెట్టిన అత్యున్నత చట్టసభకు తాను వెళ్తానని అనుకోలేదని, అది.. కేసీఆర్ ఆశీస్సులతో సాధ్యమైందని, ఓపికతో వేచిచూడడంతోనే పెద్ద పదవి దక్కిందని చెబుతున్న పసునూరి దయాకర్

 జీవిత విశేషాలపై ‘సాక్షి’ పర్సనల్ టచ్.

 

వరంగల్ సంగెం మండలం బొల్లికుంట మా సొంతూరు. నాన్న ప్రకాశం, అమ్మ కమలమ్మ. నాకు ముగ్గురు అక్కలు, ఇద్దరు అన్నలు. అందరికంటే నేనే చిన్నోడిని. మొదటి నుంచి ఆర్థిక ఇబ్బందులు లేవు. మా తాత వాళ్ల నాన్నకు 80 ఎకరాలు ఉం డేవి. మా తాతలు ఇద్దరికి 40 ఎకరాల చొప్పున వచ్చాయి. మా నాన్న రేషన్ డీలరు. 15 ఎకరాల్లో వ్యవసాయం చేసేవారు. మాకు పాలేర్లు ఉండేవారు. సంప్రదాయ పెళ్లి చేసుకోవాలనుకునేవాడిని. 1995లో నా పెళ్లి అలాగే జరిగింది. భార్య జయవాణి. మాకు ఇద్దరు కుమారులు... రోణి భరత్, ప్రతీమ్‌భరత్. అమ్మానాన్న ఇప్పుడు లేరు.



 నాన్నే స్ఫూర్తి...

 సమాజంలో గౌరవంతో బతకాలనే తపన మా నాన్నతోనే వచ్చింది. ఆయన ఎంతో నిజాయితీగా బతికారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ తప్పు చేయొద్దని, ఓపికతో ఉండడం ఆయన ద్వారానే వచ్చింది. నాన్న రేషన్ డీలర్ కాగా, ఏ రోజు సరుకులు ఇవ్వకుండా ఎవరికీ నష్టం చేయలేదు. రేషన్ సరుకులను బ్లాక్‌లో విక్రయించడం ఎప్పుడూ చేయలేదు. ఓపిక, ఆలోచనలో మా నాన్న గొప్పగా అనిపించేవారు. ఏ రోజు మా నాన్న... నన్ను ఒక్క దెబ్బ కొట్టలేదు. డబ్బు సంపాదన విషయంలోనూ మా నాన్న ప్రభావం నాపై ఎక్కువగా ఉంది. నేను ఎప్పడూ డబ్బు సంపాదన లక్ష్యంగా పని చేయలేదు. నాకు ఉన్న కళతో ఖర్చులు, అవసరాల సరిపడా డబ్బులు వచ్చేవి. పెళ్లయ్యాక కొంచెం ఇబ్బంది అనిపించినా గ్యాస్ డీలర్‌షిప్‌తో అవి తొలిగాయి.

 

చదువు కంటే ఆర్ట్‌పైనే దృష్టి..
.

 ఆర్ట్ అంటే నాకు మొదటి నుంచి చెప్పలేనంత ఇష్టం. చదువు మీద కంటే ఆర్ట్‌పైనే దృష్టి ఉండేది. బొల్లికుంటలో పదో తరగతి వరకు చదివా. మా చిన్నాన్న ప్రసంగి వ్యవసాయ అధికారిగా పని చేసేవారు. స్టేషన్ ఘన్‌పూర్‌లో ఆయన దగ్గర ఉండి ఇంటర్మీడియట్ పూర్తి చేశా. తర్వాత హైదరా బాద్‌కు వెళ్లి డ్రాయింట్ టీచర్‌గా శిక్షణ పొందా. జేఎన్ టీయూలో బ్యాచులర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్(బీఎఫ్‌ఏ) ఎంట్రన్స్ రాస్తే సీటు వచ్చింది. శిక్షణ కాలంలో బాగా గుర్తింపు లభిం చింది. బీఎఫ్‌ఏ పూర్తయ్యాక ఓ ప్రైవేటు సంస్థలో పని చేశా. అంతర్జాతీయ స్థాయి కళాకారులుగా అక్కడికి వచ్చి పనిచేసే వారి కంటే నేను వేగంగా బొమ్మలు చేసేవాడిని. కొన్ని కా రణాలతో అక్కడి పద్ధతి నచ్చలేదు. హైదరాబాద్‌లో హడావుడి జీవితం కంటే వరంగల్‌లో ఉండడమే మంచిదని నిర్ణయించుకున్నా. రెట్టింపు జీతం ఇస్తానని చెప్పినా వరం గల్‌కే వచ్చేశా. గోవిందరాజులగుట్ట వద్ద రోణి ఫొటో స్టూడి యో పెట్టా. కొసినా ఫొటో కెమెరా, ఎం7 వీడియో కెమెరా ఉండేవి. స్టూడియో ద్వారా ఖర్చులకు సరిపడా డబ్బులు వచ్చేవి. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించేందుకు సోనియగాంధీ ఆత్మకూరుకు వచ్చినప్పుడు నేను గీసిన రాజీవ్‌గాంధీ చిత్రపటాన్ని ఎమ్మెల్యే సురేఖ ఆమెకు ఇచ్చారు. సోనియాగాంధీ ఎంతో ఇష్టంతో దాన్ని హెలీకాప్టర్‌లో ఢిల్లీకి తీసుకెళ్లారు. అప్పుడు నా పెయింటింగ్స్‌కు బాగా గుర్తింపు ఉండేది.

 

ఫైర్ ఆఫీసర్ ఉద్యోగం...


 స్టూడియో నడుపుతూనే మాదిగ దండోరా వరంగల్ నగర అధ్యక్షుడిగా ఉద్యమంలో కీలకంగా పని చేశా. పొద్దున్నే లేచి వెళ్లి మండలాల్లో కమిటీలు వేసేవాడిని. బీడీలను ఇంకులో ముంచి వాల్‌పోస్టర్లు రాసేవాడిని. అప్పుడే ఎస్సీల వర్గీకరణ జరిగింది. ఈ కేటగిరీలో ఒక ఫైర్ ఆఫీసర్ పోస్టుకు నోటిఫికేషన్ పడింది. అది నాకే వచ్చింది. అరుుతే, రాజకీయంగా గుర్తింపు పొందాలనే ఆలోచన ఉండగా ఉద్యోగాన్ని వదులుకున్నా. అదే సమయంలో వర్ధన్నపేటలో గ్యాస్ డీలర్‌షిప్ వచ్చింది. రాజకీయాల్లో ఒక పెద్ద నాయకుడికి ప్రధాన అనుచరుడిగా ఉండాలని అనుకునేవాడిని. 2001లో టీఆర్‌ఎస్ ఆవిర్భావ సమయం నుంచి పని చేశా. కరీంనగర్ బహిరంగసభకు ముందు డాక్టర్ సుధీర్ టీఆర్‌ఎస్ వైస్ చైర్మన్‌గా ఉండేవారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై ఆయన చెప్పారు. టీఆర్‌ఎస్ మీటింగ్‌కు రావాలని సూచించడంతో అక్కడి వెళ్లగా... టీఆర్‌ఎస్‌లో నా పయనం మొదలైంది.

 

టీఆర్‌ఎస్‌తో గుర్తింపు...

 టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్... తొలి రోజుల్లోనే నన్ను పేరుపెట్టి పిలిచేవారు. మొదటి కమిటీలో టీఆర్‌ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్నా. ఆ తర్వాత పార్టీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడిగా వ్యవహరించా. నియోజకవర్గాల పునర్విభజనలో వర్ధన్నపేట ఎస్సీ కేటగిరీకి రిజర్వు అరుుంది. కేటీఆర్ అన్న ఫోన్ చేసి ఢిల్లీకి రావాలని పిలిస్తే వెళ్లాను. కేసీఆర్ నన్ను నియోజకవర్గ ఇంచార్జీగా నియమించారు. 2009 సాధారణ ఎన్నికలో మహాకూటమి పొత్తులో మాజీ మంత్రి విజయరామారావుకు అసెంబ్లీ సీటు ఇవ్వాల్సి వచ్చింది. కేసీఆర్ సార్ మా అందరితో చర్చించి విజయరామారావుకు వర్ధన్నపేట టిక్కెట్ ఇచ్చారు. పార్టీకి ఏది మంచిదైతే అలాగే చేయాలని చెప్పా. అప్పుడు కేసీఆర్ సార్ ఎంతో అభినందించారు. 2009 ఎన్నికల తర్వాత పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు ఉండె. అప్పుడూ వర్ధన్నపేట ఇంచార్జీగా వ్యవహరించా. నా స్థాయిలో పార్టీ కార్యక్రమాలన్నీ విజయవంతం చేశా. 12 చోట్ల తెలంగాణ తల్లి విగ్రహాలు నెలకొల్పా. 2013లో ఇంచార్జీ బాధ్యతల నుంచి తప్పుకున్నా. నాకు టీఆర్‌ఎస్‌తోనే గుర్తింపు వచ్చింది. కేసీఆర్ సార్ వద్ద నాకు ప్రత్యేక గుర్తింపు ఉండేది. రెండేళ్లు ఓపికతో ఉన్నా. ఇప్పుడు పెద్ద అవకాశం ఇచ్చారు.

 

కష్టం తెలిసిన వాడిని...


వరంగల్ ఉప ఎన్నిక ప్రత్యేక సందర్భంలో వచ్చింది. రాష్ట్ర రాజకీయాల్లో ఇది కీలకమైన ఎన్నిక. ఇంతటి ప్రతిష్టాత్మక ఎన్నికలో కేసీఆర్ నాకు టిక్కెట్ ఇచ్చారు. ఉద్యమ నేత కేసీఆర్, ముఖ్యమంత్రిగా చేసిన అభివృద్ధి పనులే ఘన విజయాన్ని తెచ్చి పెట్టాయి. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌తో కలిసి నడిచిన నన్ను ప్రజలు ఆదరించారు. సాధారణ కార్యకర్తగా ఉన్న నేను కేసీఆర్ దీవెనలతోనే ఎంపీగా ఎన్నికయ్యాను. ఎంపీగా గెలిచిన తర్వాత పార్లమెంట్‌లో మొదటిసారి అడుగుపెట్టినప్పటి అనుభవం మరిచిపోలేను. ప్రధానమంత్రి మోడీ, దేశంలోని గొప్ప నేతలు ఉన్న ప్రదేశంలోకి వెళ్లగానే కలిగిన అనుభూతి మాటల్లో చెప్పలేను. గతంలో పార్లమెంట్‌ను దూరంగానే చూశా. అందులో అడుగు పెడతానని ఎప్పుడూ ఊహించలేదు. కేసీఆర్ దీవెనలతో ఈ అవకాశం వచ్చింది. అరుుతే, ఎంపీగా గెలిచినా మూలాలు మరిచిపోను. కష్టమంటే తెలిసిన వాడిని. ఎప్పటికీ ఇలాగే ఉంటాను. వరంగల్ అభివృద్ధికి నా వంతుగా కృషి చేస్తా.

 

రూపకర్త కేసీఆర్...

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అసవరాన్ని ప్రజలకు తెలియజెప్పేందుకు భావజాల వ్యాప్తి కీలకమని కేసీఆర్ చెప్పేవారు. తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందిచాలని కేసీఆర్ నిర్ణయించారు. తెలంగాణ తల్లి విగ్రహం ఎలా ఉండాలనే విషయమై చాలా మంది మేధావులు, ముఖ్యులతో చర్చించారు. తెలంగాణ తల్లి రూపం ఎలా ఉండాలో తన ఆలోచనలను చెప్పి ఆ మేరకు కాగితంపై బొమ్మలు వేయాలని కేసీఆర్ సార్ సూచించారు. గంగాధర్ సార్ వేసిన బొమ్మను ఎంపిక చేశారు. తెలంగాణ తల్లి విగ్రహానికి రూపు ఇచ్చే బాధ్యత నాకు అప్పగించారు. మొదటి విగ్రహం తెలంగాణ భవన్‌లో పెట్టారు. మొదట్లో విగ్రహం తయారీకి ఖర్చు కొంచెం ఎక్కువయ్యేది. తర్వాత అచ్చులు చేసి దీన్ని తగ్గించా. తెలంగాణ తల్లి విగ్రహం తయారీలో నా దగ్గర పని చేసే వారికి నైపుణ్యం వచ్చింది. ఫినిషింగ్ పనులు నేను చేసేవాడిని. ఎక్కువగా ఐదున్నర అడుగుల విగ్రహాలు ఉండేవి. సిద్ధిపేట, నర్సంపేట వంటి ప్రాంతాల్లో 12 ఫీట్ల విగ్రహాలు పెట్టారు. తెలంగాణ తల్లి విగ్రహాల కళాకారుడిగా నేను ఎంతో సంతృప్తి పొందాను.

 

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top