అమ్మకానికి ఆడశిశువు

అమ్మకానికి ఆడశిశువు - Sakshi


రూ.15 వేలకు కుదిరిన బేరం

విశ్వసనీయ సమాచారంతో అడ్డుకున్న పోలీసులు.. కేసు నమోదు


 

కొండమల్లేపల్లి : అంగట్లో ఆడశిశువును అమ్ముకునే దుస్థితి, పరిస్థితి గిరిజన తండాల్లో ఇంకా మారడం లేదు. ఓ వైపు మగసంతానంపై ఆసక్తి, మరోవైపు అధిక సంతానాన్ని పెంచలేని పేదరికంతో ఆడశిశువులను అంగట్లో పెట్టి అమ్మేస్తున్నారు. తాజాగా దేవరకొండ మండలం కొండమల్లేపల్లిలో రూ.15వేలకు ఆడశిశువును విక్రయిస్తుండగా విశ్వసనీయ సమాచారంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.



శుక్రవారం ఈ సంఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు.. చందంపేట మండలం పోలేపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని ఫకీర్‌నాయక్ తండాకు చెందిన మూడావత్ బాలు, కుమారీలకు ఇప్పటికే ఇద్దరు ఆడసంతానం. పదిహేను రోజుల క్రితం మూడవ కాన్పులో మళ్లీ ఆడపిల్లే జన్మించడంతో భారంగా భావించిన తల్లిదండ్రులు ఆ శిశువును అమ్మకానికి పెట్టారు. అదే తండాకు చెందిన మూడావత్ భారతి అనే మహిళ మధ్యవర్తిత్వం నెరిపింది. హైదరాబాద్‌లోని విప్రో కంపెనీలో పనిచేస్తున్న పి.కుమార్ అనే వ్యక్తికి రూ.15 వేలకు అమ్మడానికి బేరం కుదిరింది.

 

ఈ నేపథ్యంలో శిశువును శుక్రవారం వారికి అప్పగించడానికి ప్రయత్నిస్తుండగా సమాచారం బయటకు పొక్కడంతో వీఆర్‌ఓ వెంకటేశ్వర్లు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సీఐ భాస్కర్ వారిని కొండమల్లేపల్లిలో పట్టుకొని కేసు నమోదు చేశారు. శిశువును విక్రయించడానికి ప్రయత్నించిన తల్లిదండ్రులు, కొనుగోలు చేయడానికి ప్రయత్నించిన పి.కుమార్, మధ్యవర్తి భారతిలపై పోలీసులు కేసు నమోదు చేశారు. శిశువును దేవరకొండ శిశుగృహకు తరలించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top