నత్తనడకన పన్నుల వసూళ్లు


 మిర్యాలగూడ : పంచాయతీలలో పన్నుల వసూళ్ల ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. కొన్ని గ్రామాల్లో ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా వసూలు చేయలేదు. రెండు మాసాలుగా జిల్లాలోని 1176 గ్రామ పంచాయతీలలో పంచాయతీ కార్యదర్శులు ఆస్తి పన్నులు వసూలు చేస్తున్నారు. ఆస్తి పన్ను బకాయిలతోపాటు జిల్లా వ్యాప్తంగా మొత్తం 20.09 కోట్ల రూపాయలు రావాల్సి ఉంది. కానీ రెండు మాసాల కాలంలో కేవలం 6 కోట్ల రూపాయలు మాత్రమే వసూలు చేశారు. పంచాయతీ కార్యదర్శుల కొరత కారణంగా రెండు, మూడు గ్రామాలకు ఒక్కే ఇన్‌చార్జ్‌గా వ్యవహరించడం వల్ల కూడా పన్నులు వసూలు కావడం లేవు. పన్నుల వసూళ్లపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి ఎప్పటికప్పుడు జిల్లా అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తోంది.

 

 13వ ఫైనాన్స్ నిధులు రూ.88 కోట్లు మంజూరు

 గ్రామాలలో ఆస్తి పన్నులు వసూళ్లపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెట్టడంతోపాటు అభివృద్ధిపై కూడా దృష్టి సారించింది. అభివృద్ధిలో భాగంగా గ్రామ పంచాయతీలకు గాను 13వ ఫైనాన్స్ నిధులు 88 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతోపాటు పన్నుల రూపంలో వసూలైన వాటిని కూడా గ్రామ పంచాయతీల అభివృద్ధికి వినియోగించనుంది.

 

 డంపింగ్ యార్డుల ఏర్పాటుకు చర్యలు

 జిల్లాలోని అన్ని గ్రామాలలో పారిశుద్ధ్య చర్యలు చేపట్టడానికి గాను చెత్త డంపింగ్ యార్డులను ఏర్పాటు చేయనున్నారు. గ్రామ పంచాయతీ భూమి ఉన్నచోట అదే భూమిలో డంపింగ్ యార్డు ఏర్పాటు చేయనున్నారు. గ్రామంలోని అన్ని కాలనీలు, రోడ్లు చెత్త లేకుండా ఉండేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

 

 ఈ నెల 31లోగా 80 శాతం పన్ను వసూళ్లకు ఆదేశాలు

 ఈ నెల 31వ తేదీ లోగా గ్రామ పంచాయతీలలో 80 శాతం ఆస్తి పన్ను వసూళ్లకు జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్‌రావు పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటు ఒక్కొక్క మండలంలో కనీసం ఐదు గ్రామాల చొప్పున 300 గ్రామాల్లో నూరు శాతం పన్నులు వసూలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. అందుకు గాను డివిజన్ స్థాయిలలో పన్నుల వసూళ్లపై పంచాయతీ కార్యదర్శులు, బిల్ కలెక్టర్‌లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పన్నుల వసూళ్లపై కచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు.  

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top