ఆ జీఓ కొయ్యకత్తి


అమలాపురం :కోట్లాది రూపాయల విలువ చేసే భూములు కళ్ల ముందే కబ్జాల పాలవుతున్నా పాలకులకు గానీ, అధికారులకు గానీ చీమ కుట్టినట్టయినా ఉండడం లేదు. పంచాయతీల ఆస్తుల పరిరక్షణకు రెండేళ్ల క్రితం జారీ చేసిన జీఓ నంబర్ : 188.. రాజకీయ జోక్యానికి తోడు అధికారుల నిర్లక్ష్యం, నిర్లిప్తతల కారణంగా కాపాడలేని కొయ్యకత్తిలా నిరుపయోగంగా మిగులుతోంది. పంచాయతీల్లో లక్షలాది రూపాయల విలువ చేసే స్థలాలు అన్యాక్రాంతమయ్యాయి.

 

 చెరువులు కబ్జాల బారిన పడి బక్కచిక్కిపోతున్నాయి. ఇక  పోరంబోకు భూములకు గురించి చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. ఇవి ఎక్కడున్నాయో పంచాయతీ సిబ్బందికే తెలియకుండా పోయింది. మారుమూల స్థలాలేకాదు.. పంచాయతీల్లో ప్రధాన రహదారులను ఆనుకున్న విలువైన స్థలాలూ కబ్జాకు గురయ్యాయి. విలువైన భూములు కళ్లముందే అన్యాక్రాంతమైనా పట్టించుకునే నాథుడే లేడు. ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న పంచాయతీలు ఈ స్థలాలను స్వాధీనం చేసుకుంటే గణనీయమైన ప్రయోజనం పొందే అవకాశముంది. దీనిని గుర్తించిన ప్రభుత్వం రెండేళ్ల క్రితం జీఓ నం: 188ని విడుదల చేసింది. దాని ప్రకారం ఆయా పంచాయతీలు తమ భూములను సర్వే చేసి ఫొటోలు తీరుుంచి, రికార్డుల్లో భద్రపరచాలి.

 

 ‘ఎసెట్ రిజిస్టర్లు’ ఏర్పాటు చేసి భూమి వివరాలను నమోదు చేయాలి. కబ్జాల బారిన పడిన భూములు స్వాధీన ం చేసుకుని, వాటి చుట్టూ కంచె ఏర్పాటు చేయాలి. వీటిలో పంచాయతీలకు చెందిన స్థలాలుగా బోర్డులు పెట్టాలి. అరుుతే జీఓ వచ్చి రెండేళ్లు కావస్తున్నా పంచాయతీలు దీనిని అమలు చేసిన దాఖలాలు లేవు. జిల్లాలో 1,069 పంచాయతీలుంటే అమలాపురం డివిజన్‌లో ఆత్రేయపురం వంటి కొద్ది పంచాయతీలు మాత్రమే అన్యాక్రాంతమైన భూములను స్వాధీనం చేసుకున్నాయి. రాజకీయ కారణాలు, అధికార పార్టీ నాయకులు, పాలకవర్గాల ఒత్తిడితో అధికారులు జీఓ నం:188ని అమలు చేయడానికి మీనమేషాలు లెక్కిస్తున్నారు. గత నెలలో పంచాయతీరాజ్ కమిషనర్ ఆంజనేయులు ఈ జీఓ అమలుపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జీఓని పక్కాగా అమలు చేయాలని, లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించినా ఫలితం లేకుండా పోయింది.

 

 మామూళ్ల మత్తులో అధికారులు

 అనేక ఏళ్లుగా కబ్జాల బారిన పడిన సొంత స్థలాల విషయంలోనే కాదు.. రియల్టర్లు తమ లే అవుట్లలో పంచాయతీలకు కేటాయించే కమ్యూనిటీ స్థలాలను కాపాడుకోవడంలో కూడా పంచాయతీలు విఫలమవుతున్నాయి. నిబంధనల ప్రకారం లే అవుట్ విస్తీర్ణాన్ని బట్టి కొంత స్థలాన్ని కమ్యూనిటీ స్థలాలుగా గుర్తించి పంచాయతీలకు స్వాధీనం చేయాల్సి ఉంటుంది.  అయినా డీటీసీ అప్రూవల్ లే అవుట్‌దారులు కమ్యూనిటీ స్థలాలను కేటాయించినట్టు చూపిస్తున్నా వాటిని పంచాయతీలకు స్వాధీనం చేయకుండా అమ్ముకుని, సొమ్ములు చేసుకుంటున్నారు.

 

 అధికారులకు ఈ విషయం తెలిసినా మామూళ్లమత్తులో పడి పట్టించుకోవ డం లేదు. లే అవుట్‌లలో కమ్యూనిటీ స్థలాల ఖరీదు ఆ యా ప్రాంతాలను బట్టి రూ.ఐదు లక్షల నుంచి రూ.50 లక్షల వరకు విలువ చేస్తాయి. జిల్లాలో రాజమండ్రి, కాకినాడ, అమలాపురం, మండపేట, పెద్దాపురం, సామర్లకోట వంటి కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను ఆనుకుని ఉన్న పంచాయతీల్లో ఇటువంటి స్థలాలు అధికారులకు కాసులు కురిపిస్తున్నాయి. పైగా ఈ స్థలాల్లో ఇళ్ల నిర్మాణాలకు పంచాయతీ అధికారులే అనుమతులు ఇవ్వడం గమనార్హం. ఇప్పటికైనా పంచాయతీ అధికారులు, పాలకవర్గాలు కబ్జా అయిన స్థలాలను, లే అవుట్లలోని కమ్యూనిటీ స్థలాలను స్వాధీనం చేసుకోవడం ద్వారా ఆర్థిక పరిపుష్టి సాధించాల్సి ఉంది.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top