మరణానికి ముందు పాల్వాయి చివరి అభ్యర్థన

మరణానికి ముందు పాల్వాయి చివరి అభ్యర్థన - Sakshi


సాక్షి, న్యూడిల్లీ :

సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి మరణానికి ముందు కేంద్ర ప్రభుత్వాన్ని ఏం కోరారు? అనేక సందర్భాల్లో నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణాల్లో చోటుచేసుకుంటున్న అవినీతిపై ప్రశ్నించిన పాల్వాయి.. తాను చనిపోవడానికి కొద్దిరోజుల ముందు కూడా ఇదే అంశాన్ని లేవనెత్తారు. పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణం విషయంలో భారీ ఎత్తున సాగుతున్న అవినీతి, అక్రమాలపై సెంట్రల్‌ విజిలెన్స్‌ కమీషన్‌ (సీవీసీ) తో విచారణ జరిపించాలన్నది పాల్వాయి గోవర్ధన రెడ్డి చివరి కోరికగా మిగిలింది.



జాతీయ ప్రాజెక్ట్‌గా చేపట్టిన పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణంలో విచ్చలవిడి అక్రమాలు, అవినీతి చోటు చేసుకున్నాయని, అందువల్ల సీవీసీ విచారణ జరిపి ప్రభుత్వ ధనాన్ని రాబట్టాలని, అవినీతికి బాద్యులైన వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని పాల్వాయి గోవర్ధన రెడ్డి గత నెలలో సీవీసీకి ఫిర్యాదు రాశారు. ఆ ఫిర్యాదు పై స్పందించిన సీవీసీ, ఫిర్యాదు తానే చేశానని ధృవీకరించాలని పాల్వాయి కి ఈ నెల 2 వ తేదీన లేఖ రాసింది.



ఆ ఫిర్యాదును తానే చేశానని ధృవీకరిస్తూ మరణించడానికి ఒక రోజు ముందు పాల్వాయి గోవర్ధనరెడ్డి సీవీసీ కి మరో లేఖ రాశారు. కేంద్ర జల సంఘం,కేంద్ర పర్యావరణ మంత్వ్రిత్వ శాఖల అనుమతులు లేకుండా పట్టిసీమ, పురుషోత్తమపట్నం ఎత్తిపోతల పథకాలు అక్రమంగా చేపట్టారని పాల్వాయి గోవర్ధనరెడ్డి ఆరోపించారు. పట్టిసీమ ఎత్తిపోతల పధకం కాంట్రాక్టర్‌ కు దాదాపుగా రూ. 400 కోట్లను అదనంగా చెల్లించారని, తద్వారా ఆ మేరకు ప్రభుత్వానికి నష్టం వాటిల్లిందని పాల్వాయి సీవీసీకి రాసిన లేఖలో పేర్కొన్నారు.



పోలవరం ప్రాజెక్ట్‌ పనులకు సంబంధించి టెండర్ల కేటాయింపులో ప్రభుత్వ పద్దతులను అనుసరించలేదని, కొన్ని పనులను నామినేషన్‌ పద్దతిలో కేటాయించారని పాల్వాయి ఫిర్యాదు చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి సరైన అనుమతులు లేకుండా ప్రాజెక్ట్‌ నిర్మాణ వ్యయాన్ని రూ.10 వేల కోట్ల నుంచి రూ. 41 వేల కోట్ల కు పెంచారని ప్రస్తావించారు. పోలవరం కుడి కెనాల్, పురుషోత్తమపట్నం ఎత్తిపోతల పథకాల అమలులో బాధితులైన రైతులకు నష్టపరిహారం చెల్లించే విషయంలో వివక్షత ప్రదర్శించారని పాల్వాయి అరోపించారు.



ప్రాజెక్ట్‌ పనుల కోసం వినియోగించాల్సిన సిమెంట్‌ ను కొందరు ప్రైవేట్‌ వ్యక్తులు అక్రమంగా రవాణా చేస్తున్నారని,కాంట్రాక్టర్లకు అనుకూలంగా ప్రాజెక్ట్‌ పనులలో కొన్ని అంశాలను మార్చారని పాల్వాయి గోవర్ధన రెడ్డి ఆరోపించారు. పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణంలో జరుగుతున్న అక్రమాలు, అవినీతి ఆరోపణలకు సంబంధించిన కొన్ని పత్రికలలో వచ్చిన వార్తల క్లిప్పింగ్‌లను, కాగ్‌ నివేదిక ను తమ ఫిర్యాదుకు జత చేశారు. పోలవరం అవినీతి, అక్రమాలపై రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి ఈఏఎస్‌ శర్మ ఇప్పటికే సీబీఐ,సీవీసీ లకు ఫిర్యాదు చేశారని తెలిసిందని పాల్వాయి ఆ లేఖ లో పేర్కొన్నారు. పార్లమెంటరీ కమిటీ పర్యటనలో భాగంగా కులులో పర్యటిస్తున్న సందర్భంలో పాల్వాయి గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. సీనియర్ రాజకీయ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు మరణానికి ముందు చేసిన ఫిర్యాదుపై సీవీసీ ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top