మండలానికో మంత్రి


పాలేరులో  ‘గ్రేటర్’ తరహా వ్యూహం

సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్‌ఎంసీ) ఎన్నికల తరహాలోనే పాలేరు అసెంబ్లీ ఉప ఎన్నికలో విజయం సాధించడమే లక్ష్యంగా టీఆర్‌ఎస్ వ్యూహం ఖరారు చేసింది. ఖమ్మం జిల్లా పాలేరు అసెంబ్లీ ఉప ఎన్నికలో రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తుండగా.. పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు పార్టీ పక్షాన ఎన్నికల ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. నామినేషన్ల ఘట్టం ముగియడంతో ఎన్నికల ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహంపై డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రులు కేటీ రామారావు, తుమ్మల నాగేశ్వరరావు జిల్లాకు చెందిన ముఖ్య నేతలతో ఇటీవల చర్చించారు.


నియోజకవర్గం పరిధిలోని నాలుగు మండలాలకుగానూ.. ఒక్కో మండలానికి ఒక్కో మంత్రి చొప్పున ప్రచార, సమన్వయ బాధ్యతలు అప్పగించనున్నారు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరితో పాటు మంత్రులు జగదీశ్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, పట్నం మహేందర్‌రెడ్డి మండల ఇన్‌చార్జిలుగా వ్యవహరిస్తారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ప్రతీ డివిజన్‌కు ఒక ఎమ్మెల్యేను నియమించగా.. పాలేరులో ఐదేసి గ్రామాలకు ఒక ఎమ్మెల్యేను నియమిస్తారు. నియోజకవర్గం పరిధిలో 108 గ్రామాలు ఉండగా.. ఇన్‌చార్జిలుగా వ్యవహరించే ఎమ్మెల్యేల జాబితాను కూడా ఖరారు చేసినట్లు సమాచారం. 240 పోలింగ్ బూత్‌లకుగానూ.. ఒక్కో బూత్ కమిటీకి పార్టీ ముఖ్య నేత పర్యవేక్షణలో పది మంది క్రియాశీల నేతలు, కార్యకర్తలతో ప్రచార బృందాలను ఏర్పాటు చేస్తున్నారు. బూత్ స్థాయిలో ప్రచారం నిర్వహించే కార్యకర్తల జాబితాను కూడా సిద్ధం చేశారు.


 ప్రచారానికి గ్రేటర్ మేయర్..:మంత్రి కేటీఆర్ ప్రచార పర్వానికి సారథ్యం వహించనుండగా.. జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్‌తో పాటు 40 మంది కార్పొరేటర్లు 14 రోజుల పాటు పాలేరులోనే మకాం వేయనున్నారు. ఇన్‌చార్జి బాధ్యతలు లేని మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా వీలును, అవసరాన్ని బట్టి ప్రచారంలో పాల్గొనేలా షెడ్యూల్ రూపొందించారు. నియోజకవర్గం పరిధిలో గిరిజన ఓటర్లు ఎక్కువగా ఉండటంతో మహబూబాబాద్ ఎంపీ సీతారాంనాయక్, వరంగల్ జిల్లా డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యా నాయక్.. గిరిజన తండాలపై ప్రత్యేకంగా దృష్టి సారించేలా ప్రణాళిక సిద్ధం చేశారు.


ఇటీవల ఖమ్మంలో నిర్వహించిన టీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవం.. పార్టీకి కొత్త ఊపు తెచ్చిందని నేతలు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రచారంలో ఎక్కడా జోరు తగ్గకుండా చూడాలని నిర్ణయించడంతో పాటు.. ఇప్పటికే ప్రచార సామగ్రిని కూడా పాలేరుకు చేరవేశారు. రెండేళ్ల కాలంలో టీఆర్‌ఎస్ చేసిన అభివృద్ధితో పాటు.. ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ లోపాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్రచార వ్యూహాన్ని ఖరారు చేసినట్లు సమాచారం.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top