పాలమూరు రైతునోట్లో మట్టి

పాలమూరు రైతునోట్లో మట్టి - Sakshi


ఉప్పునుంతల: డిండి ప్రాజెక్టు నీటి వినియోగంలో పొరుగు జిల్లా అధికారులు పాలమూరు రైతుల నోట్లో మరోసారి మట్టికొట్టారు. డిండి కుడికాలువ ద్వారా నీరు అధికంగా వెళ్తుందని షట్టర్ వద్ద తిరిగి మట్టిని పోయించడంతో కాలువ ద్వారా చుక్కనీరు రావడంలేదు. దీంతో ఖరీఫ్ వరిపంటపై ఆయకట్టు రైతుల ఆశలు అవిరయ్యే పరిస్థితులు దాపురించాయి. గత నెల 26న డిండి ప్రాజెక్టు ఎడమ కాలువ ద్వారా నల్లగొండ జిల్లాలోని ఆయకట్టు పొలాలకు నీరు వదిలారు. ఆ సమయంలో పాలమూరు జిల్లా పరిధిలోని లత్తీపూర్, గువ్వలోనిపలి శివారులలో కుడి కాలువ ద్వారా 330ఎకరాల ఆయకట్టుకు నీరు విడుదల చేసే షెట్టర్ (తూము) మట్టిలో కూరుకుపోవడంతో నీటి విడుదల కష్టంగా మారింది. దీంతో పదిరోజుల పాటు ఆయకట్టు రైతులు షెట్టర్‌ను కదిలించడానికి అష్టకష్టాలు పడ్డారు. స్థానిక ఎమ్మెల్యే గువ్వల బాల్‌రాజు నల్లగొండ జిల్లా కలెక్టర్ చిరంజీవులుతో మాట్లాడి ఇరిగేషన్ అధికారులపై ఒత్తిడి తెచ్చారు.

 

 రైతులు, ఇరిగేషన్ అధికారుల చివరి ప్రయత్నంగా బోరుబండి కంప్రెషర్ పైపును నీటిలోకి వదిలి షెట్టర్ వద్ద మట్టిని కదిలించడంతో షెట్టర్ కొంతమేర పైకి లేచింది. ఆ ప్రాంతంలో మట్టి, రాళ్లు ఉండడంతో షెట్టర్ కిందకు పోలేదు. దీంతో నీరు అధికంగా వచ్చి వృథా అయ్యాయి. దీంతో నల్లగొండ జిల్లా రైతులు పాలమూరు జిల్లా పరిధిలో డిండి ప్రాజెక్టు నీళ్లు వృథాగా పోతున్నాయని ఆ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఇరిగేషన్ అధికారులు కుడికాలువ షెట్టర్ వద్ద తిరిగి మట్టిని, రాళ్లను వేయించడంతో కాలువ వెంట నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. వారం రోజుల పాటు నీళ్లు రావడంతో వరి నారుమళ్లు పోసుకుందామని ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ, ఇప్పుడు నీటి సరఫరా రాకుండా చేయడంతో అన్నదాతలు ఆశలు అడియాశలయ్యాయి.

 

 డిండి ప్రాజెక్టు ఇరిగేషన్ అధికారులు నల్లగొండ జిల్లాకు చెందిన వారు కావడం... పాలమూరు జిల్లా అధికారులు రైతుల ఇబ్బందులను పట్టించుకోక పోవడంతో తమ బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితిలో ఆయకట్టు రైతులున్నారు. ఇంతకుముందు కూడా ఇరిగేషన్ అధికారులు షెట్టర్ వద్ద జాలునీరు పోతుందని మట్టిని పోయించడంతోనే ప్రస్తుతం ఈ పరిస్థితి ఏర్పడిందని వారంటున్నారు. షెట్టర్‌ను కిందకు దించే ప్రయత్నం చేయకుండానే అధికారులు మరోసారి మట్టిని, బండరాళ్లను పోయించి ఈ స్థితికి తెచ్చారని వారు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు, ఈ ప్రాంత ఎంపీ, ఎమ్మెల్యేలు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని తమకు న్యాయం చేయాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top