వారం రోజుల్లో 40 లక్షల కోళ్లు మృతి

వారం రోజుల్లో 40 లక్షల కోళ్లు మృతి


ఎండ వేడిమికి కోళ్లు విలవిల

చికెన్ ధరలు మరింత పెరిగే అవకాశం

రాష్ట్రంలో భారీగా నమోదవుతోన్న ఉష్ణోగ్రతలు




హైదరాబాద్: రాష్ట్రంలో ప్రచండ భానుడి ప్రతాపానికి కోళ్లు విలవిలలాడుతున్నాయి. గత వారం రోజులుగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో కోళ్ల ఫారాల్లో కోళ్లు లక్షల సంఖ్యలో మృతి చెందుతున్నాయి. రాష్ట్రంలో 20 వేల కోళ్లఫారాలున్నాయి. వాటిల్లో 5.50 కోట్ల కోళ్లున్నాయి. అందులో 3.50 కోట్ల లేయర్ కోళ్లు, 2 కోట్ల బాయిలర్ కోళ్లున్నాయి. ఇవిగాక మరో 60 లక్షల హేచరీ కోళ్లున్నాయి. సాధారణంగా 35 డిగ్రీల సెల్సియస్‌కు మించి ఉష్ణోగ్రతలు నమోదయితే కోళ్లకు వడదెబ్బ తగలకుండా ఫారాల యజమానులు నీళ్లు చల్లడం వంటి జాగ్రత్తలు తీసుకుంటారు.





అటువంటి జాగ్రత్తలతో 42 డిగ్రీల ఉష్ణోగ్రత వరకు కోళ్లు తట్టుకునే అవకాశం ఉంటుంది. అయితే రాష్ట్రంలో ఈసారి అంతకుమించి ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. పైగా బయట ఉష్ణోగ్రతలకు మించి కోళ్ల ఫారాల్లో రేకుల షెడ్డుల కారణంగా మరో రెండు డిగ్రీల అదనపు ఉష్ణోగ్రతలుంటాయి. ఇంత భారీ వే డి కారణంగా గత వారం రోజుల్లో దాదాపు 40 లక్షల కోళ్లు మృతిచెందాయి. దీంతో కోళ్ల వ్యాపారులకు రూ. 50 కోట్ల మేర నష్టం వాటిల్లిందని పౌల్ట్రీ బ్రీడర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ జి.రంజిత్‌రెడ్డి సాక్షి’తో అన్నారు. వాటికి బీమా సౌకర్యం లేకపోవడంతో నష్టాన్ని వ్యాపారులే భరించాల్సి ఉంటుంది. మరోవైపు 40 లక్షల కోళ్లు మరణించడంతో చికెన్, గుడ్ల రేట్లు మరింత పెరిగే అవకాశం ఉంటుందని దుకాణాదారులు పేర్కొంటున్నారు.

 


ఇటీవల బర్డ్‌ఫ్లూతో నష్టపోయిన వ్యాపారులకు భారీ ఎండలతో కోళ్లు చనిపోయి నష్టాన్ని చవిచూస్తున్నారు. రామగుండంలో 45 డిగ్రీలు... రాష్ట్రంలో ఇంకా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతూనే ఉన్నాయి. ఆదివారం సాయంత్రం 5.30 గంటల వరకు హైదరాబాద్ వాతావరణశాఖ అంచనా వేసిన లెక్కల ప్రకారం రామగుండంలో 45 డిగ్రీల సెల్సియస్ అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. నిజామాబాద్‌లో 44, వరంగల్‌లో 43, కంపాసాగర్‌లో 42.9, అశ్వారావుపేటలో 42.6, జగిత్యాలలో 42.2, ఆదిలాబాద్‌లో 42.1, హైదరాబాద్‌లో 41.5, రుద్రూర్‌లో 41.3, సంగారెడ్డిలో 40.7, తాండూరులో 41.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top