ప్రొ కబడ్డీ ట్రోఫీ మాదే...

ప్రొ కబడ్డీ ట్రోఫీ మాదే...


- ఫైనల్ లో యూ ముంబయిని నిలువరిస్తాం

- ‘సాక్షి’తో జైపూర్ టీం సభ్యుడు గంగాధరి మల్లేశ్

కరీంనగర్ స్పోర్ట్స్ : ప్రొఫెషనల్ ప్రీమియర్ లీగ్ కబడ్డీ టైటిల్‌ను జైపూర్ జట్టు కైవసం చేసుకుంటుందని జైపూర్ ప్యాంథర్స్ కబడ్డీ జట్టు సభ్యుడు, జిల్లావాసి గంగాధరి మల్లేశ్ ఆశాభావం వ్యక్తంచేశాడు. ఆదివారం ముంబయిలో జరిగే ఫైనల్‌లో యూ ముంబయి, జైపూర్ ప్యాంథర్స్ జట్లు తలపడనున్నాయి. జైపూర్ జట్టు ఫైనల్ చేరిన సందర్భంగా ‘సాక్షి’ ఆయనను ఫోన్‌లో సంప్రదించింది.



ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఇన్ని రోజులు ఆడింది ఒక ఎత్తు. ఫైనల్ ఆడడం ఒక ఎత్తు. యూ ముంబయి మంచి ఫాంలో ఉంది. ఇండియన్ టీం కెప్టెన్, ఆ జట్టు కెప్టెన్ అనూప్ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. ఆయనను నిలువరిస్తే అలవోకగా విజయం సాధిస్తాం. మా జట్టు కూడా మంచి ఫాంలో ఉంది. లీగ్‌లో నంబర్ వన్ స్థానంలో నిలిచాం. మా జట్టు ప్రధాన బలం డిఫెన్స్. అందుకే మాకు విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శుక్రవారం జరిగిన తొలి సెమీఫైనల్‌లో పాట్నాపై అలవోకగా గెలుపొందాం.

 

డిఫెన్స్ టైట్ చేయాలనుకుంటున్నాం..

యూ ముంబయి జట్టు అఫెన్స్(రైడింగ్), డిఫెన్స్‌లో చాలా బాగుంది. ఆ జట్టు కెప్టెన్ అనూప్ ఒక్కడిని నిలువరిస్తే అఫెన్స్‌లో మేం పైచేయి సాధించినట్లే. ఆయనను ఎక్కువగా సిట్టింగ్ బ్లాక్‌లో ఉండడానికే పరిమితం చేసేందుకు పక్కా టెక్నిక్‌తో బరిలో దిగుతున్నాం. ఇక డిఫెన్స్‌పై మేం ఎక్కువగా దృష్టి పెట్టాం. మా జట్టు కూడా డిఫెన్స్‌లో చాలా బాగుంది. గత ఇండియన్ టీం కెప్టెన్ న వనీత్ కౌర్(జైపూర్ టీం) మంచి డిఫెన్స్ ప్లేయర్. మొత్తం మీద 30 వరకు పాయింట్లు సాధించిన జట్టు విజయం సాధిస్తుందనుకుంటున్నా.

 

అఫెన్స్ ఛాన్స్ వస్తే నాకు ఛాన్స్...

నేను రైడర్‌ను. జైపూర్ టీం కూడా నన్ను రైడర్ కిందనే తీసుకుంది. లీగ్ పోటీల్లో నేను ఆడిన మ్యాచ్‌ల్లో ప్రతీసారి అటు అఫెన్స్‌లో, ఇటు డిఫెన్స్‌లో పాయింట్లు సాధించినప్పటికీ అఫెన్స్‌కే ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తా. నేను అఫెన్స్‌లో స్పెషలిస్ట్. ఫైన ల్‌లో మా జట్టు ముగ్గురు రైడర్స్, నలుగురు డిఫెన్సర్‌తో ఆడాలనుకుంటోంది. ఒకవేళ ఫైనల్ మ్యాచ్‌లో జట్టులోని ముగ్గరు రైడర్‌లు అవుట్ అయితే నన్ను సబ్‌స్ట్యూట్ కింద రైడింగ్ చేసే అవకాశం నాకే వస్తుంది. ఫైనల్ మ్యాచ్ కావడంతో నాకంటే సీనియర్స్ చాలామంది ఉన్నారు. విజయమే లక్ష్యంగా బరిలో దిగుతున్నాం.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top