‘ప్రణాళిక’ కొలిక్కి


సాక్షి, రంగారెడ్డి జిల్లా: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ‘మన ఊరు- మన ప్రణాళిక’ ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. వాస్తవానికి ఈ నెల మొదటివారంలోనే ప్రణాళిక తుదిరూపు దాల్చాల్సి ఉండగా.. మండల పరిషత్ అధికారుల నిర్లక్ష్య వైఖరితో గందరగోళం నెలకొంది. ప్రతి పల్లెకు మూడు పనులు చొప్పున ప్రాధాన్యత క్రమంలో తీసుకుని ప్రణాళికలు తయారు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేయగా.. అధికారులు మాత్రం ఒకే కేటగిరీ పనిని పలుచోట్ల తీసుకోవడంతో ప్రణాళిక ఆసాంతం తప్పులతడకగా మారింది.



 దీంతో మళ్లీ ప్రాధాన్యత క్రమంలో జాబితాను రూపొందించే పనిలో పడ్డ అధికారులు తాజాగా ఈ ప్రక్రియను పూర్తి చేశారు. రూ.1768.53 కోట్లతో 3,879 పనులు గుర్తించారు. శాఖల వారీగా పనులు నిర్దేశించిన యంత్రాంగం.. ప్రణాళికను ప్రభుత్వానికి సమర్పించింది.



 రోడ్లకే ప్రాధాన్యం..

 ‘మన ఊరు-మన ప్రణాళిక’లో భాగంగా యంత్రాంగం రూపొందించిన ప్లాన్‌లో తొలిప్రాధాన్యం రహదారులకే దక్కింది. పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగానికి సంబంధించి 1,370 రోడ్ల పనులు గుర్తించారు. వీటి అంచనా వ్యయం రూ.730.66కోట్లు. జిల్లా వ్యాప్తంగా రూపొందించిన ప్రణాళికలో దాదాపు 40శాతం రోడ్లకే కేటాయించారు. ఆ తర్వాత తాగునీటి విభాగంలో 1010 పనులు నిర్ధారించగా.. ఈ పనుల వ్యయం రూ. 407.54కోట్లు.


అదేవిధంగా శ్మశానవాటికలకు సంబంధించి 110 పనులకు రూ. 29.21కోట్లు, అంగన్‌వాడీ భవనాల నిర్మాణ పనులకు సంబంధించి రూ.13.36కోట్లు పేర్కొంటూ ప్రణాళిక తయారు చేశారు. ఇందులో మొత్తం 27 శాఖలకు సంబంధించి 3,879 పనులు ప్రణాళికలో పొందుపర్చారు.



 ప్రభుత్వం ఆమోదం పొందిన అనంతరం నిధుల లభ్యతను బట్టి పనులు చేపట్టే అవకాశంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top