ఓయూలో కొనసాగుతున్న రగడ

ఓయూలో కొనసాగుతున్న రగడ - Sakshi


స్వాగత్ గ్రాండ్ హోటల్‌పై టీవీవీ దాడి..

పలువురి అరెస్టు

ఏబీవీపీ అర్ధనగ్న ప్రదర్శన

1న నిరుద్యోగ విద్యార్థుల సింహగర్జన సభ

2న తెలంగాణ ఉత్సవాల్లో నల్లజెండాలతో నిరసనలు


హైదరాబాద్: ఉస్మానియా వర్సిటీ స్థలంలో పేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తామని సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనపై విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి.



సోమవారం తెలంగాణ విద్యార్థి వేదిక (టీవీవీ) రాష్ట్ర నాయకుడు ఆజాద్ నేతృత్వంలో 20 మంది విద్యార్థులు హబ్సిగూడ వైపు ఓయూ భూమిని ఆక్రమించి హోటల్‌ను నిర్మించారని ఆగ్రహంతో స్వాగత్ గ్రాండ్ హోటల్‌పై దాడి చేసి అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. ఈ హోటల్ ఓ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేది కావడం గమనార్హం. పోలీసులు విద్యార్థులను కొట్టి 17 మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అనంతరం అక్కడికి చేరుకుని మీడియాతో మాట్లాడుతున్న తెలంగాణ విద్యార్థి, నిరుద్యోగ జేఏసీ చైర్మన్ కళ్యాన్‌ను పోలీసులు చితకబాది అరెస్ట్ చేసి సాయంత్రం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు.



ఓయూ భూముల్లో ఇళ్లు నిర్మిస్తామన్న సీఎం కేసీఆర్ ప్రకటనకు నిరసనగా ఆర్ట్స్ కళాశాల ఎదుట ఏబీవీపీ కార్యకర్తలు చేతులకు తాళ్లు కట్టుకొని అర్ధనగ్న ప్రదర్శన చేశారు. టీఎన్‌ఎస్‌ఎఫ్ జాతీయ నేత మదన్‌మోహన్‌రావు, రాష్ట్ర అధ్యక్షులు మధుసూదన్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు బాబులాల్‌నాయక్ నేతృత్వంలో ఓయూ భూములను కాపాడాలని గవర్నర్‌కు ఉత్తరాలు రాసి పోస్టు బాక్స్‌లో వేసి, అనంతరం కళ్లకు నల్లగుడ్డలు కట్టుకొని మోకాళ్లపై నిల్చొని నిరసన తెలిపారు.



టీఎస్ జేఏసీ చైర్మన్ పున్న కైలాష్‌నేత, కన్వీనర్ బాలకృష్ణనేత తదితరుల ఆధ్వర్యంలో ఓయూ భూముల ఆక్రమణ, సీఎం కేసీఆర్ ప్రకటనపై  లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు.  తెలంగాణ విద్యార్థి సంఘం(టీవీఎస్) అధ్యక్షుడు దుర్గం భాస్కర్,  ఓయూ విద్యార్థి జేఏసీ చైర్మన్ దరువు ఎల్లన్న, తెలంగాణ విద్యార్థి జేఏసీ జాతీయ మీడియా ప్రతినిధి, కాంగ్రెస్ అధికార ప్రతినిధి మన్నే క్రిషాంక్ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల ఎదుట సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను, టీఆర్‌ఎస్ పార్టీ జెండాను దహనం చేశారు.



ఓయూలో ఆక్రమణకు గురైన భూములను ప్రభుత్వం యూనివర్సిటీకి అప్పగించాలని డిమాండ్ చేస్తూ జూన్ 1న నిరుద్యోగ సింహగర్జన బహిరంగ సభను, జూన్ 2న తెలంగాణ అవతరణ ఉత్సవాలను బహిష్కరించి నల్లజెండాలతో నిరసన తెలియజేయనున్నట్లు టి.విద్యార్థి  నిరుద్యోగ జేఏసీ చైర్మన్ కళ్యాణ్, మానవతరాయ్ విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు.



అరెస్ట్ చేసిన టీవీవీ కార్యకర్తలను విడుదల చేయాలని అన్ని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. కాగా టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ అనుబంధ టీఎన్‌ఎస్‌ఎఫ్‌తో కావాలని ఆందోళనలు చేయిస్తున్నారని, గతంలో భూకబ్జాల దందా నడిపింది వారి నాయకులేనని టీఆర్‌ఎస్ పార్టీ అనుకూల ఓయూ విద్యార్థి జేఏసీ నాయకుడు దూదిమెట్ల బాలరాజ్‌యాదవ్ విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఘనంగా జరుపుకుంటామని పేర్కొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top