వందేళ్ల సంబురం

వందేళ్ల సంబురం


సర్వాంగ సుందరంగా ముస్తాబైన ఓయూ

- మూడు రోజులపాటు ఘనంగా ఉత్సవాలు

- నేటి ఉదయం 10 గంటలకు వేడుకలు ఆరంభం

- చరిత్రను ప్రతిబింబించేలా స్వాగత ద్వారాలు

- ముఖ్య అతిథిగా హాజరుకానున్న రాష్ట్రపతి

- సదస్సులు, చర్చాగోష్టులు, సాంస్కృతిక కార్యక్రమాలు.. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే కళారూపాల ప్రదర్శన




సాక్షి, హైదరాబాద్‌: శతాబ్ది ఉత్సవాలకు ఉస్మానియా విశ్వవిద్యాలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. బుధవారం నుంచి మూడు రోజుల పాటు జరిగే ప్రారంభోత్సవాలకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. రంగు రంగుల విద్యుత్‌ కాంతులతో వర్సిటీ ప్రాంగణాన్ని అలంకరించారు. చారిత్రక ఆర్ట్స్‌ కళాశాల సరికొత్త హంగులను సంతరించుకుంది. ప్రధాన వేడుకలు జరుగనున్న ‘ఏ’ గ్రౌండ్‌లో ఏర్పాట్లన్నీ సిద్ధమయ్యాయి. వర్సిటీ పరిపాలనా భవనం, వైస్‌ చాన్స్‌లర్‌ లాంజ్, అన్ని కాలేజీలు, హాస్టళ్లు, ఠాగూర్‌ ఆడిటోరియం, ల్యాండ్‌స్కేప్‌ తదితర ప్రాంతాలను, క్యాంపస్‌లోని ప్రధాన రహదారులకు ఇరువైపులా ఉన్న చెట్లను అలంకరించారు. తార్నాక వైపున్న ప్రధాన ద్వారాన్ని ఆర్ట్స్‌ కళాశాల శిల్పకళా నైపుణ్యం ప్రతిబింబించే విధంగా అలంకరించగా.. ఎన్‌సీసీ వైపు ఉన్న ప్రధాన ద్వారాన్ని పుస్తక భాండాగారాన్ని తలపించేలా రూపొందించారు. మొత్తంగా వందేళ్ల ఉస్మానియా ఘనకీర్తిని చాటేవిధంగా ఏర్పాట్లు పూర్తి చేశారు.



సదస్సులు.. సాంస్కృతి కార్యక్రమాలు

బుధవారం నుంచి శుక్రవారం వరకు మూడు రోజుల పాటు జరుగనున్న శతాబ్ది ఉత్సవాల ప్రారంభోత్సవంలో పలు అంశాలపై సదస్సులు, చర్చాగోష్టులు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. వివిధ రంగాలకు చెందిన జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు వేడుకల్లో భాగస్వాములు అవుతున్నారు. శతాబ్ది ఉత్సవాలు గుర్తుండిపోయేలా  వైట్‌హౌస్‌ నమూనాలో సుమారు రూ.40 కోట్లతో నిర్మించనున్న శతాబ్ది పరిపాలనా భవనానికి రాష్ట్రపతి భూమి పూజ చేయనున్నారు. అలాగే శతాబ్ది పైలాన్‌ను ఆవిష్కరించి.. రూ.70 కోట్లతో నిర్మించతలపెట్టిన 7 హాస్టళ్ల భవనాలకు శంకుస్థాపన చేస్తారు. ప్రారంభోత్సవాలకు అధ్యక్షత వహించనున్న గవర్నర్‌ నరసింహన్‌.. ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రపై రూపొందించిన ‘హిస్టరీ ఆఫ్‌ ఓయూ రిఫ్లెక్షన్స్‌ (ఉర్దూలో ‘సౌఘాత్‌’, తెలుగులో ‘వందేళ్ల ఉస్మానియా)’ పుస్తకాలను ఆవిష్కరిస్తారు. సావనీర్‌ను విడుదల చేస్తారు.



కళారూపాల ప్రదర్శన కూడా..

తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబించే కళారూపాలను ప్రారంభోత్సవాల్లో ప్రదర్శించనున్నారు. ప్రధాన వేడుకలు జరుగనున్న ‘ఏ’ గ్రౌండ్‌లో.. రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ నేతృత్వంలో ఒగ్గు కథ సహా వివిధ కళారూపాలను ప్రదర్శిస్తారు. ఆర్ట్స్‌ కళాశాల ప్రాంగణంలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాల్లో విద్యార్థుల ప్రదర్శనలు ఉంటాయి. అఫ్ఘానిస్తాన్, తుర్క్‌మెనిస్తాన్, సూడాన్, ఇరాక్‌ తదితర దేశాల నుంచి వచ్చి వర్సిటీలో చదువుకుంటున్న విద్యార్థులు ఆర్ట్స్‌ కళాశాల వద్ద తెలంగాణ చరిత్రపై ప్రత్యేక ప్రదర్శన ఇవ్వనున్నారు. అలాగే ఆయా దేశాల సాంస్కృతిక అస్తిత్వాన్ని తెలిపే కార్యక్రమాలు కూడా ఉంటాయి. విదేశీ విద్యార్థులతో పాటు ఉస్మానియా అనుబంధ కళాశాలల విద్యార్థులు కూడా వివిధ రకాల కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ప్రారంభోత్సవంలో రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీతోపాటు గవర్నర్‌ నరసింహన్, సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎంపీ కేశవరావు, మేయర్‌ బొంతు రామ్మోహన్, వైస్‌ చాన్సలర్‌ ఎస్‌.రామచంద్రయ్య, పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు.



బుధవారం కార్యక్రమాలివీ..

- ఉదయం 10.30 నుంచి 12 గంటల వరకు ప్రధాన వేదిక ‘ఏ’ గ్రౌండ్‌ వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు

- 12 గంటల నుంచి 12.30 వరకు ఓయూ డాక్యుమెంటరీ.

- 12.35 నుంచి 12.37 వరకు జాతీయ గీతాలాపన

- 12.38 నుంచి 12.42 వరకు వైస్‌ చాన్సలర్‌ స్వాగతోపన్యాసం

- 12.42 నుంచి 12.44 వరకు వేదికపై ఉన్న ప్రముఖులకు సన్మానం

- 12.44 నుంచి 12.45 వరకు రాష్ట్రపతి చేతుల మీదుగా శతాబ్ది పరిపాలన భవనానికి, హాస్టల్‌ కాంప్లెక్స్‌లకు శంకుస్థాపన, పైలాన్‌ ఆవిష్కరణ

- 12.45 నుంచి 12.49 వరకు ఎంపీ కె.కేశవరావు ప్రసంగం

- 12.49 నుంచి 12.53 వరకు ఉప ముఖ్యమంత్రి కడియం ప్రసంగం

- 12.53 నుంచి 12.58 వరకు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ప్రసంగం

- 12.58 నుంచి 1.03 వరకు సీఎం కేసీఆర్‌ ప్రసంగం

- 1.03 నుంచి 1.06 వరకు గవర్నర్‌ నరసింహన్‌ ఓయూ సావనీర్‌ను, వందేళ్ల గ్రంథాన్ని ఆవిష్కరించి, ప్రసంగిస్తారు

- 1.11 నుంచి 1.26 వరకు రాష్ట్రపతి ప్రణబ్‌ కీలక ప్రసంగం

- 1.28 నుంచి 1.30 వరకు జాతీయ గీతాలాపన.. ప్రధాన వేడుక ముగింపు

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top