అనాథలు, బాలకార్మికులకు వరం ‘స్మైల్’


మెదక్ రూరల్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆపరేషన్ స్మైల్ పథకం అనాథ పిల్లలకు వరంలా మారింది. ఇందుకోసం  పోలీసులు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. అనాథ పిల్లలును, బాలకార్మికులను గుర్తించి వారి జీవితాల్లో వెలుగు నింపేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది.  జనవరి 1న ప్రారంభించిన ఈ పథకం ఈ నెలాఖరు వరకు కొనసాగుతుంది.  కాగా ఇందుకోసం డివిజన్ స్థాయి అధికారిని ఏర్పాటు చేశారు.   



ఆ అధికారి సమక్షంలో నలుగురు పోలీసులు పనిచేస్తారు.   కాగా మెదక్ డివిజన్‌స్థాయి  అధికారిగా మెదక్ పట్టణానికి  చెందిన సబ్‌ఇన్‌స్పెక్టర్ అంజయ్యను నియమించారు. అలాగే మెదక్ రూరల్  కానిస్టేబుల్ మల్లేశం, పట్టణ కానిస్టేబుల్  దుర్గపతి, టేక్మాల్ పోలీస్‌స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ లక్ష్మీనారాయణ, నారాయణఖేడ్‌కు చెందిన అహ్మద్ హుస్సేన్‌ను నియమించారు. వీరు తప్పిపోయిన పిల్లల కోసం ఆరా తీయడం, ఇటుక బట్టీలు, హోటళ్లు, కార్ఖానాల్లో, రైల్వేస్టేషన్లు, కోళ్లఫారాల్లో పని చేసే పిల్లలను గుర్తించి వారితల్లి తండ్రులకు కౌన్సెలింగ్ ఇప్పించి బడుల్లో చేర్పించడం చేస్తారు.



ఒకవేళ అనాథపిల్లలు అయిఉంటే వారిని వెంటనే సంగారెడ్డి శిశువిహర్ తరలించటం లేదా,  వసతిగృహాల్లో చేర్పించి చదువు చెప్పించటం వీరివిధి.    ఈ పథకం కింద విధులు నిర్వహించే  సిబ్బందికి గతనెలలో శిక్షణ ఇచ్చినట్లు తెలిసింది. ఇటీవల మెదక్ మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన 14 బాలుడు మహేష్ చదువు మానేసి అదేగ్రామంలోని కోళ్లఫారంలో పనిచేస్తుండగా ఆపరేషన్‌స్మైల్ సిబ్బంది గుర్తించి వారి తల్లితండ్రులకు కౌన్సెలింగ్ ఇప్పించి మక్తభూపతిపూర్ ఉన్నతపాఠశాలలో చేర్పించారు.



అలాగే నారాయణఖేడ్‌లో శివ అనే 10లోపు బాలుడు బస్టాండ్‌లో బిక్షాటన చేస్తుండగా గుర్తించి అక్కడే ఉన్న వసతి గృహంలో చేర్పించి బడికి పంపించామని ఆపరేషన్‌స్మైల్ డివిజన్ అధికారి అంజయ్య తెలిపారు. కాగా మెదక్ పట్టణం గాంధీనగర్‌కు చెందిన 12 ఏళ్ల మహి అనే బాలుడు ఈనెల21న స్నేహితుడితో కలిసి ఏడుపాయల జాతర వెళ్లి తప్పిపోయినట్లు తండ్రి తమకు ఫిర్యాదు చేశాడని అతని గురించి ఆరా తీస్తున్నట్లు సిబ్బంది ఒకరు తెలిపారు. బాలకార్మికులతో ఎవరు పనిచేయించిన వెంటనే తమదృష్టికి తేవాలని ఆపరేషన్‌స్మైల్ సిబ్బంది పేర్కొన్నారు.  కార్ఖానాలు, ఇటుక బట్టీలు తదితర ప్రాంతాల్లో బాలకార్మికుల కోసం  క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top