రెండంటే..రెండే


సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ప్రమాణాలు పాటించని ఇంజనీరింగ్ కాలేజీల గుర్తింపు రద్దు నేపథ్యంలో జిల్లాలో కేవలం రెండు కాలేజీలు మాత్రమే కౌన్సెలింగ్ కు అర్హత దక్కింది. ప్రయోగశాలలు, అర్హత కలిగిన ఉపాధ్యాయులు, మౌలిక సౌకర్యాల కొరత నేపథ్యంలో యూనివర్సిటీలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించాయి. గతంలో జిల్లాలో తొమ్మిది ఇంజనీరింగ్ కాలేజీల్లో సుమారు మూడువేలకు పైగా ఇంజనీరింగ్ సీట్లు విద్యార్థులకు అందుబాటులో ఉండేవి.

 

అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) నిబంధనలకు అనుగుణంగా కాలేజీల్లో విద్యాప్రమాణాలు లేవనే కారణంతో జేఎన్‌టీయూ, ఉస్మానియా యూనివర్సిటీలు కొన్ని కాలేజీల గుర్తింపును రద్దుచేశాయి. రాష్ట్రంలో 315 ఇంజినీరింగ్ కాలేజీలకు కేవలం 141కాలేజీలకు మాత్రమే గుర్తింపు ఉన్నట్లు ఉన్నత విద్యామండలి ప్రకటించింది. జిల్లాలో తొమ్మిది ఇంజనీరింగ్ కాలేజీలు ఉండగా యూనివర్సిటీల నిర్ణయంతో ప్రస్తుతం రెండు కాలేజీలు మాత్రమే కౌన్సెలింగ్‌కు అర్హత సాధించాయి. జేపీఎన్‌ఎసీ(ధర్మాపూర్)తో పాటు స్విట్స్(దేవరకద్ర) కాలేజీలకు మాత్రమే కౌన్సెలింగ్‌లో పాల్గొనే అర్హత దక్కింది.

 

ప్రస్తుతం ఒక్కో కాలేజీలో 420 సీట్ల చొప్పున 840 సీట్లలో మాత్రమే విద్యార్థులను భర్తీ చేసుకునే అవకాశం ఉంటుంది. జిల్లాలో ఇప్పటికే మూడు ఇంజనీరింగ్ కాలేజీలు విద్యార్థులు లేకపోవడంతో మూతపడ్డాయి. అలాగే ఫార్మసీ, బయోటెక్నాలజీ కాలేజీల్లోనూ సీట్ల సంఖ్యకు భారీగా కోత పడింది. జిల్లాలో కేవలం మూడు ఫార్మసీ కాలేజీలకు మాత్రమే గుర్తింపు లభించినట్లు సమాచారం.

 

రెండో విడతలో అవకాశం?

ఎంసెట్‌లో అర్హత పొందిన విద్యార్థులకు ఈ నెల 14 నుంచి 23వ తేదీ వరకు సర్టిఫికేట్ల వెరిఫికేషన్‌కు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి అవకాశం కల్పించింది. దీంతో మహబూబ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన వెబ్ కౌన్సెలింగ్ కేంద్రంలో ఇప్పటివరకు 1837 మంది విద్యార్థులు ధ్రువపత్రాల పరిశీలనకు హాజరయ్యారు. గుర్తింపు రద్దు నేపథ్యంలో కౌన్సెలింగ్‌లో అవకా శం దక్కని కాలేజీల యాజమాన్యాలు అర్హత సాధించేందు కు ముమ్మర ప్రయత్నాలు ప్రారంభించాయి. రెండో విడత కౌన్సెలింగ్ ప్రారంభమయ్యే నాటికి గుర్తింపు పునరుద్ధరిస్తారనే ఆశలో యాజమాన్యాలు ఉన్నాయి.

 

తొలి విడత కౌన్సెలింగ్‌లో ప్రతిభావంతులైన విద్యార్థులు ఇతర కాలేజీల్లో చేరి తే ఆ తర్వాత అనుమతి లభించినా ఫలితాలపై ప్రభావం చూపుతుందనే ఆందోళన కాలేజీ యాజమాన్యాల్లో వ్యక్తమవుతోంది. మరోవైపు ఫీజు రీయంబర్స్‌మెంట్ భారాన్ని త గ్గించుకునేందుకే రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని వి ద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. సాంకేతిక విద్యను అందుకోవాలనే ఆశతో ఉన్న  పేద విద్యార్థులు సీట్ల సంఖ్య లో కోత విధించడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top