ఆన్‌లైన్ మోసం..!


 నల్లగొండ క్రైం  : చాకచక్యంతో ఓ వ్యక్తి ఖాతా నుంచి ఓ మోసగాడు చేసిన రూ. 5 లక్షల దోపిడీని పోలీసులు అడ్డుకున్నారు. వన్‌టౌన్ సీఐ రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని మాన్కంచల్కకు చెందిన ముక్కమల్ల దాదాబాషా బత్తాయి వ్యాపారం చేస్తుంటాడు.బత్తాయి లోడ్ లారీలను ఢిల్లీకి పంపించడంతో అక్కడి వ్యాపారులు దాదాబాషా ఖాతాలో డబ్బులను జమచేస్తుం టారు. ఉదయం 11గంటలకు ఢిల్లీ వ్యాపారులు రూ.5లక్షలు ఖాతాలో వేశారు. దాదాబాషాకు మధ్యాహ్నం 2.15 గంటలకు రాజా అనే వ్యక్తి ఫోన్‌చేసి నీ ఏటీఎం కార్డు బ్లాక్ అయ్యిందని చెప్పాడు.

 

 తాను బ్యాంకు నుంచి మాట్లాడుతున్నానని, దానిని సరిచేయడానికి నీ పిన్‌నంబర్ సరిచేయాలని కోడ్ నెంబర్ చెప్పమని అడిగాడు. దీంతో పాషా నంబర్ చెప్పాడు. వెంటనే నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్‌ఫర్ సిస్టమ్ ద్వారా పాషా ఖాతాలో ఉన్న రూ.5లక్షలను రాజా తన ఖాతాలోకి వేసుకున్నాడు. ఓ రైతు ఫోన్‌చేసి పాషాను బత్తాయి డబ్బులు కావాలని కోరడంతో ఐసీఐసీఐ బ్యాంకులో డబ్బులు డ్రా చేసేందుకు వెళ్లారు. ఖాతాలో డబ్బులు లేకపోవడంతో నివ్వెరపోయి మేనేజర్‌ను సంప్రదించాడు. నీ ఖాతాలోని డబ్బులు నేషనల్ ఎలక్ట్రానిక్‌ఫండ్ ట్రాన్స్‌ఫర్ ద్వారా రాజా ఖాతాలోకి వెళ్లాయని చెప్పాడు. తాను డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయలేదని ఓ వ్యక్తి ఫోన్‌చేసి ఫిన్‌కోడ్ బ్లాక్ అయ్యిం దని, నంబర్ చెప్పాలంటే చెప్పానని వివరించడంతో పోలీసులను సంప్రదించాలని సూచించారు.

 

 ఏఎస్పీ గంగారామ్‌ను కలిసి జరిగిన విషయాన్ని వివరించాడు. వెంటనే సీఐను పిలిచి సమస్యను వివరించాడు. ఐసీఐసీఐ బ్యాంకు అధికారులను సంప్రదించిన సీఐ రూ.5లక్షలు రాజా ఖాతా నుంచి డ్రా కాకుండా బ్లాక్ చేయించారు. ఈ విషయాన్ని పసిగట్టిన రాజా పోలీసులు తనపై నిఘా వుంచారని అనుమానించి వెంటనే తిరిగి రూ.5లక్షలను పాషా ఖాతాలోకి జమచేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. బ్యాంకు ఖాతానంబర్లు, ఏటీఎం కార్డు నంబర్లుగానీ, కోడ్‌నంబర్లు గానీ ఎవరు అడిగినా చెప్పవద్దన్నారు. ఆన్‌లైన్‌లో ఇలాంటి మోసాలు జరుగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా వుండాలని విజ్ఞప్తి చేశారు. తనకు 5లక్షల రూపాయలు ఇప్పించిన పోలీసులకు పాషా కృతజ్ఞతలు తెలిపారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top