టమాటా ధర ఢమాల్

టమాటా ధర ఢమాల్


బొల్లారం: ఆరుగాలం శ్రమించే రైతన్నకు 'టమాటా' ఆవేదన మిగిల్చింది. పడిన కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరయింది...మొన్నటి వరకు కిలో రూ.50 వరకు పలికిన టమాటా ధర ఒక్కసారిగా రూ.2 కే పడిపోయింది. కనీసం గిట్టుబాటు ధర లేక రైతన్న విలవిల్లాడుతున్నాడు. ఆల్వాల్ రైతుబజారులో బుధవారం ఈ పరిస్థితి నెలకొంది. 


మెదక్ జిల్లా దౌల్తాబాద్ మండలం రాయపోల్ గ్రామానికి చెందిన రైతు మామిడి మాధవరెడ్డి బుధవారం 60 బాక్స్‌ల టమాటాను రూ.2 వేలు వెచ్చించి ఆటోలో రైతు బజారుకు తెచ్చారు. ఒక బాక్స్(30 కిలోలు) టమాటాలను రూ.50కే దళారులు అడగటంతో ఆయన అవాక్కయ్యాడు.



కనీసం రవాణా ఖర్చులు కూడా ఆయనకు దక్కని పరిస్థితి. దీంతో రైతు బజారులో దళారులు రూ.10కే 3 కిలోల చొప్పున విక్రయించారు. హైదరాబాద్‌కు పెద్ద మొత్తంలో టమాటా బెంగుళూరు నుంచి రావడంతో స్థానిక రైతులు నష్ట పోవాల్సి వస్తోందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు.


తమ పరిస్థితి గమనించి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే టమాటాను నిలిపి వేయాలని ప్రభుత్వాన్ని స్థానిక టమాట రైతులు కోరుతున్నారు. టమాటా ధర ప్రభావం మిగతా కూరగాయలపైన కూడా పడింది. వారి ధరలు కూడా కొద్దిగా తగ్గాయి.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top