ఆగని మృత్యుఘోష

ఆగని  మృత్యుఘోష - Sakshi


ఒక్కరోజే 9 మంది రైతుల ఆత్మహత్య

 

గుండెపోటుతో మరొకరు..

వరంగల్, కరీంనగర్ జిల్లాల్లోనే ఆరుగురి బలవన్మరణం

అన్నదాత గుండెలపై అప్పుల కుంపట్లు

ఎండుతున్న పంటలను చూడలేక చేనులోనే పురుగుల మందు

తాగుతున్న రైతన్నలు


 

నెట్‌వర్క్: పంటపై ఆశలు అడుగంటి ఒకరు.. అప్పులే ఉరితాళ్లై ఇంకొకరు.. పెట్టుబడి మట్టిపాలై మరొకరు.. కారణాలేవైతేనేం.. అన్నదాతల బలవన్మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి! రుణాలే యమపాశాలై రైతుల మెడకు బిగుసుకుంటున్నాయి. రాష్ట్రంలో గురువారం తొమ్మిది మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. మరో రైతు పంట ఎండిపోయిందన్న దిగులుతో గుండెపోటుకు గురై ప్రాణాలు విడిచాడు. కరీంనగర్ జిల్లాలో ముగ్గురు, వరంగల్ జిల్లాలోముగ్గురు, మహబూబ్‌నగర్‌లో ఇద్దరు, మెదక్‌లో ఒకరు చొప్పున ప్రాణాలు తీసుకున్నారు.

 

పంటలు ఎండి.. గుండెలు పగిలి..


 కరీంనగర్ జిల్లా రాయికల్ మండలం తాట్లవాయికి చెందిన గాండ్ల గంగరాజం(45)కు మూడెకరాల భూమి ఉండగా.. కూతురు పెళ్లి కోసం రెండేళ్ల క్రితం ఎకరం భూమి అమ్మేశాడు. ఇటీవల రూ.లక్ష అప్పు చేసి వ్యవసాయ బావి తవ్వించాడు. రెండేళ్లుగా వ్యవసాయం కలిసి రాలేదు. అప్పులు రూ.7 లక్షలకు చేరాయి. వర్షాల్లేక బావిలో నీరు అడుగంటింది. నారుమడి ఎండిపోయింది. అప్పులు ఎలా తీర్చాలన్న మనస్తాపంతో గురువారం పొలం వద్దే క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కోరుట్ల మండలం అయిలాపూర్‌కు చెందిన రెబ్బాసు రాజమల్లయ్య(48)కు ఎకరంన్నర భూమి, గొర్ల మంద ఉంది. ఆయన భార్య రాధ నాలుగు నెలల క్రితం అనారోగ్యంతో చనిపోయింది. ఆస్పత్రి ఖర్చుల కోసం రూ.2 లక్షల మేర అప్పు చేశాడు. రెండు నెలల క్రితం తనకున్న భూమిలో మొక్కజొన్న వేశాడు. పెట్టుబడి కోసం చేసిన రూ.లక్షతో కలిపి అప్పులు రూ.3 లక్షలకు చేరాయి. గొర్ల మందలో సగం అమ్మినా అప్పులు తీరలేదు. దీంతో మనోవేదనకు గురై గురువారం గ్రామ శివారులో చెట్టుకు ఉరేసుకున్నాడు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం మామిడాలపల్లికి చెందిన ఎడ్ల ప్రభాకర్‌రెడ్డి(45).. నాలుగెకరాల్లో వరి పంట వేశాడు. బావిలో నీళ్లు లేక మూడేళ్లుగా దిగుబడి రాలేదు. రూ.4 లక్షల అప్పు చేసి రెండుసార్లు బావి తవ్వించాడు. ఈ ఏడాది కూడా పంట పండే అవకాశం కనిపించకపోవడంతో.. పొలంలోనే క్రిమిసంహారక మందు తాగి చనిపోయాడు.



వరంగల్ జిల్లా చేర్యాలకు చెందిన రైతు బీర్ల అయ్యాలం(45) రెండెకరాల భూమిలో పత్తి సాగు వేశాడు. వర్షాభావంతో పంట పూర్తిగా దెబ్బతింది. రూ.2 లక్షల అప్పులయ్యాయి. అప్పులు ఎలా తీర్చాలనే బెంగతో గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో క్రిమిసంహారక మందు తాగి చనిపోయాడు. ఇదే జిల్లా నర్మెట మండలం పోతారం గ్రామానికి చెందిన ఎండబట్ల రాజు(25) కూడా రెండెకరాల భూమిలో పత్తి సాగు చేస్తున్నాడు. వర్షాభావంతో ఆశించిన దిగుబడి రాలేదు. పెట్టుబడులు, చెల్లి పెళ్లి కోసం కోసం తెచ్చిన  అప్పులు సుమారు రూ.7 లక్షల దాకా పేరుకుపోయూరుు. బుధవారం సాయంత్రం పత్తి చేనుకు మందు పిచికారి చేస్తానని చెప్పి వెళ్లిన రాజు.. వ్యవసాయ బావి వద్ద పురుగుల మందు తాగాడు. చుట్టుపక్కల రైతులు ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ములుగు మండలం బండారుపల్లి శివారు జీవంతరావుపల్లికి చెందిన అజ్మీరా సోనయ్య (35) ఐదెకరాలు కౌలుకు తీసుకుని మొక్కజొన్న పత్తి సాగు చేశాడు. రెండేళ్లుగా అప్పులు పెరిగిపోయాయి. ఈసారి కూడా పంట చేతికందే పరిస్థితి లేకపోవడంతో పొలం వద్ద క్రిమి సంహారక మందు తాగి చనిపోయాడు.



మెదక్ జిల్లా కొల్చారం మండలం సంగాయిపేట గిరిజన తండాకు చెందిన లంబాడి విఠల్ (46) తన రెండెకరాల పొలంలో పంటలు సాగు చేస్తున్నాడు. రెండేళ్లుగా పంటలు చేతికందడం లేదు. అప్పులు చేసి రెండు బోర్లు వేశాడు. నీరు పడకపోవడంతో ఈసారి భూమి సాగు చేయలేకపోయాడు. రుణమాఫీ డబ్బుల కోసం రెండ్రోజులుగా రంగంపేట ఎస్‌బీహెచ్ చుట్టూ తిరుగుతున్నాడు. అప్పులు తీర్చే మార్గం కానరాక గురువారం ఉదయం పొలానికి వెళ్లి అక్కడే చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

 మహబూబ్‌నగర్ జిల్లా మల్దకల్ మండలం మంగంపేటకు చెందిన పరుశరాముడు (23) రెండెకరాల పొలంలో సీడ్‌పత్తి పంట వేశాడు. ఇందుకు రూ.లక్షకుపైగా అప్పు చేశాడు. పంట చేతికొచ్చే పరిస్థితి కనిపించకపోవడంతో పొలంలో పురుగు మందు తాగాడు. ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ చనిపోయాడు. ఇదే జిల్లా జడ్చర్ల మండలం ఆల్వాన్‌పల్లిలో సాకలి శ్రీనివాసులు (38) తన నాలుగెకరాలతోపాటు మరో 9 ఎకరాలను కౌలుకు తీసుకుని పత్తి పంట సాగుచేశాడు. పెట్టుబడులకు రూ.4 లక్షల దాకా అప్పులు తెచ్చాడు. రుణాలు ఎలా తీర్చాలన్న బెంగతో ఇంట్లోనే ఇంట్లోనే ఉరేసుకుని చనిపోయాడు.



 గుండెపోటుతో మరొకరు..

 మెదక్ జిల్లా నారాయణఖేడ్ మండలం తుర్కపల్లికి చెందిన నర్సింహారెడ్డి (52) తనకున్న భూమిని అమ్మి అప్పులు తీర్చాడు. పొట్టకూటి కోసం హైదరాబాద్ వలస వెళ్లి.. ఇటీవల గ్రామానికి తిరిగి వచ్చాడు. ఆరెకరాల భూమిని కౌలు తీసుకుని పెసర, మినుము సాగు చేసినా పంటలు ఎండిపోయాయి. అప్పుల వాళ్ల నుంచి ఒత్తిడి పెరగడంతో గురువారం గుండెపోటుతో కన్నుమూశాడు.

 

కరెంట్ షాక్‌తో ఒకరు..


 మెదక్ జిల్లా టేక్మాల్ మండలం చంద్రుతండాకు చెందిన లాల్‌సింగ్ (40) బుధవారం రాత్రి వరికి నీళ్లు పెట్టడానికి పొలానికి వెళ్లాడు. బోరు నడవకపోవడంతో స్టార్టర్‌ను సరిచేయబోయే యత్నంలో కరెంట్ షాక్‌కు గురై మరణించాడు.



విఠల్ (ఫైల్),

నర్సింహారెడ్డి

పరుశరాముడు

బీర్ల అయ్యాలం

ఆత్మహత్య చేసుకున్న రైతు గంగరాజం

ఎండిపోయిన గంగరాజం నారుమడి

 శ్రీనివాసులు

ఎండబట్ల సంజీవులు

అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య మృతుడు సోనయ్య

 

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top