15,000 మందికో బార్

15,000 మందికో బార్


* జనాభా ప్రాతిపదికన ఏర్పాటు

* గ్రేటర్ పరిధిలో కొత్తగా మరో 117 బార్లు

* ఆదాయం పెంచుకొనేందుకు ఎక్సైజ్ శాఖ నిర్ణయం


 

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా మరిన్ని బార్ల ఏర్పాటుకు అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లోనూ జనాభా ప్రాతిపదికన బార్లకు లెసైన్సులు మంజూరు చేయాలన్న ఎక్సైజ్ శాఖ ప్రతిపాదనలకు ప్రభుత్వం సూత్రప్రాయంగా ఓకే చెప్పింది. దీంతో సగటున 15 వేల జనాభాకు ఒకటి చొప్పున బార్లు ఏర్పాటు కానున్నాయి. ఈ లెక్కన గ్రేటర్ హైదరాబాద్‌లో దాదాపు 117 కొత్త బార్ల ఏర్పాటుకు అవకాశముంది.

 

 ఇక రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీల్లో ఇప్పటికీ బార్లు లేవు, ఆయా పట్టణాల్లో మద్యం దుకాణాలు నిర్వహిస్తున్న లిక్కర్ మాఫియా బార్ల ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఇప్పటివరకు మంత్రాంగం సాగించింది. జనాభా ప్రాతిపదికన అర్హత ఉన్నా బార్ల ఏర్పాటుకు కొందరు ముందుకు వచ్చినా అనుమతులు మంజూరు కాలేదు. కానీ తాజాగా ప్రభుత్వ నిర్ణయంతో మున్సిపాలిటీలతో పాటు నగర పంచాయతీల్లోనూ బార్లు తెరుచుకోనున్నాయి. త్వరలోనే కొత్త బార్లకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉన్నట్లు ఎక్సైజ్ వర్గాలు తెలిపాయి.

 

 మూడు నెలల లెసైన్స్..

 రాష్ట్రవ్యాప్తంగా 2,216 మద్యం దుకాణాలకు అనుమతులు ఉండగా.. 2,112 మద్యం దుకాణాలు గత నెలాఖరు వరకు కొనసాగాయి. వీటిలో 96 దుకాణాల వ్యాపారులు లెసైన్సులు రెన్యూవల్ చేసుకోకపోవడంతో ప్రస్తుతం 2,016 దుకాణాలు కొనసాగుతున్నాయి. రెన్యువల్ కాని 96 దుకాణాలకు తోడు ఎవరూ తీసుకోని మరో 104 దుకాణాలకు మూడునెలల లెసైన్సుల కోసం జిల్లాల వారీగా మంగళవారం నోటిఫికేషన్ వెలువడనుంది. ఇక రాష్ట్రంలో జూన్ నెలాఖరు వరకు 766 బార్లు కొనసాగగా.. రెన్యువల్ చేసుకోని కారణంగా 31 బార్లు మూతపడ్డాయి.

 

 ఈ నేపథ్యంలో పడిపోతున్న రెవెన్యూను కాపాడుకునేందుకు ఎక్సైజ్ శాఖ కొత్త బార్ల ఏర్పాటుకు రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు ఎక్సైజ్ కమిషనర్ ఆర్.వి.చంద్రవదన్ చేసిన సిఫారసుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ నెలాఖరులోగా కొత్త బార్లకు దరఖాస్తులు ఆహ్వానించి, అర్హత గల ప్రాంతాల్లో మంజూరు చేయాలని నిర్ణయించారు. అయితే జూన్‌కు ముందు వివిధ ప్రాంతాల్లో బార్ల ఏర్పాటుకు వచ్చిన దరఖాస్తుల్లో 75 తిరస్కరణకు గురయ్యాయి. ఈసారి మాత్రం జనాభా ప్రాతిపదికన అర్హత గల దరఖాస్తులకు లెసైన్సులు ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం.

 

 గ్రేటర్‌లోనే 117 కొత్త బార్లు

 రాష్ట్రవ్యాప్తంగా 766 బార్లకు లెసైన్సులు ఉండగా.. వాటిలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 516 ఉన్నాయి. కొత్తగా ప్రభుత్వం లెసైన్సులు మంజూరు చేస్తే హైదరాబాద్‌లోనే మరో 117 బార్లకు అవకాశం లభించనుంది. ధూల్‌పేట, సికింద్రాబాద్ యూనిట్లలో బార్లను పెంచాలని భావిస్తున్నారు. అలాగే జీహెచ్‌ఎంసీ పరిధిలోని మెదక్ జిల్లా ప్రాంతంలో ప్రస్తుతం 15 బార్లు మాత్రమే ఉండగా.. వాటి సంఖ్యను రెట్టింపు చేసే ఆలోచనలో ఆబ్కారీ శాఖ ఉంది. ఇక మహబూబ్‌నగర్ జిల్లాలో ఐదు మున్సిపాలిటీలు, 5 నగర పంచాయతీలు ఉండగా.. అక్కడున్న బార్ల సంఖ్య 10 మాత్రమే, మద్యం మాఫియా ఇక్కడ బార్ల ఏర్పాటును అడ్డుకుంటోందన్న ఆరోపణలున్నాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top