‘వైరల్’పై వైద్యశాఖ అప్రమత్తం

‘వైరల్’పై వైద్యశాఖ అప్రమత్తం - Sakshi


- ఇంటింటికీ వైద్యబృందం

- జిల్లాలో డెంగీ మరణాల్లేవు

- ఆర్‌బీఎస్కే ద్వారా  0 నుంచి 18 ఏళ్ల మధ్య పిల్లలకు వైద్య సేవలు అందిస్తాం

- జిల్లా వైద్యశాఖాధికారి బాలాజీ పవార్

సిద్దిపేట జోన్ :
జిల్లాలో ఇటీవల వైరల్ జ్వరాలతో (అంటువ్యాధులు) ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో వైద్యశాఖ అప్రమత్తమైంది. పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందిస్తున్నట్లు జిల్లా వైద్యశాఖాధికారి (డీఎంహెచ్‌ఓ) బాలాజీ పవార్ స్పష్టం చేశారు. గురువారం స్థానిక ఎన్‌జీఓ భవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇటీవల తూప్రాన్‌లో మృతి చెందిన స్వాతిది డెంగీ మరణం కాదన్నారు.  వైద్య రికార్డుల ప్రకారం తీవ్రజ్వరంతో బాధపడుతున్న ఆమెకు కామెర్లు సోకాయన్నారు.



హైదరాబాద్‌లోని ఐబీఎం నివేదికలో డెంగీ ఉన్నట్లు నిర్ధారణ నివేదిక వస్తేనే అధికారికంగా గుర్తించాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుతం జిల్లాలోని అన్ని క్లస్టర్ల వారీగా సమీక్ష చేస్తున్నామన్నారు. గురువారం జోగిపేట, నర్సాపూర్, మెదక్, సిద్దిపేటలో సమీక్షలు నిర్వహించామన్నారు. శుక్రవారం జహీరాబాద్‌లో సమీక్ష చేపడతామన్నారు.  సిబ్బందికి విషజ్వరాలపై పూర్తిస్థాయి అవగాహన ఉందన్నారు. ఇంటింటి సర్వేచేపట్టి దోమల లార్వా దశలను గుర్తించి ప్రజలకు అవగాహన కల్పించే చర్యలు చేపడుతున్నామన్నారు. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, సూపర్‌వైజర్, ఏఎన్‌ఎం, ఆశ వర్కర్లతో కూడిన బృందం తప్పనిసరిగా ప్రతి ఇంటిని సందర్శించాల్సిందేనన్నారు.  బృందానికి 34 రకాల మందులు, పరికరాలతో కూడిన అపెడమిక్ కిట్‌ను అందజేశామన్నారు.  జిల్లా వ్యాప్తంగా ఫాగింగ్ మిషన్లను అందుబాటులో ఉంచామన్నారు.

 

త్వరలో జిల్లాలో ‘ఆరోగ్య సంరక్షణ’

0 నుంచి 18 ఏళ్ల పిల్లల ఆరోగ్య సంరక్షణ పథకం (కేంద్ర ప్రభుత్వ పథకం) త్వరలో జిల్లాలో ప్రారంభం కానుందన్నారు. రాష్ట్రీయ బాల స్వాస్థిక్ కార్యక్రమం (ఆర్‌బీఎస్కే) ద్వారా పిల్లలకు వైద్యపరమై సమస్యలను క్షేత్ర స్థాయిలోనే పరిశీలించి పరిష్కరిస్తామన్నారు. ఇందుకు 13 మొబైల్ టీంలను ఏర్పాటు చేశామన్నారు. ఈ టీంలో కంటి, చిన్నపిల్లల, జనరల్‌తో పాటు ఇతర విభాగాలకు చెందిన వైద్యులు అందుబాటులో ఉంటారన్నారు.



జిల్లా వ్యాప్తంగా 20 ఏఎన్‌ఎం పోస్టులకు 4000 దరఖాస్తులు, 20 ఫార్మాసిస్టు పోస్టులకు 2800 దరఖాస్తులు, 40 మెడికల్ ఆఫీసర్ల పోస్టులకు 200 దరఖాస్తులు వచ్చాయని ఈ నెల 31 లోగా ప్రక్రియను పూర్తిచేస్తామన్నారు.  మెరిట్ ప్రకారం ఎంపిక జరుగుతుందన్నారు. అంతకుముందు క్లస్టర్ పరిధిలో డీఎంహెచ్‌ఓ బాలాజీ పవార్ సమీక్ష నిర్వహించారు.  సమావేశంలో జిల్లా మలేరియా అధికారి నాగయ్య, క్లస్టర్ ఇన్‌చార్జి డాక్టర్ శివానందం,హైరిస్క్ ఇన్‌చార్జి డాక్టర్ కాశీనాథ్‌తో పాటు వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

 

తూప్రాన్‌లో వైద్య శిబిరం

తూప్రాన్ :
తూప్రాన్ రజక కాలనీలో ‘డెంగీ’ జ్వరం బాలికను బలిగొన్న నేపథ్యంలో వైద్యశాఖ అప్రమత్తమైంది. గురువారం పట్టణంలోని రజక కాలనీలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. గజ్వేల్ ఎస్పీహెచ్‌ఓ రామకృష్ణ నేతృత్వంలో తూప్రాన్ వైద్యులు డాక్టర్ సాధన, కృష్ణ ప్రియలు శిబిరంలో పాల్గొని రోగులకు పరీక్షలు జరిపి మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాలనీలో పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు.

 

మంచం పట్టిన ‘మునిగేపల్లి’

కల్హేర్ : కల్హేర్ మండలం మునిగేపల్లి  విష జ్వరాలతో మంచం పట్టింది. గ్రామానికి చెందిన ముగ్గురికి డెంగీ సోకింది. మరో 20 మంది జ్వరాలతో బాధపడుతున్నారు. పది రోజులుగా ఇక్కడ జ్వరాలు ప్రబలుతున్నాయని గురువారం గ్రామస్థులు పేర్కొన్నారు. గ్రామానికి చెందిన మచ్కూరి అల్లమయ్య, కె. భాస్కర్, నాగురి దుర్గయ్యకు డెంగీ సోకినట్టు వైద్యులు నిర్థారించారు. వీరు ముగ్గురూ ఇటీవలే హైదరాబాద్‌లోని యశోద, ఇతర ప్రైవేట్ ఆస్పత్రుల్లో చేరారు. వీరిలో భాస్కర్ చికిత్సానంతరం ఇంటికి చేరగా, మరో ఇద్దరు ఇంకా చికిత్స పొందుతున్నారు. కాగా, మరో 20 మంది విషజ్వరాలతో నారాయణఖేడ్‌లోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top