ఛీఛీఐ


జడ్చర్ల: పత్తి రైతుకు మద్దతు ధర కల్పించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సీసీఐ(కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) కొనుగోలు కేంద్రాలు అక్రమార్కులకు నిలయంగా మారాయని రైతులు ఆరోపిస్తున్నారు. అసలు రైతులను పక్కన పెట్టి దళారులకు ఆశ్రయం కల్పించాయన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి. సీసీఐ కొనుగోళ్లలో రైతులకు బదులుగా దళారులే పెద్ద మొత్తంలో లాభపడ్డారని వారు పేర్కొంటున్నారు. ఈ ఏడాది పత్తికి ప్రభుత్వం క్వింటాలుకు గరిష్టంగా రూ.4,050, కనిష్టంగా రూ.3,750 ధర నిర్ణయించింది. నిబంధనల మేరకు ఉన్న పత్తిని ఈ ధరలకు కొనుగోలు చేసేందుకు జిల్లాలో జడ్చర్లతో పాటు షాద్‌నగర్, నాగర్‌కర్నూల్, గద్వాలలో సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు.



బాదేపల్లి మార్కెట్ యార్డు పరిధిలో సీసీఐ దాదాపుగా 3.26లక్షల క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేసింది. అయితే రైతుల నుంచి నేరుగా ఆయా మార్కెట్లలో కొనుగోలు చేయాల్సి ఉన్నా.. రవాణా ఖర్చులు, తదితర నిర్వహణ బారమవుతుందని సమీప జిన్నింగ్ మిల్లుల దగ్గర సీసీఐ కొనుగోళ్లు చేపట్టింది. బాదేపల్లి మార్కెట్ పరిధికి సంబంధించి జడ్చర్ల శివారులోని శంకరాయపల్లి తండా వద్ద గల జిన్నింగ్ మిల్‌తో పాటు మిడ్జిల్ మండలం ఊర్కొండ శివారులోని జిన్నింగ్ మిల్ వద్ద సీసీఐ కొనుగోల్లు చేపట్టింది.

 

తప్పుడు ద్రువీకరణ పత్రాలతో విక్రయాలు

సీసీఐకి పత్తిని విక్రయించే సమయంలో రైతు సాగుకు సంబంధించి పట్టాదారు పాసుపుస్తకం, వీఆర్‌ఓ ధ్రువీకరణ, బ్యాంకు ఖాతా తదితర పత్రాల నకళ్లు సమర్పించాల్సి ఉంటుంది. అయితే దళారులు నకిలీ ధ్రువీకరణ పత్రాలు అందజేసి తమ పత్తిని సీసీఐకి విక్రయించినట్లు తెలుస్తుంది. వీఆర్‌ఓలకు సంబంధించి నకిలీ స్టాంపులు తయారు చేసి అక్రమాలకు పాల్పడినట్లు సమాచారం. అంతేగాక తమ తమ బంధువులు, అనుయాయుల పేర్ల మీద లక్షల రూపాయలను ఆయా ఖాతాలలోకి మళ్లించినట్లు తెలుస్తుంది. సీసీఐ కొనుగోళ్లపై సమగ్రంగా విచారిస్తే అక్రమాలు బయటకు వచ్చే అవకాశముందని రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ ఆ దిశగా విచారణకు ఆదేశించాలని వారు కోరుతున్నారు.

 

అక్రమాల తీరిలా..

కొనుగోళ్లు మార్కెట్ యార్డులలో కాకుండాతమకు అనుకూలంగా ఉన్న జిన్నింగ్ మిల్లుల దగ్గరే సీసీఐ పత్తిని కొనుగోలు చేసింది. రైతులు సీసీఐకి విక్రయించాలంటే పత్తిని లారీ, ట్రాక్టర్, తదితర వాహనాలలో బస్తాలలో కాకుండా విడిగా తీసుకెళ్లాలి. అయితే అక్కడ సీసీఐ అధికారులు పత్తి నాణ్యతను పరిశీలించి కొనుగోలు చేస్తారు. ఏమాత్రం నిబంధనల ప్రకారం పత్తి లేకున్నా తిరస్కరిస్తారు. దీంతో రైతులు తమ పత్తిని వెనక్కి తీసుకువచ్చి మార్కెట్‌యార్డులు.. లేదా గ్రామాల్లోని ప్రైవేట్ వ్యాపారులకు తక్కువ ధరలకు అమ్ముకోవాల్సిందే.



అంతేగాక రైతులకు వాహనాలు లేక పోవడం, అద్దె వాహనాలలో రోజుల తరబడి మిల్లుల దగ్గర పడిగాపులు గాసే పరిస్థితి లేకపోవడం, తదితర కారణాలతో సీసీఐ కేంద్రలకు వెళ్లడానికి రైతులు అనాసక్తిని కనబరిచారు. దీంతో రైతుల దగ్గర నుండి తక్కువ ధరలకు కొనుగోలు చేసిన దళారులు అదే పత్తిని సీసీఐకి బినామీ రైతుల పేర్ల మీద విక్రయిస్తున్నారు. ఈ సమయంలో సీసీఐ సిబ్బందికి, దళారులకు మధ్య క్వింటాలుకు రూ.100 నుండి రూ.200 దాక చేతులు మారుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి.

 

రైతులకు ఒరిగిందేమీ లేదు

సీసీఐ కొనుగోలు కేంద్రం ఏర్పాటుతో రైతులకు ఒరిగిందేమీ లేదు. కేవలం దళారులకు మాత్రమే సీసీఐ కేంద్రాలు ఉపయోగపడ్డాయి. తాము అమ్మితే సవాలక్ష ఆంక్షలు పెట్టే సీసీఐ అదికారులు బ్రోకర్ల నుండి మాత్రం ఆటంకాలు లేకుండా పత్తిని కొనుగోలు చేశారు. జిన్నింగ్ మిల్లుల దగ్గర గాకుండా మార్కెట్ కేంద్రాలలో సీసీఐ కొనుగోలు చేస్తే రైతులకు లాభం కలిగేది.         - వెంకట్‌రెడ్డి, రైతు, మున్ననూర్

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top