పోలవరంపై ఒడిశా మరో రెండు పిటిషన్లు


సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టుకు అభ్యంతరం చెబుతూ ఒడిశా ప్రభుత్వం దాఖలు చేసిన మరో రెండు మధ్యంతర పిటిషన్లను శుక్రవారం సుప్రీంకోర్టు విచారించింది. పోలవరం ప్రాజెక్టుపై తమ ప్రధాన పిటిషన్‌లో సవరణలకు అవకాశం ఇవ్వాలని కోరుతూ ఒకటి, గిరిజన ప్రాంతాలకు ముప్పు ఉందన్న తమ అభ్యంతరాలకు తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాలు మద్దతిస్తున్నందున విచారణలో వారిని కూడా భాగస్వాములను చేయాలని కోరుతూ మరో పిటిషన్‌ను ఒడిశా దాఖలు చేసింది.  వీటిని శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.ఎస్.ఠాకూర్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది.



ఒడిశా వాదనపై వైఖరి చెప్పాలంటూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌లతో పాటు కేంద్ర జలవనరులు శాఖకు ధర్మాసనం నోటీసు జారీచేసింది. నాలుగు వారాల్లో సమాధానం ఇవ్వాలంది. విచారణలో తొలుత ఒడిశా తరఫున సీనియర్ న్యాయవాది రాజీవ్‌ధవన్ వాదనలు వినిపించారు. తర్వాత ఏపీ తరఫు సీనియర్ న్యాయవాది ఏకే గంగూలీ వాదనలు వినిపిస్తూ.. పోలవరం ప్రాజెక్టు కారణంగా ముంపునకు గురయ్యే ప్రాంతాలతో తెలంగాణకు సంబంధం లేదు. వారిని భాగస్వాములుగా చేర్చాల్సిన పనిలేదు’ అని పేర్కొన్నారు. ఏపీ తరపున అదనపు అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాసరావు, న్యాయవాది గుంటూరు ప్రభాకర్ విచారణకు హాజరయ్యారు.



ఈ విచారణలో తమను భాగస్వాములను చేయాలని మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు గతంలో మధ్యంతర దరఖాస్తులను దాఖలు చేయగా.. అందుకు సుప్రీం కోర్టు సమ్మతించింది. పోలవరం ద్వారా గోదావరి నీటిని కృష్ణా నదికి మళ్లిస్తున్నందున బచావత్ అవార్డు ప్రకారం ఆ జలాల్లో తమకు వాటా దక్కాల్సి ఉందని ఆ రెండు రాష్ట్రాల న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు. అయితే తదుపరి విచారణ తేదీని ధర్మాసనం ప్రకటించాల్సి ఉంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top