ఎన్టీఆర్‌తోనే తెలంగాణలో అభివృద్ధి


  • ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు    

  •  మోత్కుపల్లి దీక్షకు సంఘీభావం

  • సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రాజకీయ చైతన్యం తీసుకొచ్చి పేదలకు సంక్షేమ, అభివృద్ధి పథకాలను అందుబాటులోకి తెచ్చిన తొలి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. జాతీయ రాజకీయాలను శాసించి, పేద ప్రజల కోసం నిరంతరం తపించిన ఎన్టీ రామారావు ఒక ప్రాంతానికి పరిమితమైన వ్యక్తి కాదని ఆయన పేర్కొన్నారు.



    శంషాబాద్ విమానాశ్రయంలో దేశీయ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు పెట్టడంపై తెలంగాణ అసెంబ్లీ వ్యతిరేక తీర్మానం చేయడాన్ని నిరసిస్తూ మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ఎన్టీఆర్ ఘాట్ వద్ద శనివారం నిరసన దీక్ష చేశారు. దీక్షకు వచ్చి ఆయనకు సంఘీభావం ప్రకటించిన చంద్రబాబు మాట్లాడుతూ ఇప్పుడున్న నేతలంతా ఎన్టీఆర్ వల్ల పైకి వచ్చిన వారేనని, వారే ఆయన పేరును వ్యతిరేకించి ద్రోహానికి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు తమ వల్లే వచ్చిందని, దేశీయ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు పెట్టింది తామేనని అన్నారు.



    అంతర్జాతీయ విమానాశ్రయానికి రాజీవ్‌గాంధీ పేరు పెడితే ఆనాడు తాము వ్యతిరేకించలేదని గుర్తు చేశారు. దేశీయ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరును తొలగిస్తే తాము అధికారంలోకి వచ్చిన తరువాత పునరుద్ధరిస్తామని 2009లోనే చెప్పామని అన్నారు. టీడీపీ నేత రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ఎన్టీఆర్ నీడలో రాజకీయ నాయకుడిగా ఎదిగి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ కేంద్రం నిర్ణయాన్ని హర్షిస్తూ అసెంబ్లీలో అభినందన తీర్మానం పెడతారని భావించానన్నారు.



    కాగా, ఉదయం మొదలై సాయంత్రం వరకు సాగిన నర్సింహులు దీక్షను కేంద్ర మంత్రి సుజనా చౌదరి నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. ఈ కార్యక్రమానికి టీడీపీ హైదరాబాద్ అధ్యక్షుడు సి. కృష్ణయాదవ్ అధ్యక్షత వహించగా టీ.టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, ఏపీ మంత్రి రావెల కిషోర్ బాబు, ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాగంటి గోపీనాథ్, ఎ.గాంధీ, రాజేందర్ రెడ్డి, ఎం.కృష్ణారావు, ఇతర నేతలు టి.డి.జనార్దన్, పి.సాయిబాబా, ఎం.ఎన్.శ్రీనివాస్ రావు, మేకల సారంగపాణి, సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

     

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top