వీడని ముంపు

వీడని ముంపు - Sakshi


- ఇంకా జల దిగ్బంధంలోనే చాలా కాలనీలు   

- భండారీ లేఅవుట్ వాసులకు తప్పని ఇబ్బందులు

- విద్యుత్ పునరుద్ధరణపై చేతులెత్తేసిన అధికారులు 

- రంగంలోకి దిగిన సైనిక, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు

- సహాయక చర్యలు ముమ్మరం చేసిన అధికారులు 

- మరో మూడు రోజులు భారీ వర్షాలు పడొచ్చన్న వాతావరణ శాఖ


 

 సాక్షి, హైదరాబాద్: నగరాన్ని వర్షాలు, వరద నీటి కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. శనివారం వర్షాల జోరు తగ్గినా చాలా ప్రాంతాలు జల దిగ్బంధంలోనే ఉన్నాయి. వేలాది మంది ప్రజలు ఆహారం, తాగునీటి కోసం అవస్థలు పడుతున్నారు. నాలాలు పొంగి ప్రవహిస్తూనే ఉన్నాయి. కూకట్‌పల్లి, నిజాం పేట్, భండారీ లేఅవుట్, మల్కాజిగిరి, అల్వాల్ ప్రాంతాలు ముంపులోనే ఉన్నాయి. భారీగా నీరు చేరడంతో రహదారులు దెబ్బతిన్నాయి. పెద్ద పెద్ద గోతులు పడడం తో వాహనాలు ప్రమాదాల బారినపడుతున్నాయి. జీడిమెట్ల ప్రధాన రోడ్డుపై ఏర్పడిన గొయ్యిలో పడి శనివారం ఒక వ్యాన్ బోల్తా పడింది. ఇక ప్రభుత్వం కూడా సహాయ చర్యలను ముమ్మరం చేసింది.



సైన్యంతో పాటు జాతీయ విపత్తు నిర్వహణ బృందాలు(ఎన్‌డీఆర్‌ఎఫ్) రంగంలోకి దిగాయి. పలు చోట్ల బాధితులకు అవసరమైన సహాయం అందించడంతోపాటు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి.. మందులు అందించారు. మరోవైపు అధికారుల ఆదేశాలను బేఖాతరు చేస్తూ పలు పాఠశాలల యాజ మాన్యాలు స్కూళ్లను నడుపుతున్నాయి. శనివారం కూకట్‌పల్లి సర్కిల్ పరిధిలోని ఓ ప్రైవేటు స్కూలు బస్సు పిల్లలను తీసుకెళుతూ ధరణీ నగర్ వద్ద వరద నీటిలో చిక్కుకుపోయింది. స్థానికులు వెంటనే స్పందించి దాదాపు 40 మంది చిన్నారులను కాపాడారు. మరో 3 రోజుల పాటు హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు.



 రంగంలోకి దిగిన సైన్యం

 వర్షాలతో అల్లాడుతున్న నగరంలో సహాయక చర్యల్లో పాల్గొనేందుకు శనివారం సైన్యంతోపాటు ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందా లు రంగంలోకి దిగాయి. అల్వాల్, నిజాంపేట్, బేగంపేట్, హకీంపేటలలో నాలుగు ప్రత్యేక బృందాలు ప్రత్యేక బోట్‌లు, మెడికల్ కిట్లు, ఇతర సామగ్రితో సహాయక చర్యలు ప్రారంభించాయి. బాధితులకు ఆహార పదార్థాలు అందించడం, వైద్య శిబిరాలకు తరలించడంతో పాటు ఇళ్లు, బస్తీల్లో నిలిచిపోయిన నీటిని తొలగించే చర్యలు చేపట్టారు. మరో సైనిక బృందం హుస్సేన్‌సాగర్ వద్ద పరిస్థితిని పరిశీలించింది. దిగువకు నీటిని వదులుతున్నందున.. ఆయా ప్రాంతాల్లో నాలాలను ఆనుకుని ఉన్న బస్తీలు, కాలనీలు ముంపునకు గురికాకుండా చేపట్టాల్సిన చర్యలను సమీక్షించింది. బేగంపేట నాలా పరిధిలోని వడ్డెర బస్తీ, బ్రాహ్మణవాడి, పాటిగడ్డ, ప్రకాశ్‌నగర్, మక్తా తదితర ప్రాంతాల్లో పరిశీలన జరిపారు.







నాచారం, లాలాపేట్ తదితర ప్రాంతాల్లోని బాధిత ప్రజలకు ఆహార పదార్థాలు అందజేశారు.

 చీకట్లోనే భండారీ లేఅవుట్: జల దిగ్బంధంలో చిక్కుకుపోయిన భండారీ లేఅవుట్‌లో పరిస్థితి  దుర్భరంగానే ఉంది.  80 శాతం మంది ఫ్లాట్లకు తాళాలు వేసి, ఇతర ప్రాంతాలకు వెళ్లిపోగా... మిగతావారు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. సెల్లార్లలో నీటిని తోడేస్తున్నా.. వరద నీటితో మళ్లీ నిండిపోతుండడంతో విద్యుత్ పునరుద్ధరణ విషయంలో అధికారులు చేతులెత్తేశారు. దీంతో అనేక అపార్ట్‌మెంట్లు  చీకట్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఇక ఇళ్ల మధ్య, రహదారులపై దాదాపు అడుగు లోతున బురద, డ్రైనేజీ చెత్త నిండిపోవడంతో అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి. దీంతో అంటువ్యాధులు తలెత్తుతాయేమోనన్న భయంలో ఇక్కడివారు గడుపుతున్నారు. ఇక వైద్య ఆరోగ్యశాఖ ఆరు వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి.. మందులు పంపిణీ చేసింది.



 ఇంకా వీడని భయం..

 కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలోని బస్తీల నిండా మురుగునీరు, చెత్తా చెదారం పేరుకుపోయాయి. అయోధ్యనగర్, గంపల బస్తీ, సుభాష్‌నగర్ నాలా ప్రాంతాల్లో పరిస్థితి  దారుణంగా ఉంది. వర్షపు నీరు భారీగా నిలిచిపోవడంతో కొంపల్లి ఉమామహేశ్వర కాలనీలో ప్రజలు ఇళ్లకు తాళాలు వేసి వెళ్లిపోతున్నారు. నాచారం ప్రధాన మార్గంలోని కల్వర్టు నాలుగు రోజులుగా ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తూనే ఉంది. దీంతో శనివారం కూడా ఈ మార్గంలో రాకపోకలను నిలిపివేశారు. ఇక్కడి రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయి. వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.



 కాలనీల నిండా నీరే..

 వర్షం కాస్త తగ్గినా అల్వాల్ ప్రాంతంలో చాలా కాలనీలు ఇంకా జల దిగ్బంధంలోనే ఉన్నాయి. మోత్కులకుంట చెరువు, కొత్త చెరువు, చిన్నరాయుని చెరువుల్లో నీటి చేరిక తగ్గింది. వెంకటాపురంలోని దినకర్‌నగర్, రాంచంద్రయ్య కాలనీ, వెస్ట్ వెంకటాపురం కాలనీ, శివానగర్, కానాజిగూడ ప్రాంతాల్లో వరద కొద్దిగా తగ్గింది. అయితే ఓల్డ్ అల్వాల్‌లోని భారతీనగర్, శ్రీనివాసనగర్, ఆనందరావునగర్, బొల్లారం తుర్కపల్లి, బుడగ జంగాల కాలనీ, బటన్‌గూడ ప్రాంతాలు ముంపులోనే ఉన్నాయి. అల్వాల్‌లోని ముంపు ప్రాంతాల్లో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పర్యటించి కాలనీవాసులతో మాట్లాడారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top